Why Modi..? అక్కడ జరుగుతున్నది ఓ బృహత్తర కార్యక్రమమని మరిచిపోయి, కేవలం మోడీ వ్యతిరేకతతో, అసంబద్ధమైన పిచ్చి వ్యాఖ్యలతో ఓ పండుగ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కొందరు నాయకులు, మఠాధిపతులు… పోనీ, Why not Modi అనడిగితే ఒక్కరి దగ్గరా సరైన జవాబు లేదు… ఏళ్లుగా అయోధ్య పునర్నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న ప్రతి రామభక్తుడూ ఈ ప్రాణప్రతిష్ఠకు అర్హుడే… మోడీ ఎందుకు అర్హుడు కాదు..?
అంటే రకరకాల వితండాలు, మోడీ సతీవియోగుడు, అసంపూర్ణ గుడిలో ప్రాణప్రతిష్ఠ తగదు అంటారు… శాస్త్రాలు ఒప్పుకోవు అంటారు… వీళ్లు చెప్పేవే శాస్త్రాలా..? ద్వారక, శృంగేరీ పీఠాలకు శాస్త్రాలు తెలియవా..? ఏళ్లుగా అయోధ్యలో పూజలు చేసే అర్చకులకు ఏమీ తెలియదా..? యోగి ప్రాతినిధ్యం వహించే నాథ్ పరంపరల ఆశ్రమాలకు తెలియదా..? ఆ వైష్ణవ గుడి మీద ఈ శైవ పెద్దల పెత్తనాల ప్రయత్నాలేమిటో…
Ads
ఠాట్, మేం అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లబోం, మోడీ కార్యక్రమం చేస్తుంటే మేం చప్పట్లు కొట్టాలా..? అని ఓ సాధారణ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా ఉరుముతున్నారు… ఇప్పుడిక అయిదో శంకరాచార్యుడు తెరమీదకు వచ్చాడు… శ్రీమాన్ బాల్ ఠాక్రే గారి పుత్రరత్నం… ఉద్దవ్ ఠాక్రే… తండ్రి వారసత్వంగా వచ్చిన హిందుత్వను అరేబియా సముద్రంలో కలిపేసిన ఈయన ఓ కొత్త వాదన తీసుకొచ్చి, నేను మోడీని భలే పాయింట్‌తో కొట్టాను అని సంబరపడుతున్నాడు…
మళ్లీ కట్టిన సోమనాథ్ ఆలయాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించారు… ఇప్పుడు కూడా రాష్ట్రపతితో ప్రాణప్రతిష్ఠ చేయించాలీ అంటాడు… అదేమైనా ఆనవాయతీయా..? నెహ్రూ హిందూ వ్యతిరేకి కాబట్టి తను ఇంట్రస్ట్ చూపలేదు, రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చాడు… ఇప్పుడు కూడా ద్రౌపది ముర్ము అక్షరాలా వెయ్యి శాతం అయోధ్య కార్యక్రమాల కర్తగా ఉండటానికి అర్హురాలు… దేవుడి పట్ల విశ్వాసి, ఆధ్యాత్మిక ఆచరణ పట్ల సిన్సియర్… ఓ నియమబద్ధ జీవితం… అన్నింటికీ మించి ఈ దేశం నేల మీద మొదటి హక్కు ఉన్న మూలవాసులు, కోట్ల ఆదివాసీలకు ఆమె ప్రతినిధి…
తనకు రాష్ట్రపతి పదవి వస్తుందని తెలిసిన వెంటనే నిరాడంబరంగా సమీపంలోని ఓ గుడికి వెళ్లి, చీపురు పట్టుకుని, శుభ్రం చేసి, దేవుడికి మొక్కి వచ్చిందామె… మోడీకి వంద రెట్లు నియమబద్ధ ఆచరణను చూపగలదు… కానీ ఇదే వితండవాదులు మోడీకి సతి లేదు కాబట్టి అనర్హుడు అన్నట్టుగానే, ఆమెకు పతి లేడు కాబట్టి అనర్హురాలు అని ముద్ర వేయరా..? ఐనా ఈ శివసేన పీఠాధిపతి ఉద్దవ్ ఠాక్రేలు, శంకరాచార్యులు, ఇతర హిందూ ద్వేషులు ఇప్పుడు హఠాత్తుగా ధర్మశాస్త్రాలు వల్లిస్తున్నారేం..?
ఐనా ఫికర్ లేదు, అయోధ్య కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తుంది, మాజీ రాష్ట్రపతి వస్తాడు, ఉపరాష్ట్రపతి వస్తాడు… లోకసభ స్పీకర్ వస్తాడు… అందరూ ఉంటారు… ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలే కాదు, అనేక ఆధ్యాత్మిక పరంపరలను వారసత్వంగా మోస్తున్న వేల మంది సాధుసంతులు కడూా వస్తారు… 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా మోడీ చేతుల మీదుగానే కార్యక్రమం జరుగుతుంది… అయోధ్య సేనాని అద్వానీ చెప్పినట్టే ఆ రాముడే మోడీని ఎన్నుకున్నాడు… అది డెస్టినీ… ఆ సంజయ్ రౌత్ శల్యసారథ్యంలో అధికారం కోసం నానా గడ్డీ కరుస్తున్న శివసేనకు ఇప్పుడు నైతిక బోధల అర్హతే లేదు…
చివరగా… అదొక ఓ అమ్మవారి గుడి… ఫేమస్… కల్లు సాక పోసేవాళ్లు, చిన్నదో పెద్దదో బలి ఇచ్చేవారు, అక్కడే వండుకుని ప్రసాదం మొత్తం ఆరగించి వెళ్లేవాళ్లు భక్తులు… మల్లన్న గుడిలో మైలపోలు, పట్నాలు పూజాసంప్రదాయం… పసుపు ప్రధాన పూజాసామగ్రి… సమ్మక్క సారలమ్మకు బెల్లం సమర్పిస్తారు భక్తులు… విగ్రహారాధన ఉండదు… ఇలా ఒక్కొక్కచోట ఒక్కో ఆనవాయితీ, సంప్రదాయం… అక్కడ అదే శాస్త్రం… ఇప్పుడు ఆ అమ్మవారి గుళ్లో ఆగమశాస్త్రం ప్రవేశించింది… మల్లన్నగుడిలో అభిషేకాలు, కల్యాణాలు ఆరంభమయ్యాయి… ఏ విశ్వాసం కలుషితమైనట్టు… నిజానికి ప్రజల విశ్వాసాలు, అనాది ఆచారాలే అసలు శాస్త్రాలు… భక్త కన్నప్ప ఎంగిలినోటితో అభిషేకం చేసి, కాలితో వ్యర్థాలు తొలగించి, మాంసం ముక్కలు నైవేద్యం పెట్టినా సరే, అది శాస్త్రబద్ధమే… భక్తుడి అచంచల భక్తివిశ్వాసమే అసలు శాస్త్రం… ఇక శాస్త్రాల రచ్చ ఆపండి స్వాములూ…
Share this Article