Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అశోక గజపతి రాజు… ఆ దర్పాలు, ఆ రాజరికం పోకడలేవీ కనిపించవు…

January 11, 2024 by M S R

రెండుమూడు రోజులుగా ఒక ఫోటో వైరలవుతోంది… కేంద్ర మాజీ మంత్రి, ఏపీ మాజీ మంత్రి, విజయనగరం సంస్థాన వారసుడు… ఓ రైల్వే స్టేషన్‌లో ఓ మామూలు ప్రయాణికుడిగా కూర్చుని రైలు కోసం నిరీక్షిస్తున్నారు… వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కూడా నానా అట్టహాసాలు, ఆడంబరాలు, దర్పాలు ప్రదర్శించే ఈ రోజుల్లో… ఇలాంటి రాజుగారు ఇంత సామాన్యంగా ఎలా ఉండగలిగారు..? అదే మరి అశోకగజపతిరాజు అంటే… సింపుల్, డౌన్ టు ఎర్త్… ఇంకా తన గురించి తెలుసుకోవాలని ఉందా..?



రాజకీయనాయకుడు కాకముందే ఆయన “రాజు.. ” దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థాన వారసుడు.. కోటలని.. కోట్లని కాదనుకుని…. భూములను బంగళాలను వదులుకున్న అసామాన్యుడు..! ఎలైట్ సర్కిల్ లో పెరిగినా.. విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు..! గ్వాలియర్ రాజసంస్థానాల్లో చదువు కున్నాడు. పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు.. కానీ ఆయన డిగ్నిటీ ముందు అవన్నీ దిగదుడుపు..! ఎమ్మెల్యేగా.. మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నా ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. డబ్బుకు విలువుండొచ్చు.. కానీ “డబ్బుతో” విలువ రాదు.. ఆ విషయాన్ని నిరూపించిన అతికొద్దిమందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు.. ! విగ్రహంలోనే కాదు. వ్యక్తిత్వంలోనూ…నిండైన మనిషి.. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…. చిన్న మరక కూడా లేకుండా.. స్వచ్చ పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు.

ashok gajapati

Ads

ఒకటి రెండు సార్లు కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీ గా గెలవగానే అంతా నేనే… సర్వం నేనే… అనుకునే రోజుల్లో, ప్రజాస్వామ్యం పేరిట రాజకీయ ద్రోహులు దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సమయంలో… 1983 నుంచి రాజకీయాల్లో… రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పదవికే అలంకారంగా, సామాన్యునిలా జనంతో కలిసి పోయే రాచరికుడు మహారాజు అశోక్ గజపతి రాజు తన కుటుంబంతో ఇలా సామాన్యుడిలా రైలు కోసం హైదరాబాద్ ప్లాట్ ఫార్మ్ మీద, తాజాగా…

నాలుగుదశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపింది లేదు.. పల్లెత్తు మాట అనింది లేదు. పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు విజ‌య‌న‌గ‌ర రాజ వంశానికి చెందిన పి.వి.జి.రాజు, కుసుమ గజపతి దంపతుల ద్వితీయ కుమారుడు 1951 జూన్ 26వ్ తేదీ మద్రాసులో పుట్టారు. ఆనంద గజపతిరాజు ఈయన అగ్రజుడు. వీరి సోదరి సునీతాదేవి.. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన అశోక్ కుటుంబానికి 1945లొనే సొంత విమానం ఉండేది. కలకత్తా నుంచి చెన్నై వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ లో ఎక్కడా బీఎస్సీ కాలేజ్ లేదు.. అశోక్ తండ్రి పీవీజీ రాజు వందేళ్లకు మునుపే.. విజయనగం “మహారాజ కాలేజ్” లో బీఎస్సీ కోర్సు పెట్టించారు.

ashok gajapati

అశోక్ గ‌జ‌ప‌తి రాజు 25 ఏళ్ల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. ఏపీ ప్ర‌భుత్వంలో 13 ఏళ్ల పాటు వాణిజ్య ప‌న్నులు, ఎక్సైజ్‌, శాస‌న స‌భ వ్య‌వ‌హారాలు, ఆర్థిక‌, ప్ర‌ణాళిక-రెవెన్యూ మంత్రిగా బధ్యతలు నిర్వర్తించారు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ప‌ని చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం అది. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కుగానీ ఎస్పీ ఆఫీసుకు గానీ ఫోన్ చేసి “ మా వాళ్లే … వదిలేయండి అని గాని, పలానా వారిపై కేస్ పెట్టండి అని గానీ చెప్పీన దాఖలా లేదు. . ఎమ్మెర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి ” ఔట్ ఆఫ్ ద వే” పని చేయమని ఒకసారి కూడా అడగని ఖ్యాతి ఆయనొక్కరికే. జనం ఆయన్ను ఓసారి ఓడించారు.. జనమే తెలుసుకున్నారు తప్పితే అశోక్ గజపతిరాజు తన వైఖరి తప్పలేదు. గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లూ.. ఎండీవర్లు వాడుతుంటే.. ఆగర్భ శ్రీమంతుడైన ఆయన.. “నానో” కారులో తిరిగేవారు ముందూ వెనుక పైలట్లు కూడా అవసరం లేదు.. సీటు బెల్టు పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు.

వ్యక్తిస్వామ్యం ఎక్కువగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నా.. కూడా ఆయన “విలువ” ఏమాత్రం తగ్గలేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం అంతా “ఆదేశిస్తారు” కానీ విజయనగరంలో “పాటిస్తారు”. కొన్ని సందర్బాల్లో పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడన్నా అభ్యంతరం చెప్పినా “అశోక్ చెప్పినట్లు” చేయండంటారు. పార్టీ అధినేతకు ఆయనంటే గౌరవం. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే న‌రేంద్ర మోదీ కేంద్రమంత్రిగా ఆయన్ను ప్రకటించగానే., అంతా సైలెంట్..! రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ మోడల్.. ఎంపీ నిధులతో అంతా రోడ్డేసుకుని.. బిల్డింగులు కట్టిస్తే…ఈయన స్కూలు పిల్లలకు బెంచీలు చేయించారు. ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసిపిల్లాడిలా ఏడ్చేశారు.

Raju

ఉద్యోగులను గౌరవించడమే కాదు.. రూల్స్ తప్పితే అంతే కఠినం..! ఆయన రాష్ట్ర మంత్రి గా ఉన్నప్పుడు కూతురు 6వ తరగతి కోసం విశాఖ వ్యాలీ స్కూల్ కి అప్లై చేశారు. కానీ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు. ఆ స్కూల్ కమిటీకి విశాఖ కలెక్టర్ చైర్మన్. అశోక్ ఆఫీసియల్ పీఏ కలెక్టర్ కి ఫోన్లో విషయం చెప్పాడు. ఆ విషయం అశోక్ కి కూడా చెప్పలేదు. కలెక్టర్ ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. ఓ వారం తరువాత అశోక్ ఎదో మీటింగ్ కొసం విశాఖ వెళ్లారు. కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి ‘ సార్, మీ అమ్మాయికి సీట్ ఇచ్చాము. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను.’ అని తెలిపారు. దాంతో ఆయనకు అసలు విషయం తెలిసింది. అక్కడే తన పీఏ ను పిలిచారు. ‘ మీరు మీ పేరెంట్ డిపార్టుమెంట్ కు వెళ్లిపొండి’ అని చెప్పేశారు. తరువాత విజయనగరం కలెక్టర్ కు చెప్పి ఆయన్ని రిలీవ్ చేసి కొత్త పీఏ ను పెట్టుకున్నారు.

అశోక్ తన కారును తానే స్వయంగా కడుక్కుంటారు. ఓసారి ..ఆయన కారు కడుక్కుంటే చూసిన గన్ మెన్.. అదేంటి సార్ మీరు చేస్తున్నారు.. మేమున్నామంటూ.. వస్తే.. “మీ డ్యూటీ మీరు చేయండ”ని పంపేశారు.. కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పూ లేదు. విజయనగరంలో తమ దివానంలో మేనేజర్ గా పనిచేసే ఆయన షష్టి పూర్తి కి వెళ్ళారు. ఆయన షష్ఠి పూర్తికి అశోక్ దంపతులు, కూతురు వచ్చారు. పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు… వాళ్ళది రెండు అంతస్తుల ఇరుకు ఇల్లు. . మేడ మీద వరండాలో హోమం చేశారు. హోమం పూర్తయ్యే వరకూ వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు. హోమం తరువాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు. షష్ఠి పూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు. అశోక్ దంపతులు మొదట గా వారి మీద నీళ్లు పోసి. అప్పుడు వెళ్లారు. తన ఉద్యోగి షష్ఠి పూర్తి కి మాములుగా వచ్చి రెండుగంటలున్నాడు.. అదీ అశోక్..!

అశోక్ స్టేట్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూతురుకు మెడిసిన్ సీట్ వచ్చింది. ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది. దాంతో తెలంగాణా జిల్లా కాలేజ్ లో సీట్ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి రోజు తమ కార్ లో హైదరాబాద్ బస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసి బస్సులో కాలేజ్ కి వెళ్ళేది. ఈ విషయం తెలిసి సీఎం పేషీ అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్ హైదరాబాద్ లో మెడికల్ కాలేజ్ కు స్లయిడింగ్ లో తెచ్చేద్దాము అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. అదే విషయాన్ని చంద్రబాబు కు చెప్పారు. అశోక్ అందుకు ఒప్పుకోరు అని బాబు అన్నాడు. అయిన మీరు ట్రై చేయండి అని చెప్పాడు. దాంతో సీఎం పేషీ సెక్రటరీ అశోక్ తో మాట్లాడాడు. దానికి ఆశోక్ స్పందిస్తూ ‘ హైదరాబాద్ కాలేజ్ లో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంక్ తీసుకోవాల్సింది. తెచ్చుకోలేదు. కాబట్టి అక్కడే చదవాలి. అంతే” అనేశారు.

కేంద్ర మంత్రి గానూ..అంతే.. ! విమానంలోకి లైటర్ తో వస్తే నన్ను పట్టుకోలోదేంటి అని విమానాశ్రయ సెక్యూరిటీకి షాక్ ఇచ్చారు.. దాదాపు దివాళాలో ఉన్న ఏవియేషన్ ను దారికి తెచ్చారు. తన సొంత ఊరిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నా.. రూల్స్ కు విరుద్దంగా ఒక్క పనీ చేయలేదు. ఔట్ ఆఫ్ ది వే ఆయన డిక్షనరీలోనే లేదు. కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ లో క్యాజువల్ గా అంటే. “నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే .. ఇప్పుడే కేబినెట్ కు రిజైన్ చేస్తా” అన్న నిఖార్సైన మనిషి..! అందుకే మళ్లీ చెప్పడం.. నిజాయితీ ఉన్నోళ్లు చాలా మంది ఉండొచ్చు.. కానీ బంధుప్రీతి.. కులభిమానం.. పక్షపాతం…మొహమాటం ఇవేమీ లేని నేత “అశోక్ ఒక్కరే..” —- నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్, 98481 28215

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions