అప్పట్లో నేనే రాసిన ఓ పోస్టు యాదికొచ్చింది… చట్టం అంటే ఏమిటి..? ధర్మం అంటే ఏమిటి..? న్యాయం అంటే ఏమిటి..?
వ్యాపారంలో నష్టపోయి దిక్కుతోచకుండా ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఎలాంటి ప్రామిసరీ నోటు కానీ గ్యారెంటీ కానీ లేకుండా నీకు ఎంతో కొంత అప్పు ఇచ్చాడు… దాంతో నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి బాగా వృద్ధిలోకి వచ్చావు… ఈలోపు నీ స్నేహితుడు ఏదో ప్రమాదంలో మరణించాడు… సంపాదన మార్గం లేక అతడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడింది. నీ స్నేహితుడు నీకు అప్పు ఇచ్చినట్లు ఎలాంటి రుజువులూ సాక్ష్యాలూ లేవు కాబట్టి నువ్వు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అని చట్టం చెప్పుతుంది… నీ స్నేహితుడు ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని న్యాయం చెప్పుతుంది… డబ్బును వడ్డీతో సహా తిరిగిచ్చి, నీ స్నేహితుడి కుటుంబం మళ్ళీ నిలదొక్కుకునే దాకా అండగా నిలబడాలని ధర్మం ధర్మం చెప్పుతుంది…
ఈ వార్త ఒకటి చదువుతుంటే ఈ న్యాయధర్మాల మీమాంస ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు గానీ… ఓసారి ఈ వార్త సారాంశం ఏమిటంటే..? ‘‘మున్సిపాలిటీలో పందుల బెడద ఎక్కువగా ఉందనీ, వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు మొరపెట్టుకున్నారు… దీంతో చైర్‌పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ రంగంలోెకి దిగాడు, పందుల పెంపకందార్లను పిలిచి పట్టణంలో పందులు తిరగకూడదనీ, ఊరి బయటకు తరలించాలని చెప్పాడు…
Ads
కానీ వాళ్లు వినలేదు, దాంతో రవీందర్ తెలివిగా ఓ ప్లాన్ వేశాడు… పోలీసుల సాయంతో ఆ పందుల పెంపకందార్లను నిర్బంధించి, ఆ పందులన్నీ పట్టి వేరే రాష్ట్రాల్లో అమ్మేశాడు… తొలిసారి 20 లారీల్లో 80 టన్నులు (పందుల్ని టన్నుల్లో కొలుస్తున్నాం ఇక్కడ), తరువాత మరో 8 టన్నులు అమ్మేస్తే కిలోకు 1.39 రేటు వచ్చింది… మొత్తం వచ్చిన సొమ్ము 1.2 కోట్లు అట…
తరువాత గెలిచిన కొత్త ఎమ్మెల్యేకు పందుల పెంపకందార్లు మొరపెట్టుకున్నారు… ఆయన సీరియస్ అయ్యాడు… ఆయన కాంగ్రెస్, ఆరోపణలు వచ్చింది బీఆర్ఎస్ నేతలపై… సో, ఎంక్వయిరీ అన్నాడు… పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… నో, నో, నాకెలాంటి సంబంధం లేదు, నేను పర్మిషన్ ఇవ్వలేదు అని కమిషనర్ జారుకున్నాడు… కేసు ఎటుపోతుందో చూడాల్సి ఉంది… ఈలోపు అవిశ్వాసంతో ఆమె కుర్చీ దిగే చాన్స్ కూడా ఉంది…
సీన్ కట్ చేస్తే… ప్రజల కోసమే, వాళ్ల కోరిక కోసమే నేను వాటిని బయటికి తరలించాను, మంచి చేశాను అనే ఓ సమర్థన రవీందర్ దగ్గర ఉంది… అది నా పాలన ధర్మం, చట్టం అంటాడేమో… తనకు ప్రజలు సపోర్ట్ చేయడం ధర్మం, అధికారులూ మద్దతునివ్వడం న్యాయం అంటాడేమో… కానీ ఇక్కడ నిజానికి పందులపెంపకందార్లకు నచ్చజెప్పి పందులను బయటికి తరలింపజేయడం చట్టం… బయటికి అమ్ముకోవడం కాదు… అవసరమైతే ప్రభుత్వపరంగా పెంపకందార్లకు సాయం చేయడం న్యాయం… అంతేకాదు, ఈక్రమంలో వాళ్లకు నష్టం వాటిల్లితే కొంత చెల్లించడం ధర్మం…
ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమిటంటే… బీఆర్ఎస్ లీడర్లు ఆబగా, ఏళ్లుగా ఆకలిగొన్నట్టుగా సొసైటీ మీద పడ్డారు… ఏదీ వదల్లేదు… చివరకు పందులను కూడా అమ్ముకున్నారు… ఈ యావను ఏమని పిలవాలి..? అయ్యా, కేసీయారూ… నిన్ను నమ్మిన తెలంగాణ సమాజం మీద ఎలాంటి వాళ్లను నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా రుద్దావు మహాప్రభూ… తల్లి తెలంగాణ రుణం ఇలా తీర్చుకున్నావా..?!
Share this Article