ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… అనగా కృత్రిమమైన మేధస్సు… అవును, దాన్ని అలా పిలవకుండా అలార్మింగ్ ఇంటలిజెన్స్ అని పిలవాలి… నాలుగేళ్ల తన కొడుకును కిరాతకంగా చంపేసి, నిర్వికారంగా సూట్‌కేసులో పెట్టుకుని 10 గంటలపాటు పక్కనే కూర్చుని ప్రయాణం చేసిన టెకీ సుచనా సేఠ్‌లో కృత్రిమ మేధస్సు లేదు, క్రూర మేధస్సు మాత్రమే ఉంది…
ఒకటి మాత్రం నిజం… మీరు ఎన్ని ఉన్నత చదువులైనా చదవండి, ఎంత మంచి పొజిషన్‌లోనైనా ఉండండి… కానీ బేసిక్‌గా మనిషి ఎదగడం లేదు… తల్లి అనే పదానికే కళంకం తీసుకొచ్చిన ఈమె నేరగాథ చదువుతుంటేనే ఓ గగుర్పాటు… చాలా నేరగాథలు చదివాం, ప్రియుల కోసం పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కడతేర్చిన మహిళల కథలూ చదివాం… కానీ ఈ సుచనా సేఠ్ క్రైం ఒకింత దడ పుట్టిస్తోంది…
చంపడం దేనికి..? ఏ అనాథాశ్రమంలోనే వదిలేయండి, లేదా ఏ బస్‌స్టాండ్‌లోనో వదిలేసినా ఎవరో పిల్లల్లేని వాళ్లు పెంచుకుంటారు… కానీ ఏకంగా ప్రాణాలు తీయడం దేనికి..? ఆమె మానసిక స్థితి బాగాలేదు అని అప్పుడే ఎవడో రాసేస్తున్నాడు… నిజమే, ఆమె మానసిక స్థితి బాగాలేదు, క్రూరత్వం నిండి విషప్రాయంగా మారిపోయింది…
Ads
దగ్గు మందు ఎక్కువ డోస్ ఇచ్చి చంపిందని ఒకడు, కాదు, దిండును ముక్కు మీద ఒత్తిపట్టి చంపేసిందని మరొకడు రాసేస్తున్నాడు… సూట్‌కేసులో పట్టకపోతే చేతులు కోసేయాలనీ అనుకున్నదట… ఇంత బరువు ఏమిటమ్మా అని డ్రైవర్ టాక్సీ డ్రైవర్ అడిగితే అందులో లిక్కర్ బాటిళ్లు ఉన్నాయని చెప్పిందట… కొంత బరువు తగ్గిద్దాం అనడిగితే అవసరం లేదు అని ఆ డ్రైవర్‌ను కసిరిందట… ఆమె ఎవరి ద్వారా ఆ ట్యాక్సీ బుక్ చేసిందో వాళ్ల దగ్గర ఆ డ్రైవర్ నంబర్ తీసుకుని, పోలీసులు అలర్ట్ చేశారు, సమీపంలో కనిపించిన పోలీస్ స్టేషన్ వెళ్లి విషయం చెప్పాడు తను… కర్నాటక బోర్డర్‌లో మూణ్నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్‌తో లేటైంది గానీ లేకపోతే తన డెస్టినేషన్ చేరి, పిల్లాడి శవాన్ని ఎక్కడో పారేసేది…
ఎన్ని కథనాలు..? పిల్లాడి శవం పక్క ఐలైనర్‌తో రాసిన ఓ లేఖ ఉందట… లేదు, లేదు, తన మాజీ భర్త సంపాదనలో అధిక శాతం అడిగిందట… కాదు, ఈమెను భరించలేకే ఆయన ఇండొనేషియాలోని జకర్తాలో బతుకుతున్నాడట… ఆ మాజీ భర్త మొహం చూడటం ఇష్టం లేదట, పిల్లాడిని చూస్తుంటే పదే పదే ఆయన మొహమే గుర్తొస్తూ కొడుకు మీద ద్వేషాన్ని పెంచుకుందట, కొడుకు కస్టడీ ఆమెదే అయినా ఆ పిల్లాడి తండ్రి, అనగా ఆమె మాజీ భర్త వచ్చి చూడవచ్చు, మాట్లాడవచ్చు, కానీ కొడుకు తన మాజీ భర్తతో మాట్లాడటమే ఆమెకు ఇష్టం లేదు… అందుకే వాడిని కడతేర్చడానికి చాన్నాళ్లుగా ఆలోచిస్తోంది…
పిల్లాడి బట్టల మీద ఏమిటీ రక్తపు మరకలు అనడిగితే… అవి నా పిరియడ్స్ బాపతు మరకలు అని చెప్పిందట పోలీసులకు,.. పిల్లాడి శవం ఉన్న సూట్ కేసు ఓపెన్ చేసినప్పుడు గానీ, దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నప్పుడు గానీ ఆమెలో ఏ ఫీలింగ్సూ లేవు… పాపం, ఆ పిల్లాడిని ఖననం చేసిన ఆ తండ్రే కుప్పకూలిపోయాడు… ఇలా బోలెడు కారణాలు, కథనాలు… ఆమె సక్సెస్‌ఫుల్‌గా దర్యాప్తును పక్కదోవ పట్టిస్తోంది… తనకు మతిస్థిమితం లేదని చిత్రించుకునే ప్రయత్నం చేస్తోంది… ఎంతైనా అలార్మింగ్ ఇంటలిజెంట్ కదా… ఆమెకు ఓ స్టార్టప్ కంపెనీకి సీఈవో… అది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించిన సంస్థ… ఆమె చాలా తెలివైంది.,. ప్రమాదకరమైన తెలివి కలది… తన కెరీర్‌లో పీక్స్‌లో ఉంది కూడా…
జాలి, ఏవగింపుతో కూడి నవ్వొచ్చేదేమిటంటే… ఆమె ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎథిక్స్‌లో ఎక్స్‌పర్ట్ అట… AI ఎథిక్స్… ఓ మనిషిగా, ఓ మహిళగా, ఓ తల్లిగా ఏ ఎథిక్సూ లేవు, అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి, మిగిలింది ఆ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాపతు ఎథిక్స్… డాటా సైన్స్ టీమ్స్‌కు ఆమె పన్నెండేళ్లుగా మెంటార్… మెషిన్ లర్నింగ్, రీసెర్చ్ ల్యాబ్స్ నిపుణురాలు… AI Ehics లో 2021 టాప్ 100 బ్రిలియంట్ వుమెన్ జాబితాలో కూడా ఆమె ఉంది… హార్వర్డ్ యూనివర్శిటీలో ఓ సెంటర్ సభ్యురాలు, రోమన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలో… నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్ మీద కొన్ని పేటెంట్లు కూడా ఉన్నాయి…
ఇంత బ్రైట్ కెరీర్… కానీ ఏం లాభం..? ఒక మనిషిగా, ఒక తల్లిగా మరణించింది… పోలీసులు భిన్న కథనాలు చెబుతున్నారు, వాళ్లు కావాలని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారా..? ఆమె ప్రదర్శించే తెలివితేటల ట్రాపులో పడిపోయారా..? సో, మరోసారి… ఉన్నత చదువులు, ఉన్నత హోదాలు, ఉన్నత నేపథ్యాలు మనుషుల్ని ఎదిగేందుకు ఏమీ తోడ్పడవు… ఈమే ఓ ప్రబల నిదర్శనం… అవ్వా, తల్లీ… మీ ప్రయారిటీలు ఏమైనా ఉండనివ్వండి… పిల్లల ప్రాణాలు దేనికి తీయడం..? చిన్న విషయాలకే హతమార్చే గుణమే మీకుంటే… అసలు పిల్లల్ని కనకుండా ఉండండి… ప్లీజ్…
Share this Article