Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపరేషన్ కాక్టస్… ఇదే మాల్దీవుల ప్రభుత్వాన్ని మనం ఎలా కాపాడామంటే…?

January 9, 2024 by M S R

మాల్దీవులు… చుట్టూ సముద్రం… మహా అంటే 5 లక్షల జనాభా… భూతాపం పెరుగుతూ త్వరలో ఆ దేశమే కనుమరుగు కాబోతోంది… నివారణ లేదు… భారతదేశం ఎప్పుడూ దాన్ని నేపాల్, భూటాన్ వంటి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు లక్షద్వీప్, అండమాన్ దీవులు ఎలాగో మాల్దీవులను కూడా అలాగే చూసింది… ప్రస్తుతం అది చైనా అండ చూసుకుని మనపట్ల ధిక్కరాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది… సరే, ప్రస్తుత వివాదంలోకి ఇక్కడ వెళ్లడం లేదు…

అక్కడ ఓ తిరుగుబాటు ప్రయత్నం జరిగినప్పుడు… ఏం జరిగింది..? అదే ఈ స్టోరీ… సొంత వ్యాఖ్యాల్లేవు, బాష్యాల్లేవు… జస్ట్, ఓ సినిమా కథలాగా చదవండి… ఆ తిరుగుబాటు నేపథ్యంలో భారతదేశం స్పందన మీద కూడా కొన్ని వెక్కిరింపులు, కొక్కిరింపులు, ఈ ఏరియాలో పెద్దన్న పాత్ర పోషిస్తుందనే శాపనార్థాలు వినిపించాయి… సరే, కథలోకి వెళ్దాం…

అబ్దుల్ గయూమ్… మాల్దీవుల అధ్యక్షుడు… 1980, 1983 సంవత్సరాల్లో తన ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి… కానీ సక్సెస్ కాలేదు, పైగా చిన్న స్థాయి… కానీ అది 1988, నవంబరు… దాదాపు 80 మంది… సాయుధ PLOTE కిరాయి సైనికులు శ్రీలంక స్పీడ్ బోట్లను హైజాక్ చేసుకుని ఓ తెల్లవారుజామున మాలేలో దిగిపోయారు… చూస్తుండగానే ముఖ్యమైన గవర్నమెంట్ బిల్డింగులు, ఎయిర్‌పోర్టు, నేవీ పోర్టు, టీవీ, రేడియో స్టేషన్ సహా రాజధానిలోని పలు ప్రాంతాల్లోకి కిరాయి సైనికులు చేరిపోయారు…

Ads

వాళ్ల నియంత్రణలోకి దేశం వచ్చేసింది… గయూమ్ టార్గెట్‌గా ఈ కిరాయి సైనికులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్నారు… కానీ అలర్టయిన ప్రభుత్వ ముఖ్యులు గయూమ్‌ను ముందుగా రక్షణ మంత్రి ఇంటికి చేర్చారు… ఆయన గయూమ్‌ను ఓ సురక్షిత గృహంలోకి చేర్చాడు… ఈలోపు కిరాయి సైనికులు రాష్ట్రపతి భవన్‌ను స్వాధీనం చేసుకున్నారు… మాల్దీవుల విద్యా మంత్రి వాళ్ల చేతికి చిక్కాడు…

తను తలదాచుకున్న భవనం నుంచే గయూమ్ శ్రీలంక, పాకిస్థాన్ సైనిక జోక్యాన్ని కోరాడు… అబ్బే, మాకు అంత శక్తిసామర్థ్యాలు లేవని ఆ దేశాలు  నిరాకరించాయి… తరువాత సింగపూర్ సాయాన్ని కోరాడు… అదీ బోలెడు కారణాలు చెబుతూ సారీ అనేసింది… బాబ్బాబు, దగ్గరలో మీ యుద్దనౌక గానీ ఉంటే పంపాలంటూ అమెరికాను అభ్యర్థించాడు… సాయం చేయాలనే ఉంది గానీ, మరీ మీకు 1000 కిలోమీటర్ల దూరంలోని సైనిక స్థావరం నుంచి బలాలు పంపాలంటే 2, 3 రోజులు పడుతుందని చావుకబురు చల్లగా చెప్పింది అమెరికా…

నిజానికి అవన్నీ సాకులు, ఎవరికీ సాయం చేయాలనే తలంపే లేదు… ఆశ వదలని గయూమ్ బ్రిటన్ సాయం కోరాడు… అదేమో ఇండియా సాయం తీసుకోవోయ్ అని ఓ ఉచిత సలహా పడేసింది… మరోవైపు కిరాయి సైనికులు మొత్తం ప్రభుత్వ భవనాలన్నీ ఆక్రమించి సెటిలైపోయారు… అధ్యక్షుడి కోసం వెతుకుతున్నారు… అప్పుడు ఆయన ఇండియా సాయాన్ని కోరాడు… వేరే శషభిషల్లేవు, వెనుకంజ లేదు, సాకుల్లేవ్, ఇండియా రెడీ అయిపోయింది…

అరేబియా సముద్రంలో మన పట్టు ఉండాలంటే, అంతర్జాతీయ జలాల్లో బయటి శక్తుల రాకడను నిరోధించాలంటే మాల్దీవుల్లో సుస్థిర, భారత అనుకూల ప్రభుత్వం ఉండాలి… అదీ మన ఉద్దేశం… వ్యూహాత్మకంగా అది కీలకమైన కేంద్రం… అందుకే ‘ఆపరేషన్ కాక్టస్’ స్టార్టయింది వెంటనే…  నవంబరు 3న రాత్రి పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక విమానాల్లో ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది… 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి హుల్‌హులేకు చేరుకున్నారు… గయూమ్ విజ్ఞప్తి చేసిన 9 గంటల్లో మన సైన్యం ఆ దేశంలో దిగింది…

మన పారాట్రూపర్లు మొట్టమొదట ఎయిర్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు… మాలేకి చేరుకుని అధ్యక్షుడు గయూమ్‌ను రక్షించారు… చకచకా కొద్దిగంటల్లోనే రాజధానిలోని ప్రతి భవనాన్నీ విముక్తం చేశారు… గయూమ్ ప్రభుత్వం పునరుద్ధరింపబడింది… మిగిలిన కొందరు కిరాయి సైనికులు బతుకుజీవుడా అని శ్రీలంక వైపు పారిపోయారు… మొత్తం ఈ ఆపరేషన్‌లో మరణించింది జస్ట్, 19 మంది… అందులో కిరాయిసైనికులు హతమార్చిన ఇద్దరు బందీలు కూడా… కొందరు కిరాయి సైనికులు పట్టుబడ్డారు… శ్రీలంక వైపు పారిపోతున్న బోట్లను కూడా ఇండియన్ గోదావరి, బెత్వా నౌకలు అడ్డుకుని పట్టేసుకున్నాయి… ఆపరేషన్ అయిపోయింది…

అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇండియా సత్వర స్పందనను ప్రశంసించాడు… ‘‘ప్రాంతీయ స్థిరత్వానికి విలువైన సహకారం’’ అని పేర్కొన్నాడు… బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ కూడా అభినందించింది… ఒకటీరెండు సార్క్ దేశాలు సహజంగానే ఇండియా మరీ పెద్దన్న పాత్రలోకి, బలప్రయోగాల్లోకి దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి… పట్టుబడిన ఆ కిరాయి సైనికులను ఎలా శిక్షించారు అంటారా..? యావజ్జీవ కారాగారశిక్షలు వేశారు, అంతే…

ఇలాంటి మాల్దీవులు ఇప్పుడు చైనా తోకగా మారింది… చైనాకు అది అవసరం… అరేబియా కీలక స్థావరాల్లో ఇండియా పట్టును సడలించడం, అంతర్జాతీయ జలాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం మాల్దీవులను దువ్వుతోంది… ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనలోనే ఉన్నాడు… మాల్దీవుల్లోని సైనికులను వాపస్ తీసుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం ఇండియాకు నిష్కర్షగా చెప్పింది… తరువాత ఏముంది..? చైనా యుద్ధనౌక, జలాంతర్గాములు ఆ దేశ పరిసరాల్లో తిష్ఠ వేస్తాయన్నమాట… ఎస్, మాల్దీవులు చిన్న పామే… కానీ దాని వెనుక ఉన్నది భారీ డ్రాగన్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions