ఒక వార్త… మోడీ మీద పూరీ శంకరాచార్య ఆగ్రహం అట… రాముడిని మోడీ తాకడం చూడలేడట… అందుకే అయోధ్యకు వెళ్లడట… బహిష్కరిస్తాడట… ఎంత ధైర్యం మోడీకి అని మండిపడుతున్నాడు… తన వంటి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోడీలకు అలా రాముడి ప్రాణప్రతిష్ట అధికారం లేదట… సరే, ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు…
అరె, మోడీని తిట్టాడు కదాని ఈయన వ్యాఖ్యల్ని హైలైట్ చేసిన మీడియా ఏదో తెలుసా..? కమ్యూనిస్టు పత్రికలు… మామూలు రోజుల్లో ఈ స్వామిని, ఈ సన్నాసిని అవి పట్టించుకుంటాయా..? మోడీని తిట్టాడు, అయోధ్య వ్యతిరేక వార్త కాబట్టి సంబరపడిపోయి హైలైట్ చేశాయి ఆ పత్రికలు… సరే, వాటి పాత్రికేయ దరిద్రం మాటెందుకులే గానీ… ఈ సన్నాసి సంగతికొద్దాం…
Ads
ఈయనను సన్నాసి అని సంబోధించడానికి వెరవాల్సిన పనే లేదు… ఈ స్వాములతో, ఆ సుబ్రహ్మణ్య స్వాములతో ఊదు కాలేది లేదు, పీరు లేచేది లేదు… అసలు అయోధ్య ఇష్యూలో ఒక్కరోజైనా బయటికొచ్చి మాట్లాడారా వీళ్లు..? ప్రత్యక్ష కార్యాచరణలో ఉన్నారా..? లేరు… ఉండరు… ఇలాంటి పీఠాధిపతులతో హిందూ మత ఆధ్యాత్మికత వ్యాప్తికి నయాపైసా ఫాయిదా లేదు… ఆశ్రమాలు, దందాలు, పాదపూజలకూ రేట్లు, డబ్బు సంపాదనలు… సరే, అవీ పక్కన పెడితే… పూరీ వంటి పీఠానికి ఇలాంటి అధిపతులు దేనికి..? వీళ్లతో పోలిస్తే ఎన్ని విమర్శలున్నా సరే ఆ రవిశంకర్ లాంటోళ్లు నయం కదా… అంతటి సాధనసంపత్తి ఉన్న తిరుమలను రాజకీయాలు భ్రష్టుపట్టించిన తీరు తెలుసు కదా…
ఈయన పేరు మాత్రమే నిశ్చలానంద సరస్వతి… నిలువెల్లా ద్వేషం, విషం, అజ్ఞానం, కోపం, అసూయ, రాగద్వేషాలు, అహం వంటి అవలక్షణాలను గెలవలేని వీళ్లు సన్యాసులు ఎలా అయ్యారు..? ఇంతకీ ఈయన కోపం ఏమిటో తెలుసా..? కేవలం తనతోపాటు మరో సహాయకుడికి మాత్రమే అనుమతి ఉందట… అదీ ఏడుపు… అయిదారు వేల మంది సాధుసంతులను పిలుస్తున్నారు… అందరూ తమ ముఠాలతో గుంపులుగా వస్తే, ఆ అయోధ్య తట్టుకోగలదా..? పైగా మాట్లాడితే చాలు, ముక్కు మీద కోపం…
ఇది ఎవరి కార్యక్రమం..? బీజేపీది కాదు, యూపీ ప్రభుత్వానిది కాదు… అయోధ్య ట్రస్టుది… సగటు హిందువుది… మరి వీళ్లకు ఎవడు మర్యాదలు చేయాలని ఆశిస్తున్నారు..? ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజానికి వీళ్లే హిందూ మతానికి శాపాలు… సరే, మోడీ రాముడిని తాకడం సంగతికొద్దాం… రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకుపోయేది మోడీయే… జీవితకాలం స్వయంసేవక్‌గానే బతికిన మోడీ జీవితానికి ఇంతకన్నా సార్థకత ఏముంది..? లక్షల మంది స్వయంసేవక్‌లు, సన్యాసులు కలలుగన్న అదృష్టం… ఆయనకే ఎందుకు ఈ భాగ్యం అంటారా..?
తను అయోధ్య యాక్టివిస్టు మాత్రమే కాదు… 140 కోట్ల మంది దేశప్రజలకు, బయట ఉన్న కోట్ల హిందువులకు, అన్ని మతాల ప్రజలకు పాలకుడు ఇప్పుడు… ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగినప్పుడు సాధుసన్యాసులు పర్యవేక్షిస్తారు… శాస్త్రోక్త తంతు నిర్వహిస్తారు… కర్త మాత్రం పాలకుడే… ఈ చిన్న విషయం తెలియని సన్నాసులు కూడా నోళ్లు పారేసుకుంటున్నారు…
అయోధ్య ఉద్యమం దగ్గర నుంచి మందిరం దాకా నిజానికి యోగి భాగస్వామ్యం కూడా తక్కువ కాదు… తను ఆచరణలో కూడా సన్యాసి… నాథ్ పరంపరలో ఓ మఠాధిపతి… మోడీ కాకపోతే యోగి… పైగా ఆ ప్రాంత పాలకుడు తను… సో, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, అయోధ్య ట్రస్టు, అనేక పీఠాలు, ఆశ్రమాలు అందరూ ఆమోదించిన ఈ వర్తమాన కార్యాచరణపై ఈ నిజసన్నాసుల కూతలు దేనికి..? ఒకవేళ ఈయన వస్తానన్నా దయచేసి ఎంటర్‌టెయిన్ చేయకండి..!!
జాతి యావత్తూ అయోధ్య అక్షితల్ని శిరోధారణం చేస్తోంది, ప్రతి ప్రాంతం ఎన్నెన్నో కానుకల్ని అయోధ్యకు పంపిస్తోంది… రాముడి గుడి ప్రారంభాన్ని తమ ఇంట్లో పండుగగా సెలబ్రేట్ చేసుకుంటోంది… ఇదుగో ఇలాంటోళ్లే పేడ నీళ్లు జల్లుతుంటారు… దిష్టితీత…! తను వాడుకుంటున్నదేమో గానీ ఇది బీజేపీ కార్యక్రమం కాదు, రాముడు అందరివాడూ… కానీ బీజేపీయేతరుల అక్కసే బీజేపీని బలోపేతం చేస్తోంది… ఆ నిజం వాళ్లకు అర్థం కాదు…!!
ఒక క్లారిటీ…. కమ్యూనిస్టు పత్రికలు, ఇతర మీడియా పూరీ శంకరాచార్య వారి మాటలను వక్రీకరిస్తోందనే వివరణ కూడా వినిపిస్తోంది…. ‘‘వారు అన్న “आधा तीतर-आधा बटेर” సామెత ఈ కార్యకమం సగం రాజకీయం సగం శాస్త్రము మిశ్రమంగా కనిపిస్తోందని… శాస్త్ర సమ్మతమైన కార్యక్రమానికి మాత్రమే వెడతాము. రామమందిర ప్రారంభం మాకు సంతోషమే. మోడీగారు హిందుత్వ వాది సెక్యులర్ కాదు. రామమందిర ప్రాణప్రతిష్ట విధానం శాస్త్ర సమ్మతమా కాదా అనే చర్చ ప్రక్కన పెడితే ఇది యావత్ హిందూ సమాజం సాధించిన విజయం…’’ అని ఆ వివరణల సారాంశం…
Share this Article