ఒక వార్త చదవగానే… పనిచేతకానోడు పానాాలు (టూల్స్-పరికరాలు) బాగా లేవని ఏడ్చాడట… ఈ వాక్యం గుర్తొచ్చింది… తిరుమల వెంకన్నకు చేసే సేవ ఏమీ ఉండదు, ప్రతి ఒక్కడూ అక్కడ పెత్తనాలు చేసేవాడే… రాజకీయాలు, అక్రమాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, దర్శనాలు, వసతి, ఆడంబర ప్రదర్శన… అన్నీ కలుషితమే అక్కడ… సరే, వార్త ఏమిటంటే..?
ఈవో ధర్మారెడ్డి పట్టు ఎక్కువ కదా తిరుమలలో… రాజకీయ నాయకుల తరహాలో డయల్ యువర్ ఈవో అని ఓ ప్రోగ్రాం పెడుతుంటాడు… చక్కగా తిరుమలలో ఫీడ్ బ్యాక్, సూచనలు కోరుతూ బాక్సులు పెట్టొచ్చు కదా, ఫిర్యాదులు కూడా చేయడానికి వెబ్ సైట్ వాడుకోవచ్చు కదా… సరే, రీసెంటు డయల్ షోలో ఎవరో మాట్లాడుతూ లడ్డూ మూడు రోజులకే పాడైపోతోంది అని ఆరోపించాడు…
Ads
నిజమే, ఒకప్పుడు తిరుపతి లడ్డూ అంటే భక్తితోపాటు బ్రహ్మాండమైన రుచి… పదీపదిహేను రోజులు బంధుమిత్రులకు లడ్డూ పంచిపెట్టేవారు… ఆ లడ్డూ నాణ్యత భ్రష్టుపట్టిపోవడం చాన్నాళ్లుగా సాగుతోంది… చివరకు అది ప్రసాదంగా కాదు, ఇప్పుడు తిరుమలలో అమ్మకపు సరుకు అయిపోయింది… నిష్ఠురంగా ఉన్నా సరే, అదొక తిరుమల బ్రాండ్ మిఠాయి… అంతే…
ఈ ఆరోపణకు సదరు ‘ధర్మా’రెడ్డి నెపాన్ని శ్రీవైష్ణవ బ్రాహ్మణులపైకి నెట్టేశాడు సింపుల్‌గా… మధ్యలో పాపం వాళ్లేం చేశారు… వాళ్లు పనివాళ్లు మాత్రమే… దిట్టం సరిగ్గా ఉంటే… అంటే, లడ్డూ తయారీకి వెచ్చించే సరుకులు నాణ్యతతో ఉంటే, సరైన మోతాదులో అన్నీ కలిస్తే లడ్డూ బాగుంటుంది… చాన్నాళ్లు ఉంటుంది… ఆ దిట్టమే కట్టుదిట్టంగా లేక, లడ్డూ చేసేవాడు సరిగ్గా చేయడం లేదని సాకులు దేనికి..?
ఒకప్పుడు సింపుల్‌గా తీపి బూందీతో మొదలై ఎప్పుడో 1700 నుంచి లడ్డూ భక్తులు అందుతోంది… అత్యంత నాణ్యమైన సరుకుల్ని కొని లడ్డూలు తీయారు చేసేవాళ్లు… మరీ ఇరవై ముప్ఫయ్ ఏళ్లుగా రాజకీయ, పరిపాలన వాతావరణం కలుషితమైపోయి, తిరుమల మొత్తం ఆవరించి చివరకు లడ్డూ కూడా అలా కట్టుతప్పిపోయింది… లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యమైన నెయ్యి ప్రధానం, అటువంటి నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నిర్వహిస్తున్న నందిని డెయిరీ సరఫరా చేసేది. ప్రస్తుతం సరఫరా చేయడంలేదు, కారణం ధరలు పెరగడం…
మిగతా దినుసులకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తారు… ఏ వన్ గ్రేడ్ సరుకుల్ని సప్లయ్ చేయాలి… టెండర్లు, సరఫరాదారులు అనగానే మీకు అర్థమైంది కదా బాగోతాలెలా ఉంటాయో… నాణ్యతను నిర్దారించే అధికారులు ఎలాంటివాళ్లు..? దీనిపై క్రాస్ చెక్ ఉందా..? ఇవేవీ లేకుండా లడ్డూలు చేసే పనివాళ్లను నిందించి ప్రయోజనం ఏముంది..? చేతగానితనం… శతాబ్దాలుగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన వెంకన్న కేవలం రాజకీయ ప్రమేయాలు, నియామకాల కారణంగా ఫాఫం ఇలా బదనాం అయిపోతున్నాడు…
ఆదాయం లేదాా..? ఆస్తులు లేవా..? భక్తులు కానుకలు ఇవ్వడం లేదా..? అన్నీ ఉన్నా కనీసం లడ్డూ కూడా సరిగ్గా చేయించలేని దురవస్థ… అమ్మకాలు ఆపేయండి, సొంత తయారీ మానేయండి, ఏ అంబానీనో, ఏ ఆదానీనో అడగండి… ప్రతి భక్తుడికీ ఉచితంగా అద్భుతమైన లడ్డూను అందిస్తారు… కేవలం ఒకటే… అదనపు లడ్డూ ఇవ్వొద్దు… అప్పుడు తిరుమల లడ్డూ వాల్యూ ఏమిటో తెలుస్తుంది… అది వీళ్లకు చేతకాదు… ఈ జగన్‌లూ, ఈ చంద్రబాబులకు రాజకీయాలు తప్ప భక్తేం పట్టింది..? ఇక్కడ దుబారా ఖర్చులు, ప్రొటోకాల్ మర్యాదలు గట్రా తీసేస్తే, ఆదా అయ్యే డబ్బుతో ఫ్రీ లడ్డూ, మంచి నాణ్యతతో ఇవ్వొచ్చు…
కాలనీల్లో, చిన్న ఊళ్లలోని గుళ్లలో పెట్టే లడ్డూ ప్రసాదం బాగుంటోంది… పులిహోర, ఇతర ప్రసాదాలు నాణ్యతతో ఉంటాయి… ఎటొచ్చీ తిరుమల లడ్డూ నానాటికీ తీసికట్టు… ఈరోజుకూ ఆస్థానం లడ్డూగా పిలిచే ప్రసాదం బాగుంటుంది… గౌరవ అతిథులకు మాత్రమే ఇవ్వబడతాయి… ఆ వెంకన్న దగ్గర ఈ అతిథి మర్యాదలు ఏమిటో మరి… కల్యాణం లడ్డూ కూడా పర్లేదు… కోట్ల మంది భక్తుల మెప్పు పొందేలా ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రయత్నించేవాడు లేడక్కడ… ప్చ్, వెంకన్న గ్రహచారం బాగాలేదు…!!
Share this Article