Sampathkumar Reddy Matta…… జీడిపండ్లూ.. జీడిపండ్లూ..!
ఓ చిన్నాయీ, ఎట్లిస్తన్నవ్..?
ఇరువైరూపాలకు చెటాకు బిడ్డా !
Ads
సౌ గ్రామయితే.. ముప్పయిరూపాలకిత్తా.
ఏందీ.. ? ఏమి ధర యిది, కొత్తగ కొంటున్నమా..?
అడవిల దొరికేటియేనాయె, గంత చెప్పవడితివీ..
చెటాక్కు ఇరువయంటె ఎక్కువనిపిస్తందారా.. ?
ఏదిజూడవొయినా అగ్గిల చెయివెట్టినట్టేనాయె,
పదిరూపాలు వెడితె బుక్కెడు చాయబొట్టు అత్తందా ?
టమాటలే పదిరూపాలకు కిల. గివ్వి గింత పిరమా ?
జీడిపండ్లు మత్తుగ అమ్మత్తన్నయి గని, ఇచ్చేధరజెప్పు.
ఏడికెల్లి మత్తుగత్తన్నయవ్వా ? గట్టుకువొయి తెచ్చెటోళ్లే లేరు.
మనచుట్టుమెట్టు ఒక్కచెట్టు లేదు. మానాల జెంగలికి వోవాలె.
ఆకలిదూప మరిచి చెట్టుచెట్టుకు గుట్టగుట్టకు పొద్దుపొద్దందాక
నలుగురు మనుసులు తిరిగితిరిగి, గీ గంపెడు ఏరుకచ్చిండ్రు.
రానువోను రెండుబండ్లకు పిట్రోలుకె ఆరువందలైనయటగాదు.
నలుగురికి కూలి పైసలన్న పడకపోతె ఇగ ఈ అమ్ముడెందుకు ?
గట్లనే అంటరు. లాగోడిలేని పంట. లాభంలేకపోతె అమ్ముతరా ?
చెటాక్కు ఇరువయంటివి. పదిపండ్లన్న వత్తయా నువ్వే చెప్పు.
చెటాకెందుకు పావుకిల కొనుక్కోరాదు. ఇవి యాడాదికో పంట.
మాలు చూడు, పూలుపూలోలె ఏంచిన,ఎంత ముద్దుగున్నయి.
పెయికెంత మంచిది. కడుపుల బల్లలు, పురుగులు, పుండ్లు..
ఏదున్నసరే, ఈ జీడిపండ్లు అన్నిటిని లేకుంట తీసిపారేత్తయి.
గందుకే కొనవడితి. సరెగని ఇరువయికి వందగ్రాములియ్యి.
యాభై రూపాలయి తీసుకుంట. ఓ పావుకిల మంచిగ జోకు.
అడిగినట్ఠిత్తె కడిగినట్టయిపోతుండే. గట్లిత్తె నేనే మిగులుత.
ఎట్లడుగుతరవ్వ గట్ల ? నోరెట్లత్తది. దుకాండ్ల ఎంతన్నా కొంటరు.
వాకిట్లకు వత్తె గీసిగీసి బ్యారెం జేత్తరు. మా కట్టం కనవడదా.. ?
నేను నిన్ను ఏమంటన్న ? గరం కావడితివీ, నీసొమ్ము నీయిష్టం.
కని, తగనిధర చెప్తె ఎవలుగొంటరు ? మొన్న కొన్నధరకే అడిగిన.
నేనెందుకు కోపానికత్తన్న బిడ్డా, తీసిపారేసినట్టు అడుగుతెట్ల ?
పైసకు చూసుకోవద్దు. పానం చూసుకోవాలె. పైసలదేమున్నది.
మనం పైసను సంపాయిత్తం – పైస మనల సంపాయిత్తదా..?
దావఖాండ్లల్ల వేలకువేలువోత్తం. వందరూపాలకు ఆలోచిత్తం.
కడుపుకు తినక, కానని కట్టంజేసి.. పోంగ ఏం కొంచవోతంరా ?
నువ్వన్నది నేనన్నది కాదుగని, ఎనుబైకి పావుకిలదీసుకో.. !
నువ్వు గమ్మతున్నవు పో, మల్ల అంత గాడికే తేవడితివేంది ?
నాకు ఇంట్ల మస్తుపనున్నది. ఆడిబిడ్డ వస్తది. వంటజెయ్యలె.
అరువయికి పావుకిల ఇత్తవా పొమ్మంటవా… ఇగ నీ ఇష్టం.
ఏం బేరం చెయ్యవడితివి తల్లీ. నాకు ఈన్నే పావుగంట గడిచె.
అద్దకిలవోసుకోని నూటపదియ్యి. ఆడిబిడ్డకిన్ని నీకిన్నయితయి.
సరెగని గవ్వి పెద్దపెద్దయి వెయి. దండెగొట్టకు. మంచిగ జోకు.
తెలివికల్లదానవే,వొర్రిచ్చి వొర్రిచ్చి నన్ను మల్ల అంతగంతే చేత్తివి.
ఏం తెలివి బిడ్డా ? ఎడ్డిమొకపు తెలివి. నాకు సదువా సాత్రమా ?
మీరంటె సదువుకోని నీడపట్టునుంటరి. మీకున్న తెలివి మాకేడిది.
ఇగో మొగ్గుజోకిన, ఇగవటు ఇంకోనాలుగు కొసరేత్తన్న. సరెనా.. !
ధరకాడ కొట్లాడుతగని, దండెకాడ మోసం .. నాకసలుకె తెల్వది.
నీ దగ్గర చిల్లరున్నయా మరి. ఐదువందల నోటు ఒక్కటేవున్నది.
ఇగో ఇది తీస్కోని, నాకు ఎనుకకు నాలుగువందలు ఇయ్యి…
ఇప్పుడే రావడితి, బోని నీదేనాయె. నా దగ్గర ఎక్కడున్నయిరా ?
రాంగ తీస్కపోతతీ, వచ్చెవరకు చిల్లరతీసుకోని రడీగ వెట్టరాదు.
మీ అత్త వట్టిగ వోనిచ్చునా ? తాగుతాగుమని చెంబెడు సల్లవోసేది.
ఇప్పుడు దుడ్డె కనవడుతలేదు. చింతచెట్టుగుడ కొట్టేసినట్టుండ్రు.
ఇప్పుడు గవన్నెక్కడియి చిన్నీ, అత్తవోయిన్నాడె అన్నివొయినై.
కోతులబాధవడలేక ఇగ చింతచెట్టుగుడ పోయినేడు కొట్టేసినం.
నేనే చేసిన.. ఇగో గీ కేకుముక్క తిను. ఇన్ని మంచినీళ్లు తీసుకత్త.
నీ కడుపు సల్లగుండ బిడ్డ. చిత్తుబొత్తయిన పానం కుదురుకున్నది.
ఊరుదిరిగి, పండ్లమ్ముటానికి అటీటుగ ఒంటిగంట అయితదేమో.
మంచిదిమరి. ఇగ పొయ్యత్త నానా.. ఓ చెయ్యేసి గీ గంప లావట్టు..!
ఇది.. మన అడవి పంట – మన ఆరోగ్యకరమైన ఆహారసంస్కృతి.
~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
మా దగ్గర సంక్రాంతి గౌరీనోముల కోసం, గౌరమ్మల దగ్గర పెట్టుటానికి
జీడిపండ్లు అవసరమౌతాయి. గతంలో చుట్టుపక్కల అడవులలోనే
దొరికేవి. ఇప్పుడు నాందేడు మరాఠీవాళ్లు తెచ్చి అమ్మిపోతున్నారు.
పావుకిలోకు 250/…200/_ నడుస్తంది. పండుగ గిరాకీ కదా,ఇంతే !
Share this Article