వెనుకటి తిండి~~~~~~~~~~
ఓమ, నువ్వులువేసి
ఉప్పి, కొట్టిచేసిన.. తెల్లజొన్న రొట్టె !
Ads
జిలుకర ఎల్లిపాయలు వేసి
గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్రమిరుప కారం !!
అచ్చమైన తెలంగాణపల్లె సంప్రదాయకమైన తిండి.
సాయజొన్న ముచ్చట:
వెనుకట సాయజొన్న పంట పండుతుండే.
చెరువుల కింద ఉన్న వందురు పొలంల తప్ప
వరి పంటకు పెద్దగ విలువ లేని బంగారు కాలమది.
వానకాలం, చలికాలం రెండు పంటలు జొన్నపంట పండేది.
ఈ చలికాలంల కేవలం మంచుతో పండే జొన్నే సాయజొన్న.
ఎనబై యేండ్ల పెద్దలను కదిలిస్తె ఎన్నెన్ని చెపుతరో…
సాయ జొన్నతిండి రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఇంటికోసం సాయ జొన్నలే కొట్టెలు, గుమ్ములకు ఎత్తుదురు.
చలికాలంల కురిసిన మంచుతో నల్ల రేగళ్లల్ల, చెరువు శిఖంల
శెనిగె, కొత్తిమీరు, కంది, అనుము, టమాట మొదలైన పంటలు,
ఎర్ర దుబ్బ భూములల్ల ఉలువ పంట బొంబాటుగ పండుతుండె.
ఇదే దుబ్బ చెలుక మీద వంటాముదానికి ఆయిందాలు పండేవి.
విత్తనం వేసింది గుత్త, కల్లం లేచేదాక చెట్టుకు మందన్నదె లేదు.
ఇవన్నీ ఈ చలికాలంల అమృతమోలె కమ్మదనం కలిగి వుండేవి.
అవి తిని మురిసినవారికి ఈ మందుల తిండి మరణంతో సమానం.
ఇది… మన తిండి – మన చరిత్ర…. ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
(ఉప్పుడు = మసిలే నీళ్లల్ల పిండి బోసి కలిపి పెట్టుకునుడు… కొట్టి చేసుడు = పీట మీద చేతితోటి గట్టిగ కొట్టిచేసుడు… ఓమ = వాము… బొంబాటుగ = బ్రహ్మాండంగా…)
Share this Article