స్టెప్పులు… సినిమా పాటలకు రికార్డింగ్ డాన్సులు… హయ్యో, గతంలో జాతరల్లోనో, ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనే వినిపించేవి… ప్రసిద్ధ నటీనటులను అనుకరిస్తూ డాన్సులు అనబడే అడ్డమైన పిచ్చి గెంతులను వేసేవాళ్లు… జనమూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు… ఇప్పుడా స్టెప్పులు ఇంకా మన జీవితాల్లోకి, మన ఇతర వినోదాల్లోకి చొచ్చుకువచ్చేసి, స్టెప్పులేయిస్తున్నయ్… ఈ జ్ఞానోదయం ఎప్పుడొచ్చిందీ అంటే… మొన్నామధ్య కామెడీ స్టార్స్ ప్రారంభ ఎపిసోడ్ చూడబడినప్పుడు…! బైరాగిలా గడ్డం పెంచిన ఓ ఓంకారుడు హాస్యనటులను, ఆ టీంలను పరిచయం చేయడానికి వచ్చాడు… ప్రతి కమెడియన్ ఏదో పిచ్చి పాటకు ఇంకేవో పిచ్చి పిచ్చి స్టెప్పులు వేస్తూ వేదిక మీదకు వచ్చారు… చివరకు యాంకరిణి కూడా… ఆ ఒక్క ఓంకారుడికి మాత్రం ఒక్క స్టెప్పూ చేతకాదు, అది వదిలేయండి…
గతంలో కామెడీ వేరు, డాన్సులు వేరు, సంగీతం వేరు… ఇప్పుడన్నీ కలగూరగంప కిచిడీ… స్టెప్పులు లేనిదే జీవితం లేదు… ఏ ఎంట్రీ కావాలన్నా సరే… రాములో రాములా లేక నెక్కిలీసు గొలుసూ అంటే ఎగురుతూ రావాల్సిందే… అసలు కామెడీ స్టార్స్ ప్రోగ్రాముకూ డాన్సులకూ లింక్ ఏమిటీ అంటారా..? అలా అడిగితే మీరు అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క… అసలు కామెడీ ఏమిటి..? ఈ జీటీవీ వాడు సంగీత ప్రోగ్రాములో కూడా జడ్జిలతో స్టెప్పులేయించగలడు… పాత స్వరాభిషేకం షోలు యూట్యూబులో చూడండి… సింగర్ మనోను పాటలు పాడవయ్యా మగడా అంటే, తోటి లేడీ సింగర్లతో స్టెప్పులు వేయించే పాటలు బోలెడు… అంతెందుకు అంతటి వీర యాంకరిణి సుమ కూడా ఈమధ్య తప్పనిసరై క్యాష్, స్టార్ మహిళ, బిగ్ సెలబ్రిటీ ప్రోగ్రాముల్లో కూడా స్టెప్పులు వేస్తోంది… వచ్చిన పార్టిసిపెంట్లకూ, గెస్టులకూ స్టెప్పులు తప్పడం లేదు… తప్పదు… రాకేష్, రోహిణి స్టెప్పులు… వర్ష, ఇమాన్ రొమాన్స్ డాన్సులు…. ఎవరూ అతీతులు కాదు… రోజా ఎంట్రీకి కూడా స్టెప్పులే…
Ads
బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ టైములో స్టెప్పులే… సారీ, వాటిని డాన్సులు అనాలట… రోజూ పొద్దున్నే హౌజులో రికార్డింగ్ డాన్సులతో మేల్కొలుపు, స్టెప్పులతో దినారంభం… పోటీల్లో కూడా అవే… ఇప్పుడు మళ్లీ ఉత్సవం పేరిట మాటీవీ వాడు బిగ్ బాస్ contestants తో ఏదో సీరిస్ స్టార్ట్ చేశాడు… అందులో కూడా స్టెప్పులు… గంగవ్వకు కూడా తప్పడం లేదు… చివరకు ఆ ఈటీవీ జబర్దస్త్ షోలో కూడా స్కిట్ స్టార్ట్ కావాలంటే ముందుగా టీం లీడర్ లేదా మరొకరు ఏదో ఓ తిక్క పాటకు డాన్స్ చేస్తూ రావల్సిందే… లేకపోతే, స్టెప్పులు రాకపోతే ఆ కమెడియన్ చరిత్ర ఇక సమాప్తం… డాన్సులను కామెడీ చేశారు, వోకే.., మ్యూజిక్ షోలను కామెడీ చేశారు, వోకే.., ఏ షో చేసినా సరే కామెడీ కంపల్సరీ, వోకే… కానీ కామెడీలో డాన్సులు మరో కంపల్సరీ… ఒక అనసూయ, ఒక రష్మి పాపులర్ కావడానికి ఈ స్టెప్పుల ప్రావీణ్యం కాస్త ఉండటమే… సుడిగాలి సుధీర్ ఈ స్టెప్పులో ప్రవీణుడు, మిగతా కమెడియన్లు తనను అందుకోలేకపోతున్నారు… ఈ స్టెప్పులు, ఈ కామెడీ మిక్సింగ్ కేరక్టర్‌కు మంచి ఉదాహరణ బాబా భాస్కర్… తరువాత పండు ఎట్సెట్రా…
మోనాల్ మంచి ఐటమ్ డాన్సర్, ఇప్పుడు ఏదో షోలో జడ్జి… మధ్యమధ్య కామెడీ స్కిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది… అసలు జబర్దస్త్ మాత్రమే కాదు, కొత్తగా స్టార్టయిన శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ కామెడీ షోలలో కూడా ఈ స్టెప్పులదే ప్రధానపాత్ర… కమెడియన్ల ఏజ్, గేజ్ ఎలాగున్నా సరే… స్టెప్పాల్సిందే… స్టెప్పులు నేర్వకపోతే, కెరీర్లో ఇక ఎక్కేందుకు స్టెప్పులు దొరకవు… తెలుగు టీవీ రంగం దుస్ధితి మాత్రమే కాదు బాసూ… అసలు మన జీవితంలోకి కూడా ఈ స్టెప్పులు, రికార్డింగ్ డాన్సులు పెద్ద పెద్ద స్టెప్పులు వేస్తూ వచ్చేశాయి కదా… మనది కాని సంగీత్ అనే ప్రోగ్రాములు మన పెళ్లిళ్లలో పెట్టేసుకుంటున్నాం కదా… దిక్కుమాలిన ఖర్చు… ముఖ్యులందరూ రికార్డింగు డాన్సులు చేయాల్సిందే… ఈ స్టెప్పులు నేర్పేందుకు వేల ఫీజులతో ప్రత్యేక నిపుణులు, సెషన్లు… ఇరుక్కుపో వంటి పాటలకు కూడా ఆడలేడీస్ మెలికలు తిరుగుతుంటే చప్పట్లు కొట్టడం లేదా..? ఆఫ్టరాల్ టీవీ కమెడియన్లకు స్టెప్పులు వేయడం, వేసే తెలివి ఉండటం కంపల్సరీ అర్హతగా మారితే పెద్ద విశేషం ఏముంది..? అంతే, అంతే… ఏదైనా వినోదమే కదా… ఎటొచ్చీ, ఈ స్టెప్పుల్లో పడి అసలు కామెడీ ఎక్కడో ఎగిరిపోవడం మాత్రమే కాస్త విషాదం… టీవినోదంలో విషాదం…!! మీరు టీవీ న్యూస్ చానెల్ ట్యూన్ చేశారు… ఓ మేల్ న్యూస్ రీడర్, ఓ ఫిమేల్ న్యూస్ రీడర్ కలిసి ఓ పాటకు స్టెప్పులేస్తూ వచ్చి న్యూస్ స్టార్ట్ చేశారు… ఫీల్డ్‌లో ఉన్న రిపోర్టర్‌ను లైన్లోకి తీసుకున్నారు, ఆ రిపోర్టరూ నాలుగు స్టెప్పులేసి న్యూస్ చెప్పడం స్టార్ట్ చేసింది…… నవ్వొచ్చిందా..? ఏమో, ఆ రోజులూ రాబోతున్నాయేమో… స్టెప్పులండీ బాబూ, స్టెప్పులు మరి..!! కామెడీకి సోకిన జాంబీ వైరస్ న్యూస్‌కు సోకవద్దని ఏముంది..?!
Share this Article