Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీరేమనుకున్నా సరే.., మా బోయపాటికి సాటి ఎవరూ లేరు..! లేరు..!!

January 11, 2024 by M S R

గొట్టిముక్కల కమలాకర్ ….. శంకరాభరణం సినిమా చివరలో శంకరశాస్త్రి “అంతరించిపోతున్న, కొడిగట్టిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను అడ్డంపడి ఆపుతున్న ఆ మహా మనీషి ఎవరో..?” అంటూ హాచ్చెర్యపోతాడు.

ఆ మహామనీషి పాటివాడే మా బోయపాటి..!

**
హీరోయిన్ తప్ప తను తీసిన ప్రతీసినిమాలో మహిళలు ఎంతో పద్ధతిగా వంటింట్లో కూడా పట్టుచీరలు కట్టుకుంటారు. ప్రతీకొంపలో కనీసం ఓ పాతిక మంది బిరబిరలాడుతూ తిరుగుతుంటారు. “సింహా” లో డాక్టరుగారు మర్డర్లు చేసొచ్చినా, ఇంట్లో భార్య ఏడువారాల నగల్ని దిగేసుకుని పప్పుచారు పెడుతుంది. పూజారీ, అతని కూతురూ హీరోకి సంప్రదాయబద్ధంగా పాదాభివందనాలు చేస్తుంటారు..!

Ads

“దమ్ము” సినిమాలో మగపురుషపుంగవులు సంవత్సరానికి ఓసారి “తాంబూలాలిచ్చేసుకుని తన్నుకుచావడం చూయించి” తెలుగువారి ఆచార వ్యవహారాలనూ, కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధాన్లనూ ఒకే దెబ్బతో గుర్తుకు చేసారు…!

“లెజెండ్” సినిమాలో బావ గారి వీపు సాపు చేసి, చితక్కొట్టి, స్త్రీ శక్తి గురించి అద్భుతంగా వివరించారు. రైలెళ్లి మనిషిని గుద్దినా, మనిషి వెళ్లి రైలును గుద్దినా మనిషికి చావు మూడుతుందని చెప్పి మనబోటి సామాన్యులకు నాలుగో గమన సూత్రం నేర్పించారు..!

“సరైనోడు” సినిమాలో ఇంటిముందు సెక్యూరిటీ గార్డు లేని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శినీ; కన్నతండ్రి కన్నా, ప్రాక్టీసు లేని బాబాయిని ప్రేమించే బేవార్స్ కొడుకునూ, వాడికోసం ముందే ట్యూబెక్టమీ చేయించుకున్న పిన్నినీ చూయించి కుటుంబ చిత్రానికి సరైన నిర్వచనం ఇచ్చాడు..!

ఇహపోతే “జయజానకీ ప్రాణనాయకా”. అసలా టైటిల్లో ఎంత తెలుగుదనం ఉట్టిపడుతుందో గమనించండి. డబ్బు అహంకారం తేకూడదనే సందేశం ఇవ్వడానికి కోటీశ్వరులు ప్రతిరోజూ రోడ్డుమీద మిర్చీబజ్జీలు తింటూ సిక్స్ ప్యాక్ బాడీ మైంటైన్ చేస్తారు. కన్యాశుల్కంలో పూటకూళ్లమ్మ లా సందేహాస్పద విధవ ఐన హీరోయిన్ను కందుకూరి వీరేశలింగం పంతులు మానసపుత్రుడైన హీరో పెళ్లి చేసుకుంటాడు. పరువు కోసం ప్రాణమిచ్చే పెద్దలుంటారు…!

ఆమధ్య వచ్చిన “వినయవిధేయరామ” ద్వారా బోయపాటి తనను తాను పునరావిష్కరించుకున్నాడు. రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాతగానీ బెంగ తగ్గలేదు. శ్రీమాన్ బోయపాటి వారు ఐదుగురు అనాధలకు ఇంటిపేరు “కొణిదెల” అని పెట్టారు. కాశ్మీర్, ఛత్తీస్గఢ్, విశాఖపట్నం, బీహార్ తదితర సమస్త రాష్ట్రాలన్నిటికీ ఒక ఎలక్షన్ కమీషనర్ ని ఇచ్చాడు. రెండు నిమిషాలలో ద్వారక నుండి నేపాల్ బోర్డర్ కి హీరోని పంపి పురాణాలలో ఉన్న పుష్పకవిమానం కాన్సెప్ట్ గుర్తుకుతెచ్చాడు.

దహనం అయిన శవం తాలూకు బూడిదని సంవత్సరం పాటు తాజాగా ఉంచి హీరోగారి వదినగారి పాతివ్రత్య మహిమను చూపారు. భర్త మరణం తెలిసిన మరుసటి సన్నివేశం లోనే ఆమెకు నల్ల టికిలీ నుదుటన పెట్టి మనబోటి ఛాందసులకు బోయపాటి స్వాంతన కలిగించాడు. అయ్యేయెస్లూ; ఐపీయెస్లూ అందరూ ప్రజాసేవకులనీ; మనం ప్రజలం వాళ్లను బెదిరించొచ్చనీ; గాజులేయొచ్చనీ; గజ్జెలు కట్ఠి డాన్సాడించొచ్చనీ; ముఖ్యమంత్రితో సహా ప్రజాప్రతినిధులు అందరూ గూండాలకు దండాలు పెడతారని తెలియ జెప్పి మనకు జ్ఞానోదయం కల్పించారు…!

అఖండలో ప్రిన్సిపల్ సెగట్రీ కల్లు తాగే కలెక్టరమ్మకు నివేదికలు సమర్పిస్తే, ఆ కలెక్టరమ్మను సర్కిల్ ఇన్స్పెక్టర్ బెదిరించేస్తాడు.
ఓ‌ బోకు రౌడీ ప్రిన్సిపల్ సెగట్రీ గారిని వారి కొడుకుముందే రేబ్బలత్కారం చేస్తాడు. ఇహ‌ ఆ‌ అఖండుడు మానవాతీతుడు మాత్రమే కాదు. దైవాతీతుడు కూడా..!

తనని నమ్ముకున్న మంద కోసం వారు తాజాగా అందించిన స్కంధ మన జ్ఞానాంధకారాన్ని తుత్తునియలు జేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపూర్ లో ఉన్నట్టు చూయించి వాళ్లకో రాజధాని ఇంకా తయారవలేదని ప్రతీకాత్మకంగా తెలిపారు. తెలంగాణా సీయెమ్మూ ఆంధ్రా సీయెమ్మూ కల్లుకంపౌండు ముందు కాట్లాడుకుంటారనీ, ఒర్రేయ్య్ అంటూ అరిచేసుకుంటారనీ చూయించేసారు.

గోదారి జిల్లాల్లో పుట్టిన కార్పోరేటు కంప్యూటరు కంపెనీ రాజుగారు నిఖార్సైన సుద్దపూసనీ, వారి ఏకైక పుత్రికని కిడ్నాపాపహరణం చేసేసి‌ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆయన బతుకుని గోదాట్లో కలపబోతారనీ, పెపంచికంలో అత్యుత్తమ జీతభత్యప్యాకేజీ అందుకున్న కుర్రహీరో స్టాన్ ఫోర్డ్ చదువునొదిలేసి సఖినేటిపల్లెకి వచ్చేసి తెల్లపంచె కట్టేసి లోకలాంగనలతో డ్యాన్సింగాడతాడనీ, శాంతికి ఆలవాలమైన గోదారి జిల్లాల్లో పుట్టినా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకన్నా భీభత్సభయంకరమైన తనకన్నా పొడవైన ఆయుధాలు వాడతారనీ చూయించి యావత్ ప్రేక్షక స్కంధారావాలు ఆర్తనాదాలు చేసేలా చేసారు..!

వారు సృజించిన హీరోలు ఒక్కొక్కరూ కోటానుకోట్ల హాలీవుడ్ సూపర్ హీరోల పెట్టు.

బోయపాటి గారూ…, రుక్మిణి శ్రీకృష్ణుడికి చేసిన తులాభారం కన్నా మీరు తెలుగు హీరోలకు చేస్తున్నది కోటిరెట్లు గొప్పది. మీరలా ముందుకు సాగిపోవడం మా బోటి బోయపాటి ఫాన్సుకు దైనందిన సమస్యల మధ్య పేద్ధ ఆటవిడుపు..! వీటిని మించిన సినిమాలు మీరు తీసి మమ్మల్ని పావనం చేయండి..!

చిన్న విన్నపరిక్వెస్టు..! ఆ‌ బాలయ్య కొడుకును నాశనం పట్టించకండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions