శంకర్ జీ …… సంపూర్ణ సగటు మానవుడు. జన్మనామము ఉప్పు శోభనాచలపతి రావు. తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు అందరూ అలాగే అన్నారు.
బియస్సి చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్ళాడు. తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ ను చూసిన శోభనాచలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్ లా హీరోగా చూడటానికి ఆశపడ్డాడు. తండ్రి కోరిక తన కోరిక అదే అవ్వటంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాలో వేటలో పడ్డాడు. హీరో అవ్వాలనుకున్నాడు. అప్పటికే ముగ్గురు పిల్లలు. చిన్న ఇంట్లో కాపురం. ఇంటిదగ్గర నుండి వచ్చే డబ్బే ఆధారం.
ఖాళీ టైం లో ట్యూషన్లు చెప్పేవాడు. సినిమా అవకాశాలకోసం స్టూడియోల చుట్టూ సైకిల్ వేసుకుని తిరిగాడు. తన సీనియర్ నటులు రామారావు, నాగేశ్వరావు, జగ్గయ్య, కాంతరావులు హీరోలుగా వెలుగుతున్నారు. చిన్న చిన్న పాత్రలు వచ్చినా వేశాడు. శోభనాచలపతిరావు శోభన్ బాబు అయ్యాడు. భక్తశబరిలో మొదట అవకాశం వచ్చినా ముందుగా విడుదల అయ్యింది దైవబలం.
Ads
ఎన్టీఆర్, ఎయన్నారులను కలిసి అవకాశాల కోసం అభ్యర్థించాడు. కులాభిమానమో, పర్సనాలిటీ, ప్రతిభ ఉందనుకున్నారేమో ఎన్టీఆర్, ANR లు తమ సొంత చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. సాటినటులు, దర్శక నిర్మాతలతో అవమానాలు ఎదురైనా సహించాడు. తాను నర్తనశాలలో నటించినప్పుడు నిర్మాత ఇస్తానన్న 500 అడ్వాన్సు కోసం నిర్మాత ఇంటిముందు అర్ధరాత్రి పడిగాపులు కాచాడు. కారణం, తెల్లారితే కూతురు పుట్టినరోజు కోసం ఒక గౌను కొనాలన్న ఆశతో.
హరినాధ్, కృష్ణలాంటివారు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నా తనకు మాత్రం అంతంత మాత్రమే అవకాశాలు వచ్చేవి. పది సంవత్సరాలుగా అవకాశాల కోసం తచ్చాడుతున్నా ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడింది మనుషులు మారాలి చిత్రంతోనే. చాలా సినిమాల్లో హీరోగా నటించినా మనుషులు మారాలితో బ్రేక్ వచ్చింది.
తాను ఇష్టపడే హీరోయిన్ జయలలిత పక్కన హీరోగా నటించాలని ఆశపడ్డాడు. ఒక నిర్మాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలనుకున్నా జయలలిత తల్లి నిరాకరించింది. జయలలిత తల్లి సంధ్య శోభన్ బాబును దూరంగా ఉంచింది. సంధ్య చనిపోయాక కానీ జయలలితకు దగ్గర కాలేకపోయాడు. తనతో కలిసినటించిన సినిమా డాక్టర్ బాబు ఒక్కటే, తర్వాత వరుసపెట్టి హిట్ సినిమాలు వచ్చాయి.
తాసిల్దార్ గారి అమ్మాయి, శారదా, కల్యాణమంటపం, జీవనతరంగాలు ఇలా అన్నీ వరస హిట్లే. కలర్ సినిమాల రాకతో శోభన్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. శోభన్ ను అందంగా చూపెట్టటం, అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు. జేబుదొంగ, మంచి మనుషులు, పిచ్చిమారాజు, సోగ్గాడు ఇలా తిరుగులేని చరిష్మా సంపాదించాడు. పారితోషకం విషయంలో పట్టింపు లేదు కానీ ఒప్పుకున్న డబ్బు ఇచ్చి తీరాల్సిందే.
మనుషులు మారాలి, తాసిల్దార్ గారి అమ్మాయి, జీవనతరంగాలుతో ANR లాగా కుటుంబకథా చిత్రాల హీరోగా గుర్తింపు వస్తే, సోగ్గాడు, జేబుదొంగ సినిమాలతో మాస్ ఇమేజ్ కూడా పెరిగింది. సంపూర్ణ రామాయణంలో రాముని వేషం వేయించాడు బాపు. అంతవరకు రాముడంటే రామారావే అనుకునే జనాలు ఔరా… శోభన్ కూడా రాముడు లాగే ఉన్నాడే అని మెచ్చారు. ఎన్టీఆర్ లా పాత్రలలో జీవించలేదు. ANR లా నటిస్తున్నాను అనే సృహతో నటించలేదు. కృష్ణలా తనకు వచ్చిందే నటన అనుకోమనలేదు. కానీ నటించే సమయంలో పాత్రల మధ్య భావోద్వేగాల సంఘర్షణకు గురవుతానని చెప్పుకున్నాడు.
(AI Image of Shobhan Babu, Not Original)
కార్తీకదీపం సినిమాతో వరుసగా అలాంటి సినిమాలే చేసి మహిళాభిమానుల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రుల అందాల నటుడిగా కీర్తింపబడ్డాడు. సినిమాల్లో డబుల్ రోల్స్ చేసిన నిజ జీవితం డబుల్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేయలేదు, తాను లేకుంటే సినిమా పరిశ్రమ లేదు అని భ్రమించలేదు. ముక్కుసూటిగా వ్యవహరించేవాడు. ఎవరికైనా డబ్బిచ్చిన అది అప్పుగా మాత్రమే, మళ్లీ తిరిగి తీసుకునేవాడట. సినిమా దాన్నొక తపస్సులా భావించలేదు తన దృష్టిలో అదొక ఇష్టమైన ఉద్యోగం మాత్రమే…
ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే పనిచేసేవాడు. తెలివైనవాడు కాబట్టి నిలకడలేని సినిమాలతో వ్యాపారం చేయలేదు. సంపాదించిన డబ్బు రియల్ ఎస్టేట్ లో పెట్టాడు అదృష్టమో, జయలలితతో సాన్నిహిత్యమో మద్రాసులోని కోటీశ్వరులలో ఒకడిగా మారాడు. హీరోగా అవకాశాలు ఇస్తామన్నా వయసు రీత్యా పరిశ్రమలో వచ్చిన పోకడలు నచ్చక సినిమాలకు గుడ్ బై చెప్పాడు.
తనను చూడ్డం కోసం వచ్చిన అభిమానులను చదువు వదిలి తన కోసం రావద్దని మందలించేవాడు. మళ్లీ సినిమాల్లో నటించమని బ్లాంక్ చెక్ ఇచ్చినా తాను వృద్ధుడిగా అభిమానులకు కనిపించటం ఇష్టం లేక ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. ఆ సినిమా మహేష్ బాబు అతడు… ఎక్కడ దానధర్మాలు చేసినట్టుగా కనపడదు. కానీ కథలు కథలుగా ఆయనతో ముఖపరిచయం లేనివాళ్ళు కూడా ఇంటర్యూలో చెబుతుంటారు. ఈ విషయం దానం పొందినవారు చెబితే దానికి విశ్వసనీయత ఉంటుంది. ఎంచుకున్న జీవితాన్ని నచ్చినట్టుగా మార్చుకున్నాడు. వచ్చాడు, తన కర్తవ్యం పూర్తి చేశాడు. వెళ్ళిపోయాడు. అందుకే సగటు సంపూర్ణ మానవుడయ్యాడు…
Share this Article