హీరోయిన్ శ్రీలీల మీద భీకరమైన ట్రోలింగ్ కనిపిస్తోంది… ఒక హిట్ వస్తే గోల్డెన్ ఎగ్, ఒక ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్… ఇలా ఇండస్ట్రీ ముద్రలు వేసే తీరు మీద మాట్లాడుకుంటున్నాం కదా… ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్లు కూడా తోడయ్యారు… ఆమెను తీసుకుంటే ఇక ఆ సినిమా మటాషే అనే ముద్ర వేసేస్తున్నారు…
నిజంగా ఆమె ఐరన్ లెగ్గేనా..? ఆమె ఇప్పటికిప్పుడు గగనం నుంచి దిగి రాలేదు… నాలుగైదేళ్లుగా ఫీల్డ్‌లో ఉంది… అటు మెడిసిన్ చదువుతూనే ఇటు గ్లామర్ ఫీల్డ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది… రాఘవేంద్రరావు పెళ్లిసందD సినిమాలో చాన్స్ ఇచ్చాడు… అది సూపర్ ఫ్లాప్… తరువాత ధమాకా హిట్ కాగానే ఆమెకు వరుస అవకాశాలు తన్నుకొచ్చాయి…
Ads
వరుసగా ఒకేసారి పది సినిమాలకు సైన్ చేసిందంటే ఆమె డిమాండ్ ఏ రేంజులో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు… అసలు ఎవరామె..? ఇది చూద్దాం… అచ్చంగా తెలుగు పిల్ల… కానీ పుట్టింది అమెరికాలోని ఓ తెలుగు జంటకు… తల్లి స్వర్ణలత బెంగుళూరు వచ్చి గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ చేస్తోంది… శ్రీలీల కూడా అక్కడే పెరిగింది… స్వర్ణలత భర్త సూరపనేని శుభాకరరావు… తనతో స్వర్ణలతకు విడాకులయ్యాయి… తరువాత శ్రీలీల పుట్టింది…
ఆమె నా బిడ్డ కాదు అంటాడు సదరు శుభాకరుడు… సరే, వాళ్ల కథ వదిలేస్తే… ధమాకా తరువాత ఆమెలోని డాన్స్ స్కిల్ అందరికీ అర్థమైంది… చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ కూడా తీసుకుంది ఆమె… మొన్న ఎక్కడో మహేశ్ బాబు అన్నాడు కదా, ఆమెతో డాన్స్ చేయాలంటే తాట తెగిపోద్ది అని… నిజం…
మంచి ఎనర్జీ.., కొరియోగ్రాఫర్ ఏ స్టెప్పు సజెస్ట్ చేసినా సరే అలవోకగా, అందంగా వేయగలదు… ఐతే ఆమెకు వచ్చిన సమస్య కూడా డాన్సే… ఏ డాన్స్ ఆమెను నిలబెట్టిందో అదే ఆమెను డిగ్రేడ్ చేస్తోంది… జస్ట్, ఆమెను డాన్సుల కోసం తీసుకుంటూ, ఎగిరేలా చేస్తున్నారు… వరుసగా ఫ్లాపులు అని నిందలేస్తూ, ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్గు అంటున్నారు గానీ ఆమెకు మంచి ప్రాధాన్యమైన పాత్రను ఆఫర్ చేసిందెవరు..? ఒక్క భగవంత్ కేసరి మినహా… అసలు ఐరన్ లెగ్గులు ఆ హీరోలు, దర్శకులు కదా… ఏళ్లుగా ఫ్లాపులిచ్చే హీరోలను మాత్రం ఎవరూ ఏమీ అనరు…
స్కంధ, ఆదికేశవ, ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్… అన్నీ హీరోల ఫెయిల్యూర్లే… ఆఫ్టరాల్ శ్రీలీల పాత్ర ఎంత..? గుంటూరుకారంలో కూడా ఆమెను ఓ డాన్సర్‌గా చూపడానికే తాపత్రయపడ్డాడు త్రివిక్రమ్… అదేదో మిర్చిగోదాంలో తాపించి మరీ నెక్కిలీసు గొలుసు వంటి హిట్ పాటలకు స్టెప్పులు వేయించాడు దర్శకుడు… ఏవో జాతరల్లో రికార్డింగ్ డాన్సులు చేయించినట్టు… అసందర్బంగా… ఎందుకంటే..? ఆమె బలం అదే కాబట్టి అనుకున్నాడు…
ఎస్, నటన కోణంలో ఆమె ఇంకా చాలాదూరం ప్రయాణించాలి… కానీ ఓ మంచి పాత్ర దొరికితే కదా… ఆమె కూడా గాలి వీస్తున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి అనే చందంగా ఎడాపెడా సినిమాలు అంగీకరిస్తోంది గానీ… సరైన పాత్ర కావాలని ఆలోచించడం లేదు… డాన్స్ కోణంలో ఆమెకు తిరుగులేదు ఇప్పుడు… రీల్స్, షార్ట్స్ ఏవి చూసినా ‘కుర్చీ మడతపెట్టి’ పాటలో ఆమె స్టెప్పులను అనుకరిస్తున్నారు జనం…
శ్రీలీలలాగే సాయిపల్లవి కూడా మంచి డాన్సర్… కానీ వెకిలి ఊపులకు అంగీకరించదు, సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే, డీసెన్సీ లేకపోతే అస్సలు దాని వైపు వెళ్లదు… అందుకే సగటు తెలుగు కుటుంబానికి అలా దగ్గరైంది… శ్రీలీల కూడా అదే నేర్చుకోవాలి, ఒంటబట్టించుకోవాలి… పిచ్చి స్టెప్పులదేముంది..? కావాలంటే ఈటీవీ ఢీ షోలో కూడా దొరుకుతారు..! ఏ శేఖర్ మాస్టరో ఇంకాస్త పదును పెట్టగలడు..!!
Share this Article