Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకాశంలోకి చూశాను… అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న…

December 13, 2024 by M S R

.

Prabhakar Jaini… రాత్రి 11 గంటలకు తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు.

అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ,

Ads

“ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ?” అని అడిగారు.

“అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ..?” అని అడిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ,

“బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు!” అంటూ ఉత్తరాన్ని నా చేతిలో పెట్టారు.

అయన ఆ ఉత్తరం ఇవ్వగానే “నాన్నగారా?” అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో,

“ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Officeలో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ… మీ నాన్న!” అని ఉంది.

నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి,

“ఏమైనా తిన్నారా?” అని అడిగాను. “లేదు బాబూ! ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాను” అని చెప్పారు.

నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.

“మీరు తింటూ ఉండండి!” అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోనులు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనంలోనే అనేక కారణాల వలన చనిపోయారు. వీడు మాత్రమే మాకు మిగిలాడు, పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు!” అని ముగించారాయన.

“సరే పొద్దు పోయింది, పడుకోండి!” అని చెప్పి, నేను కూడా నిదురపోయాను.

పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్లలోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీసుకు చేరుకున్నాము.

“ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబూ!” అన్నారాయన.

“పర్లేదండి! నేను లీవ్ పెట్టాను!” అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.

“చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో!” అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.

“రండి! నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా!” అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ‘ఇప్పుడే వస్తానని’ చెప్పి దారిలో తినడానికి పళ్ళు అవీ తెచ్చి రామయ్యగారి చేతిలో పెట్టాను.

ఆయన సంతోషంగా,

“ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి!” అన్నాడు.

అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని,

“నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు అరవింద్. మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామా గల ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 మైళ్ళ ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి!” అన్నాను.

బస్సు కదలడంతో ఒక్కసారిగా రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

“నువ్వు బాగుండాలి బాబూ!” అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను.

పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.

ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న.

“నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు? ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపించి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా?” అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.

“సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి.”

…….. కొన్ని సవరణలతో… ఒరిజినల్లీ ఏ వాట్సప్ ఫార్వర్డ్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరో పొలిటికల్ బిడ్డ కుటుంబానికి దూరం… ఎవరు ఈ బీహారీ కవిత..?!
  • జై వారణాసి శ్రీరామ్..! ఉన్నారో లేదో తెలియని దేవుళ్లూ దిగిరావల్సిందే..!!
  • నేరాలు చేసేవాడు పెళ్లాంతో బాగుండాలి… లేకపోతే కొంప ఖల్లాసే…
  • సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
  • ఓహ్…! జుబ్లీ హిల్స్‌లో ఓడింది జగన్ రెడ్డి… గెలిచింది చంద్రబాబా..?!
  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!
  • ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!
  • కిరాతకం..! పసి పిల్లాడిపై ఓ సవతి తండ్రి దారుణ హింస..!!
  • ఘట్టమనేని కృష్ణ… సూపర్‌నోవా ఆఫ్‌ ఏ సూపర్‌స్టార్‌..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions