ఏదో సైటులోనే కనిపించిన వార్త… అది చదివాక… ఫాఫం, ఏపీ పోలీసులు నోరూవాయి లేని కేరక్టర్లు, ఆధునిక పోలీసు జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నారో ఏమిటో పాపం అనిపించింది… అనవసరంగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పోలీసులను ఆడిపోసుకుంటున్నారు గానీ… తన హయాంలోనే ఏపీ పోలీసులు అత్యంత సాధుపాత్రలుగా మారిపోయిన చేదువాస్తవం తెలుసుకోలేకపోతున్నాడు బాబు గారు… అసలు వార్త ఏమిటంటే..? చిన్నదే… నెల్లూరు జిల్లాలో కూడా కాస్త కోడిపందేలు ఎక్కువే… సంక్రాంతి ఎప్పుడో అయిపోయినా ఇంకా సాగుతూనే ఉన్నాయట… ఎక్కడో కోడిపందేలపై పోలీసులు తమ విధినిర్వహణలో భాగంగా, పైసా ఆశించకుండా దాడులు చేశారట, నగదుతోపాటు కొన్ని కోళ్లను కూడా స్వాధీనం చేసుకుని, ఠాణాలోని సెల్లో పడేశారుట… 20 రోజులైంది…
లాకప్పులో పడేశారు గానీ… వాటిని ఏం చేయాలి..? ఏదో సమయానికి కాస్త నూకల దాణా, కాసిన్ని నీళ్లు పోలీసులే చూసుకుంటున్నారు… ఏదో కుక్కుటసేవ చేసుకుంటున్నారు… అసలు ఇన్నిరోజులు వాటికి ఇంకా ఈ భూమ్మీద నూకలు మిగిలాయంటే గ్రేటే… అప్పుడప్పుడూ చదివే వార్తలను బట్టి వాళ్లు ఏం స్పూర్తిని తీసుకోవాలి..? ఎంచక్కా రోజుకొకటి భోంచేసి… ఎలుకలు తిన్నాయనో, కోళ్లు పారిపోయాయనో రాసేసుకోవాలి… మన ఇండియన్ ఠాణాల్లో ఎలుకలు మద్యం సీసాలే ఖతం చేస్తుంటయ్, చికెన్ తినలేవా ఏం..? అది జరిగిందా కాదా అనేది కాదు ప్రధానం, మనం రికార్డుల్లో ఏం రాసి, కథ క్లోజ్ చేశామనేదే ముఖ్యం… ఎహె, వీళ్లేం పోలీసులండీ బాబూ… వీటికి ఎవరూ బెయిళ్లు ఇప్పించరు కదా… మరి ఎలా రిలీజ్ అవుతాయి..?
Ads
అవునూ… అవి సాక్షులా, నిందితులా..? లాకప్పులో వేశారంటే, మరి నిందితులుగా చూపించాలి కదా… అంటే నేరం చేసినట్టు ఎఫ్ఐఆరో, చార్జి షీట్లో, రిమాండ్ రిపోర్టో రాయాలి కదా… అవేమీ లేవు… నో, నో, అవి నేరం చేయలేదు, అవీ బాధితులే అనుకుందాం… అలాంటప్పుడు బాధితులను లాకప్పుల్లో వేస్తారా..? సరే, అవేవీ కావు, మరి అవి కూడా నగదులాగే స్వాధీనం చేసుకున్న సొత్తా..? అలాంటప్పుడు జాగ్రత్తగా కార్టన్లలో పెట్టేసి, సీళ్లు వేసేయాలి కదా… తరువాత విప్పినప్పుడు అవి ఉంటాయా..? ఉంటే ఎలా ఉంటాయి అనేది వేరే సంగతి..? నగదులాగే అవి కూడా స్వాధీనం చేసుకోవడిన సొత్తు అయినప్పుడు లాకప్పుల్లో ఎందుకు బంధించాలి..? అన్యాయం కాదా..? వాటికేమో కోడిహక్కుల సంఘాలు ఉండవాయె… కుక్కుటము అంటే, కోసి, కాల్చి, పొట్టలో కుక్కుకోవడమే తప్ప, కోళ్లకూ హక్కులు, మనోభావాలు ఉంటాయని గుర్తించేవారెవరు పాపం..? అందుకే……. ఇన్నిరకాల ప్రశ్నలు, సందిగ్ధాలు ఎందుకు..? ఎంచక్కా కోళ్లు, నగదు దొరకగానే… కోళ్లు కోయించి తందూరీ వండేయాలి… కుక్కుటశాస్త్రం అంటే అదే… కడుపులో కుక్కేసుకోవడమే కుక్కుటశాస్త్రం… అలాగే అక్కడ దొరికిన నగదుతోనే మందు తెప్పించాలి… అప్పుడు మజా… అలా ఎంజాయ్ చేయాలి… కేసు క్లోజ్, కథ ఖతం… పందెంగాళ్లతో ‘మాటాముచ్చట’ వేరే చూసుకోవాలి… హబ్బే… ఎప్పటికప్పుడు కేసులు డిస్పోజ్ చేసేయాలి సార్, కోర్టుకు పోతే ఏమొస్తుంది..? అవీ వశపడని కేసులతో పనిభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి… ఇబ్బంది పెట్టడం దేనికి..? ఫాఫం, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారో హేమిటో…!!
Share this Article