ప్రతి మీడియాకు ఓ పార్టీ రంగు ఉంది… వాటి పొలిటికల్ లైన్స్ మీద ఆ రంగులే ప్రతిఫలిస్తుంటాయి… ఇదీ డిస్‌క్లెయిమర్… ఈనాడు మీద సాక్షి, సాక్షి మీద ఆంధ్రజ్యోతి ఏళ్ల తరబడీ యుద్ధం సాగుతూనే ఉంది… సాగుతుంది… అది ఆగర్భశతృత్వం… అనగా ఆ మీడియా హౌజు ఓనర్లు సాగించే సామాజికవర్గ యుద్దం అని కాదు… సరే, దాన్ని తెలుగుదేశం వర్సెస్ వైసీపీ వార్ అనుకుందాం… పత్రికలు బజారునపడి తన్నుకుంటున్నా సరే వాటి టీవీ చానెళ్లు పరస్పరం తిట్టుకునే పర్వం ఏమీ నడిచినట్టు లేదు… అనగా టీవీ5 వర్సెస్ సాక్షి, సాక్షి వర్సెస్ ఏబీఎన్… పార్టీల మీద వైఖరులు సరే, కాని తోటి చానెల్‌లో ఇలా వచ్చింది, అలా చెప్పారు అంటూ తన్నుకోలేదు…
సేమ్, వెలుగు వర్సెస్ నమస్తే తెలంగాణ… కొన్నిసార్లు ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే తెలంగాణ… వాడిలా రాశాడు, వీడిలా రాశాడు… ఇదే తరహా… కానీ వీ6 వర్సెస్ టీన్యూస్ లేదా టీన్యూస్ వర్సెస్ ఏబీఎన్ పోరాటంలా ఎప్పుడూ కనిపించలేదు… అరకొర ఏమైనా ఈ అక్షరకయ్యం స్టోరీలు వచ్చాయేమో తెలియదు… పత్రికలు బట్టలన్నీ విప్పి బజారులో నర్తిస్తున్నా సరే, టీవీచానెళ్లు మాత్రం కొంత సంయమనం పాటిస్తున్నాయి అనే అనుకుందాం కాసేపు…
సోషల్ మీడియా ఇంపార్టెన్స్, వెబ్ జర్నలిజం ఇంపార్టెన్స్ పెరిగాక అందరి దృష్టి యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్ల మీదకు మళ్లుతోంది… అనేకానేక కారణాల రీత్యా యూట్యూబ్ చానెళ్లను పక్కన పెట్టేయొచ్చు… వెబ్‌సైట్ల విషయానికొస్తే అవీ బయాస్డ్‌గా మారిపోయాయి… బయట రాజకీయాలు, సామాజికవర్గ యుద్ధాల ప్రభావం వాటి మీద కూడా పడుతోంది… తాజాగా ఓ ఇష్యూ ఇంట్రస్టింగుగా అనిపించింది… గ్రేటాంధ్ర… నో డౌట్… చాలాకాలంగా నంబర్ వన్ తెలుగు సైట్… కానీ వైసీపీ పట్ల బయాస్డ్‌గా ఉండటం, ఈమధ్య ఎజెండా డ్రివెన్ స్టోరీస్ కనిపించడం, చంద్రబాబు పట్ల- జనసేన పట్ల అకారణ వ్యతిరేకత కొంత చర్చనీయాంశం అవుతోంది…
Ads
ఈమధ్య ఏదో స్టోరీ రాసుకొస్తూ … చిరంజీవి ఇండస్ట్రీ భుజం కాయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది ఆ సైట్… ఎందుకు..? తను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేక, ఆ పెద్దరికాల్ని వదిలేసి, అవసరమైనప్పుడు ఇండస్ట్రీ భుజం కాస్తాను అన్నాడు కాబట్టి… ఈ పండుగ బరిలో అయిదు సినిమాలు రిలీజులకు తన్నుకుంటున్నాయి కాబట్టి… చిరంజీవి కలగజేసుకోవాలని ఓ సలహా పడేసింది ఆ సైట్… నిజానికి అది అనుచిత సలహా… అయితే మరో వైబ్‌సైట్ దాన్ని ఏకిపారేసింది… (బహుశా సినీజోష్ కావచ్చు)… ఇది ఎజెండా డ్రివెన్ స్టోరీ అని ముద్ర వేసింది…
‘‘చిరంజీవి గనుక హనుమాన్ సినిమాకు సపోర్ట్ చేస్తే… (ఎలాగూ చేస్తున్నాడు, తను సినిమాలో హనుమంతుడికి వాయిస్ ఓవర్ ఇచ్చాడా, లేక హనుమంతుడిగానే కనిపిస్తాడా అనేది వేరే విషయం, ప్రిరిలీజ్‌కు మాత్రం చీఫ్ గెస్ట్)… వెంటనే నాగార్జున, వెంకటేష్, మహేశ్‌బాబుల ఫ్యాన్స్ చిరంజీవికి వ్యతిరేకం చేయాలనే దురాశ కనిపిస్తోంది ఆ స్టోరీలో… తద్వారా జనసేన వోట్లకు గండికొట్టి, వైసీపీకి ఫాయిదా చేకూర్చడమే ఈ ప్లాన్’’ అనే అర్థమొచ్చేలా రాసుకుంటూ పోయింది…
సరే, ఆ వార్తల విశ్లేషణ అక్కర్లేదు, నిజానిజాలు భిన్నంగా ఉండొచ్చు, గ్రేటాంధ్ర చెప్పగానే చిరంజీవి చేస్తాడా..? ఇతర పెద్దలతో పడలేక తను ‘‘దాసరి పాత్ర’’ను, ఆ ప్రయత్నాల్ని వదిలేసుకున్నాడు ఎప్పుడో… అదంతా వేరే సంగతి… కానీ వెబ్‌సైట్ల నడుమ కూడా ఈ స్టోరీల ఖండనలు కొత్తగా అనిపిస్తోంది… సో, ఈనాడు, జ్యోతి, సాక్షి, నమస్తే వార్తల్ని విశ్లేషిస్తున్నట్టుగానే ఇకపై రాను రాను గ్రేటాంధ్ర, ఐడ్రీమ్స్ వంటి సైట్ల స్టోరీలకూ రంగులు, వాసనలు, ఉద్దేశాలు గట్రా వెతికి ఖండించే రాత పనులు మొదలవుతాయేమో..!!
Share this Article