చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్‌కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి…
నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు ప్రధానం కాదన్నట్టుగా అర్థమవుతోంది… మీడియా రకరకాలుగా రాస్తోంది… ఫుల్ జడ్జిమెంట్ కాపీ వస్తే… ఇరుపక్షాల స్టాండింగ్ కౌన్సిళ్లు క్లారిటీ ఇస్తారేమో… ఇక ఆ లోతుల్లోకి వెళ్లకుండా, నెక్స్ట్ యాక్షన్ ఏం ఉండబోతున్నది అనేది ప్రశ్న… చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు… మరి జగన్ తదుపరి ఏం చేయబోతున్నాడు..?
జగన్ మళ్లీ అరెస్టు చేయకుండా చంద్రబాబు కోర్టు రక్షణలో ఉన్నట్టే… కానీ సుప్రీం క్లారిటీ ఇవ్వడానికి ఎలాగూ మరో నాలుగైదు నెలల వ్యవధి తప్పదు… ఈలోపు ఎన్నికలు వచ్చేస్తాయి… ఫుల్ రాజకీయ హడావుడి ఉంటుంది… బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నట్టు ఏవో ఆరోపణలు చేసి, లేదా మరో కేసులోనో మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాడా జగన్..? చేయకపోవచ్చునేమో… ఎందుకంటే, అది చంద్రబాబు మీద సానుభూతికి దారితీసే ప్రమాదం ఉంది… పైగా జగన్ తను కోరుకున్నట్టే చంద్రబాబును కొన్నాళ్లు జైలులో ఉంచగలిగాడు, అవినీతి ముద్ర వేయగలిగాడు… పోనీ, మళ్లీ జైలుకు పంపించి, కీలకమైన వేళ తెలుగుదేశాన్ని ఫుల్ కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడేమో కూడా తెలియదు…
Ads
అసలు ఆ కేసులో జగన్, చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే అంశంకన్నా తెలంగాణ రాజకీయాలపై దీని ప్రభావం ఏమిటనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది… ఎందుకంటే..? తనను జైలులో పారేసిన కేసీయార్ పట్ల సహజంగానే రేవంత్‌కు కోపంగా ఉంది… తెలంగాణ ఏర్పడిన వెంటనే తమకు దక్కాల్సిన అధికారాన్ని కేసీయార్ తన్నుకుపోయి, పదేళ్లపాటు తమను బాగా తొక్కాడనే కోపం కాంగ్రెస్ ముఖ్యుల్లో కూడా ఉంది… కేసీయార్‌కు మళ్లీ కోలుకునే చాన్స్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తాడనే సందేహమూ ఉంది…
కాలేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది ప్రభుత్వం… మరికొన్ని అక్రమాలనూ తవ్వుతోంది రేవంత్ ప్రభుత్వం… 17 ఏ సెక్షన్ పరిధిలోకి వచ్చేట్టుగా ఏం కేసు పెడితే కేసీయార్ తప్పించుకోకుండా ఉంటాడో మొదట చూస్తారు… మరో ఇంట్రస్టింగ్ కోణం ఉంది… ఒకవేళ రేవంత్ ఏదైనా పకడ్బందీ కేసు పెడితే, గవర్నర్ ముందస్తు అనుమతి అనేది ఇప్పుడు ప్రధానమని సుప్రీం తీర్పులో తేటతెల్లమైంది కాబట్టి గవర్నర్ తమిళిసై దగ్గరకు రేవంత్ ప్రభుత్వం వెళ్లాల్సిందే…
ఒక మహిళను, పైగా గవర్నర్ హోదాలో ఉన్న తనను అనేకరకాలుగా అవమానించిన కేసీయార్ ప్రభుత్వం మీద ఆమెకు ఎంత మంట ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు… పైగా ఇప్పుడు ఈడీ మళ్లీ కవితకు నోటీసులు జారీచేసింది… బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ దోస్తీలో భాగంగా కవిత జోలికి ఎన్నికల ముందు పోలేదు, ఎన్నికలైన వెంటనే మళ్లీ మొదలుపెట్టింది… అసలు కేసీయార్ పట్ల బీజేపీ వైఖరి ఏమిటో, వ్యూహం ఏమిటో నరమానవుడికి కూడా అర్థమయ్యే సిట్యుయేషన్ లేదు…
ఒకవేళ గవర్నర్‌ను రేవంత్ ప్రభుత్వం ముందస్తు అనుమతి అడిగితే, ఆమె అమిత్ షా పర్మిషన్ ఇస్తే తప్ప తను అనుమతించదు… సో, ఎటు తిరిగీ బాల్ బీజేపీ కోర్టులోకే వస్తోంది… ఇంకా రహస్య స్నేహాన్ని కొనసాగించి, బీఆర్‌ఎస్‌కు కనిపించని తోకగా తెలంగాణ బీజేపీని మారుస్తారా..? లేక బీఆర్ఎస్ మీద పడతారా..? పడితే ఫాయిదా ఏమిటి..? బీఆర్ఎస్ ఇంకా బలహీనపడితే కాంగ్రెస్‌కు అనవసరంగా బలం పెంచినట్టు అవుతుందేమోనని బీజేపీ భావిస్తుందా..? లేక బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే ఆ గ్యాప్‌లోకి తాను ఇంకా చొచ్చుకుపోవచ్చునని ఆశపడుతుందా..? ఇప్పటికిప్పుడు కేడర్‌లో నమ్మకాన్ని క్రియేట్ చేయడం ఎలా..? లోకసభ ఎన్నికలయ్యేదాకా ఆగి, కేసీయార్ మీద పడదామని అనుకుంటుందా..?
Share this Article