ఒక వార్త… ‘‘బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లలోనే కాదు… ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపించింది… డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబరు 29న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 2023 ఏడాది రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేసి, అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన సినిమాగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది…’’
నిజమేనా..? ఓటీటీలో ఎందరు చూశారు..? ఎన్ని నిమిషాల వ్యూయింగ్ టైమ్ రికార్డయింది..? ఆయా ప్లాట్‌ఫారాలు స్వయంగా ప్రకటించాల్సిందే తప్ప థర్డ్ పార్టీకి ఆ లెక్కలు ఇవ్వరు, వాటి నిజానిజాల పరిశీలన కూడా సాధ్యం కాదు… మీడియాలో సినిమాల కలెక్షన్ల లెక్కల ప్రకటనలు వస్తుంటాయి కదా, ఇవీ అలాంటివే…
ఎస్, సినిమా బాగుంది… మరీ ఉరికీ ఉరికీ థియేటర్లలో చూడాల్సిన సినిమా ఏమీ కాకపోయినా… ఓటీటీలో, టీవీలో చూడదగిన సినిమాయే… ప్రత్యేకించి 12వ తరగతి ఫెయిలైనా సరే, పట్టువదలక, కష్టపడి, అనేక అవరోధాలు దాటి సివిల్స్ క్రాక్ చేసిన మనోజ్‌కుమార్‌శర్మ అనే ఐపీఎస్ అధికారి స్పూర్తిదాయక బయోపిక్… ఇలాంటి కథలే యువతలో భరోసాను నింపుతాయి… ముందుకు నడిపిస్తాయి…
Ads
20 కోట్ల ఖర్చు అట సినిమా నిర్మాణానికి… విడుదల చేసింది కూడా 600 స్క్రీన్లలో మాత్రమే… నిజానికి విధు వినోద్ చోప్రా గత సినిమాలని బట్టి చూస్తే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావల్సింది… అఫ్‌కోర్స్ 52 రోజుల్లో 66 కోట్ల వసూళ్లు అంటే సినిమా హిట్టయినట్టే… తక్కువ నిర్మాణవ్యయం ఎప్పుడూ మేకర్స్‌కు సేఫ్, టెన్షన్ లెస్… సినిమాకు పెద్దగా ప్రమోషన్ వర్క్ కూడా చేసినట్టు లేదు… ఒకసారి ఇతర భాషల్లో కలెక్షన్లను చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది…
దీన్ని తెలుగు, కన్నడంలో కూడా రిలీజ్ చేశారు… కానీ ఏ థియేటర్లలో ఆడిందో, ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు… అంత అనామకంగా నడిచింది… Sacnilk రిపోర్టు ప్రకారం… కన్నడంలో మూడు రోజులు ఆడింది… మొత్తం వసూళ్లు 4 లక్షలు… తెలుగులో ఏడు రోజులు… వసూళ్లు 10 లక్షలు… మౌత్ టాక్ లేదు, ప్రమోషన్ లేదు… ఐనా సరే, ఓటీటీలో విడుదలైన మూడే రోజుల్లో ఏడాది రికార్డులు మొత్తాన్ని కొల్లగొట్టినట్టు డిస్నీప్లస్ హాట్‌స్టార్ చెబుతోంది…
సరే, సినిమా సంగతికొద్దాం… చూడదగిన సినిమాయే… రామానందసాగర్‌కు సవతి బ్రదర్, పుట్టుకతో కశ్మీరీ విధు వినోద్ చోప్రా గత సినిమాలన్నీ తమదైన ముద్ర వేసినవే… 1942 – ఎ లవ్ స్టోరీతో మొదలైన తన ప్రస్థానం ఈ 12 th ఫెయిల్ దాకా ఓ విశిష్ట ప్రయాణమే… ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది… మున్నాభాయ్‌లో గాంధీగిరిలాగా… కేవలం నిర్మాతగా లగేరహో మున్నాభాయ్, పీకే, త్రీ ఇడియట్స్ వంటివి తీసినా, దర్శకుడిగా 13 ఏళ్లపాటు మౌనంగా ఉండిపోయినా… ఇప్పుడు శిఖర, 12 th ఫెయిల్‌లతో మళ్లీ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిపోయాడు… 12 th ఫెయిల్ సినిమాకు ఎడిటర్ కూడా… 71 ఏళ్ల వయస్సులోనూ అవిశ్రాంత ప్రయాణం… సినిమాతోపాటు ఆయన కూడా 12 th ఫెయిల్ కాదు, 12 th డిస్టింక్షన్ పాస్…!!
Share this Article