నిన్నటి నుంచీ ఒకటే హడావుడి యూట్యూబ్ చానెళ్లలో, సైట్లలో… ఏమనీ అంటే… త్రివిక్రమ్ మళ్లీ దొరికిపోయాడు అని… గుంటూరుకారం సినిమా ట్రెయిలర్ చూడగానే… ‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేశారట. దానికి ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతోనే ఆ ట్రెయిలర్ స్టార్ట్… ఆ తరువాతే మహేశ్ బాబు ఎంట్రీ… అదుగో అక్కడ వెంటనే కొందరు పట్టేసుకున్నారు…
హర్రె, ఇది మమ్ముట్టి నటించిన రాజమాణిక్యం సినిమా కథే అని కొందరు తేల్చేశారు… నో, నో, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తికిరీటాలు నవల అది అని మరికొందరు రాసేశారు… సో, అవే నిజమైతే… ఆ రెండూ మడతపెట్టి, మిక్సీలో గుంటూరు కారాన్ని దంచాడన్నమాట త్రివిక్రముడు… అవునూ, తనను ఏదో ‘గురూజీ’ అంటుంటారు… ఓహ్, ఈ పనులు చేస్తున్నందుకేనా..?
నిజానికి ఏవేవో దేశ విదేశీ సినిమాల కథల్ని లేదా నవలల్ని మనకు అనుగుణంగా మార్చుకుని, యథేచ్ఛగా మన పేర్లే పెట్టుకుని, మన సొంత సృష్టిలాగే చెలామణీ చేసుకోవడం సినిమా ఫీల్డ్‌లో పరిపాటే… రాజమౌళి అయితే సీన్లనే యథాతథంగా కాపీ కొట్టిన ఉదాహరణలు ఉన్నాయి కదా, ఇదే త్రివిక్రముడు గతంలో కూడా దొరికిపోయాడు కదా… ఈసారి ఎంత జాగ్రత్తగా ఓ పాత నవల కథను కాపీ కొట్టినా, ఆ మలయాళీ సినిమా కథను తీసుకున్నా సరే, దొరికిపోయాడు…
Ads
అప్పట్లో మీనా అనే నవల ఆధారంగా అఆ సినిమా తీసినట్టు కూడా ఆరోపణలు వచ్చినట్టు గుర్తు… విదేశీ సినిమాలు, మన సినిమాల కథలు కాపీ కొడితే పట్టేసుకుంటున్నారని, మరీ పాత నవలల జోలికి పోతే, అవీ పట్టుకుని బయట పెట్టేసి బదనాం చేస్తుంటే ఇంకెలా చావాలి మన దర్శకులు..? అరె, కాపీ అనేది కూడా ఓ క్రియేటివ్ కళ… కొత్త కథలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి మరి… త్రివిక్రమ్ బయటికి ఇలా అనలేడు గానీ అనుకుంటూ ఉంటాడేమో…
సరే, ఇంతకీ ఆ కథ సినాప్సిస్ ఏమిటి..? నిజమో కాదో తెలియదు, సినిమా రిలీజైతే గానీ బయటపడదు… ఇదే కథయితే చప్పట్లు కొట్టండి, లేదంటే ఓ కథ చదివామని ఆనందించాడు… పదండి కథలోకి…
స్వర్ణలత… నర్తకిగా పేరు తెచ్చుకోవాలనుకునే ఓ అమ్మాయి… తల్లి ఇందిరాదేవికేమో స్వర్ణని ప్రఖ్యాత నర్తకిగా చూసుకోవాలని కోరిక, పనిలోపనిగా తనూ పాలిటిక్సులోకి వెళ్లి ఎమ్మెల్యే కావాలని ఆశ… ఈమెకు ఓ వెటరన్ గాయని రాజ్యలక్ష్మి ఫ్రెండ్… ఎక్కడో ఫారిన్‌లో ఏళ్లుగా ఉండీ ఉండీ, తన పెంపుడుకొడుకు కిషోర్‌ను తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది ఆ గాయని… ఈ స్వర్ణని ఆ కిషోర్‌కు ఇవ్వాలని ఇందిరాదేవి ఆశ… కానీ చిన్నప్పుడే తనకు దూరమైపోయిన తన కన్నకొడుకు తేజను స్వర్ణ పెళ్లి చేసుకుంటే, ఆమె ద్వారా తను తేజాను కలుసుకోవచ్చునని రాజ్యలక్ష్మి ఆశ…
ఎవరు ఆ తేజా..? చదువు లేకుండా ఎక్కడో పల్లెటూళ్లో ఉంటాడు తను… తనకు నా బిడ్డను ఇచ్చి ఎలా పెళ్లి చేస్తానని ఇందిరాదేవి మనోభావన… పైగా కిషోర్, స్వర్ణ సాన్నిహిత్యం బాగా పెరిగింది కూడా… ఈ నేపథ్యంలో ఓ చెక్క బొమ్మల పరిశ్రమతో కాలం గడిపే తేజాను లైట్ తీసుకుంటుంది… తేజా బాగా ద్వేషించే వ్యక్తి ఎవరయ్యా అంటే తన తల్లి రాజ్యలక్ష్మే… పేరు వినడానికి కూడా ఇష్టపడడు… కానీ తనకూ స్వర్ణ అంటే ఇష్టం… ఎప్పుడైతే ఆమె నిశ్చితార్థం కిషోర్‌తో జరుగుతుందో అప్పుడే ఆమెను మరిచిపోవాలని ఫిక్సయిపోతాడు…
కళల్లో, గానం, నాట్యం, రచనల్లో నైపుణ్యం ఉన్నవాళ్లు సంసారబంధాల్లో ఇరుక్కోవద్దనే స్థూలభావనతో ఈ నవల రాసినట్టు అప్పట్లో ఎక్కడో రచయిత్రి రాసుకొచ్చిందట… ఇదండీ ఈ నవల కథ… మహేశ్ బాబు వంటి స్టార్ ఈ ఫ్యామిలీ కథ చేస్తే దానికి కమర్షియల్ హంగులు ఎలా వస్తాయి అంటారా..? ఆ ఎలివేషన్స్, నడుమ నడుమ కామెడీ ట్రాకులు, మధ్యలో కుర్చీ మడతపెట్టి వంటి వెగటు పాటలు త్రివిక్రమ్ చూసుకుంటాడు కదా… కొంత రాజమాణిక్యం కథనూ కలిపేసి ఉంటాడు… ఎహె, ఇదంతా నమ్మబుల్‌గా లేదు, త్రివిక్రమ్ స్వతహాగా మంచి రచయిత, కాపీ కొట్టే దరిద్రం ఆయనకేముంది..? ఆయనలో టన్నులకుటన్నుల క్రియేటివిటీ పొంగిపొర్లుతూ ఉంటుంది… పైగా దీనికీ గుంటూరు కారానికీ సంబంధమే లేదు అంటారా..? గుడ్… అదే నిజమైతే సంతోషమే…!!
Share this Article