వేల ఏళ్ల నాటి చరిత్ర… వందల ఏళ్ల ఉద్రిక్తత… ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆకాంక్షసౌధం… అయోధ్య రామజన్మభూమి…! అనేక తరాలుగా ఈ జాతికి ఆదర్శపురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలి, యావత్ హిందూ జాతికి పవిత్రస్థలి… అనేకానేక చిక్కుముళ్లను విప్పుకుంటూ, అడ్డంకుల్ని దాటుకుంటూ ఇప్పుడొక భవ్యమందిరం నిర్మితమవుతోంది… మొదటి దశ పూర్తయ్యింది…
22న ప్రాణప్రతిష్ట… దేశంలో ప్రతి గడపకూ రాములవారి అక్షితలు చేరుతున్నయ్… వేల మంది సాధుసంతులు, దేశప్రముఖులతో ఆరోజున ఓ భారీ స్వప్నం సాకారం కానుంది… అయితే..? ఇంతకీ అక్కడ ప్రతిష్ఠించబోయే విగ్రహం ఏది…? అదేమిటి..? అక్కడ ఆల్‌రెడీ విగ్రహాలున్నాయి కదా, మళ్లీ కొత్తగా ఈ విగ్రహం ప్రస్తావన ఏమిటి అంటారా..? ఇంకాస్త సస్పెన్స్ మిగిలే ఉంది…
Ads
పీటీఐ వార్త ప్రకారం చూస్తే….. చాన్నాళ్లుగా పూజలు అందుకుంటున్న విగ్రహాలను అలాగే ఉంచుతారు… ఉత్సవ సమయాల్లో వాటిని దర్శనానికి అనుమతిస్తారు… రాబోయే 22వ తేదీన అసలైన ప్రాణప్రతిష్ట జరుపుకోబోయేది మాత్రం కొత్త విగ్రహాలే… మరి వాటి సంగతేమిటి..? వాటిని జనానికి ఎందుకు చూపించడం లేదు అంటారా..? ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో ఇంకా ఖరారు కాలేదు కాబట్టి…!
మొన్న సోమవారం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అరుణ్ యోగిరాజ్ అనే శిల్పిని అభినందించాడు… నువ్వు చేసిన విగ్రహానికి కోట్ల మంది పూజలు దక్కబోతున్నాయి, నీ జన్మ ధన్యం అంటూ..! నిజమేనా అని పీటీఐ రాజజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాల్ని సంప్రదిస్తే… ‘‘ఇంకా తుది నిర్ణయం జరగలేదు’’ అనే సమాధానం వచ్చింది… (అప్పుడే సాక్షి వంటి పత్రికల్లో సదరు శిల్పి ప్రస్థానం మీద ప్రత్యేక స్టోరీలు కుమ్మేస్తున్నారు…)
ట్రస్టు ఆఫీస్ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్త ఏమంటాడంటే… ‘‘శంకరాచార్య విజయేంద్ర సరస్వతి, ఇతర మఠాధిపతులు, సాధువుల అభిప్రాయాల్ని తీసుకుని తుది నిర్ణయం తీసుకోబడుతుంది… అందుకని సరైన సమయంలో ఆ విగ్రహ స్వరూపాన్ని జనానికి ప్రదర్శిస్తాం…’’ మూడు వేర్వేరు విగ్రహాలను చెక్కిస్తున్నారు… వేర్వేరు ప్రదేశాల రాళ్లను దానికి వినియోగిస్తున్నారు… రెండు శిలలు కర్నాటకవి… ఒకటి రాజస్థాన్ శిల…
రాజస్థాన్ శిలను శిల్పంగా మలుస్తున్న శిల్పి జైపూర్‌కు చెందిన సత్యనారాయణ పాండే… కర్నాటకలో ఆ పనిచేస్తున్నది గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్… ఆ మూడు శిల్పాల మన్నిక, స్వరూపం, నాణ్యతలను పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటారు… సో, యడ్యూరప్ప అభినందనలు అందుకున్న శిల్పాన్నే ప్రతిష్ఠకు ఎంచుకున్నారనేది నిజం కాదు, రేప్పొద్దున నిజమే కావచ్చు కూడా… యడ్యూరప్ప కొడుకు, కర్నాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కూడా యోగిరాజ్‌ను అప్పుడే అభినందించేశాడు… కాస్త ఆగండి మహాశయా… రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును తుది నిర్ణయం తీసుకోనివ్వండి…!
చివరగా… మరో రెండు శిలల గురించీ చెప్పుకోవాలి… అయోధ్య రాముడి రూపం కోసం నేపాల్ అధికారికంగా రెండు శిలలలను పంపించింది… 27 టన్నులు ఒకటి, 14 టన్నులు మరొకటి… పూజలు చేసి, రాముడి అత్తింటి ఊరు, అనగా జనకపూర్ మీదుగా తరలించారు… కానీ అవి శిల్పాలకు పనికిరావని అయోధ్య శిల్పకళాకారులు తేల్చడంతో వాటిని వాపస్ పంపలేక అలాగే ఉంచేశారు… మా బిడ్డకు పంపించిన కానుకలు అవి, వాపస్ తీసుకుంటామా అని నేపాల్ గండకీ ప్రావిన్స్ ప్రతినిధులు అంటున్నారు… అయోధ్య మొత్తం పూర్తయ్యాక ఎక్కడో ఓ చోట ఈ శిలలూ మనకు పూజలు చేయించుకుంటూ కనిపిస్తాయి…!!
Share this Article