Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ – సిరిసిల్ల సంక్షోభానికి నైతిక బాధ్యత కేఅట్ఆర్ దే!
దాదాపు ఏడేళ్ళుగా బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల పరిశ్రమపై నిన్నటి ప్రభుత్వం ఏటా మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసిందని మీకు తెలుసు. ఇప్పటిదాకా మొత్తం రెండువేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఐనా నిన్నటికి నిన్న కేటిఆర్ ఈ పరిశ్రమ సంక్షోభంలో ఉందంటూ గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్త పథకాలు లేదా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోతే సిరిసిల్ల తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందని సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందారు. ఒకరకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అసలు వాస్తవాలు మరొకసారి చెప్పక తప్పదు. వాస్తవానికి దశాబ్దకాలం అక్కడి ప్రజా ప్రతినిధిగానే కాక మంత్రిగా కూడా పనిచేసినందున సిరిసిల్ల సంక్షోభానికి ఆయనే బాధ్యత వహించాలి. పునర్నిర్మాణం చేయవలసిన వారు చేయకపోవడం కారణంగానూ ఆయన వైఫల్యమే సిరిసిల్ల సంక్షోభానికి అసలు కారణం అన్నది విమర్శలు చేస్తున్న కారణంగా ఇప్పటికైనా వెల్లడించాలి.
Ads
వాస్తవానికి తమ పదేళ్ళ పరిపాలనలో సిరిసిల్లను రాజకీయంగా వాడుకుని, లబ్ది పొందిన కేటిఆర్ మూడోసారి తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టక పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తక్షణం బతుకమ్మ చీరల పథకం కొనసాగుతుందా లేదా అన్నది ఒక అంశం కాగా, ఇక్కడి మాస్టర్ వీవర్ల పాత బకాయిలు ఇప్పించడం ఎట్లా అన్న సంకట పరిస్థితి మరో కారణంగా ఉంది. అంతకు మించి తాము విఫలం చెందారన్నది వెల్లడికాకుండా ఉండేందుకు కూడానూ ముందే జాగ్రత్త పడి ఆ వైఫల్యాన్ని మెల్లగా కాంగ్రెస్ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు…
రాష్ట్రంలో చేనేత బడ్జెట్ కన్నా ఎక్కువ ప్రతి ఏటా బతుకమ్మ చీరల బడ్జెట్ అని చెప్పాలి. అదీగాక ఆ చీరల తయారీ రాష్ట్రంలో కేవలం సిరిసిల్లకే పరిమితం చేశారు. అదేగాక చెంత చెరలు కాకుండా పవర్ లూం (మర నేత ) తయారీ అన్నది గ్రహించాలి. ఐతే ఇందుకు అసలు కారణం ఏమిటంటే ‘ఉరిశాల’ను ‘సిరిశాల’గా చేయడం అని ఇప్పటిదాకా నమ్మించారు. కార్మికులకు ఉపాధి కల్పన అని నొక్కి చెప్పారు. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉంది.
బిఆర్ఎస్ పార్టీ ఓటమితో అసలు నిజాలు ఇప్పటికైనా అందరూ గ్రహిస్తున్నారు. అందులో ‘సిరిసిల్ల’ అన్నది కేటిఅర్ రాజకీయ కార్యశాలగా ఉపయోగపదిందే తప్ప అక్కడ కార్మికుడి స్థితిగతీ ఏమీ మారలేదు. కేవలం ఏడాదికి ఐదు మాసాల పని దొరికింది తప్పా అతడి జీవన భద్రతకు శాశ్వతమైన మార్గం లభించలేదు. అంతేకాదు, ఈ చీరల వల్ల అంతకుముందు ఉత్పత్తి ఐన పాలిస్టర్ వస్త్రం, పెట్టికోట్లు తయారీకి వాడే వస్త్ర ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని ఎక్కడా ఎవరూ చెప్పడం లేదు. వీటికి తోడు వివిధ రకాల యునిఫాం దుస్తులకు వాడే వస్త్రాన్ని ఆర్డర్లను టెండర్లు లేకుండా ఆయా సంస్థలకు నేరుగా ఇప్పించడంలో కూడా విఫలం చెందారు. ఇవన్నీ కార్మికుడికి పని స్థిరపడకుండా చేసినవే. వాటిని తమ ఏలుబడిలో పరిష్కరించకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం తక్షణం చొరవ చూపాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. నిజానికి అవసరమైనదే ఐనా ముందు తమ వైఫల్యాన్ని అంగీకరించి ఆ దిశలో వారు అడుగులు వేయాల్సి ఉంది.
ఐతే, ఇవన్నీ ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే, మొత్తంగా బతుకమ్మ చీరల ద్వారా సిరిసిల్లలో బాగుపడింది కేవలం మాస్టర్ వీవర్లే అని చెప్పడం. వారి కోసమే సిరిసిల్ల పరిశ్రమను కేటిఅర్ మరోసారి వార్తల్లోకి తెస్తున్నారు తప్ప కార్మికుల అభ్యున్నతి కారణం కాదు…
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో అత్యంత దుర్భరమైన పరిస్థితి అక్కడి నేతకారులది. వాళ్ళు వారానికి ఒకసారి జీతం తీసుకుంటూ ఏడాదికి ఐదు నెలల పాటు బతుకమ్మ చీరల పనిలో ఉంటారు. ఉంటే ఒక ఆరు నెలల పని కూడా ఉంటుంది. ఇలా తక్కువ వేతనాలు అందుకుంటూ కార్ఖానాలలో రోజుకు పన్నెండు గంటలు కష్టిస్తూ దినదినం ఆయుష్షుని కోల్పోతూ ఉంటారు. వారి గురించి కన్నా వారితో పని చేపించుకునే ఆసాముల కన్నా మొత్తం పరిశ్రమను ఈ స్థితికి తెచ్చిన మాస్టర్ వీవర్లు ఎప్పుడూ సిరిసిల్ల అంటే తామే అన్న రీతిలో చలామణీ అవుతుంటారు. వీళ్ళు ఎన్నడూ కార్మికుల గురించి అస్సలు మాట్లాడారు. ఏటా పని దొరికేలా ప్రభుత్వం విధానాలు రూపొందించలేదని వారు బయటకు చెప్పరు. ఆసాములు కూడా నోరెత్తలేరు. వీవర్లు తరపున కార్మిక సంఘాలు కూడా అసలు విషయాలు మాట్లాడరు. ఎందుకూ అంటే సిరిసిల్లలో కార్మికుడి పక్షపాతం వహించే వ్యవస్థ లేదు. అందుకు కారణం అక్కడి పదేళ్లుగా వేళ్ళూనుకున్న కేటిఆర్. లేదంటే అక్కడ శాసన సభ్యులుగా ఉంటూ తమ కనుసన్నల్లోనే పరిశ్రమ విషయాలు బయటకు వెళ్ళేలా జాగ్రత్త పడే నేతలని చెప్పాలి. అట్లా ఎప్పుడూ ఇక్కడి కార్మికుడు అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు…
విచిత్రం ఏమిటంటే, ప్రతిసారీ ‘నేతన్న’ల పేరుతో జరిగే ప్రకటనలు అసలు ఇది ‘నేత’ పరిశ్రమ కాదన్న సత్యాన్ని మరుగున పడేస్తుంది. ఇది మరనేత పరిశ్రమ. దాన్ని ఆసరా చేసుకుని మాస్టర్ వీవర్లు, వారికీ తోడుగా ఉన్న రాజకీయనేతలు సృష్టించే సమస్యే తప్పా కింది స్థాయి కార్మికుల దృష్టిలో పెట్టుకుని చేసే ప్రకటన కానేకాదు. వారిని ఆశ్రయించి ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటున్న వాళ్ళ మనుగడ ఇప్పటికైనా లోతుగా అధ్యయనం జరగాలి.
ఇక కార్మికులు. చూడటానికి వారు చేసేది పనిలాగా ఉంటుంది గానీ ఆ మాట పనికిరాదు. అది నిస్సహాయ శ్రమ. పగవాడు కూడా పడకూడని నరక యాతన. బతుకమ్మ చీరల పని వచ్చాక మరమగ్గాలలో పెద్ద మార్పులేదు గానీ, కార్మికులు మరింత శ్రద్ధాశక్తులు పెట్టవలసి వస్తోంది. ఈ వయసులో నైపుణ్యం పెంచుకోవలసి రావడమే గాక శరీరం సహకరించక పోయినా, కండ్లు మరింత పాడవుతున్నా పని చేయక తప్పడం లేదు. అది వారిని అదనపు ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ సంగతి ఎవరికీ చెప్ప్పుకునే పరిస్థితి లేదు. అందుకే అసలు సంగతి చెప్పడం.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు కేంద్రం అన్నది పేరుకే. పరిశ్రమ స్థాయి గానీ, కార్మిక చట్టాలు గానీ ఇక్కడ అస్సలు అమలు కావు. నిజానికి దశాబ్దాలుగా అక్కడ జరిగింది ఏమిటీ అంటే, నాసిరకం మరమగ్గాలతో పట్టణం ఒక వస్త్ర పరిశ్రమగా ఎదగడం. ఎదగడం కాదు, చూపించడం. నిజానికి అది బలుపు కాదు, వాపూ కాదు. ఒక అబద్దం.
పవర్ లూమ్స్ నాసీరకంవి. వాటిని వాడుకలో ‘సాంచెలు’ అంటారు. అవి నిరుపయోగమైనవి. మొదట్లో ఒకరిద్దరు స్క్రాప్ కింద నాటి బొంబాయి నుంచి చవకగా కొనుగోలు చేసుకొని వచ్చి ఇక్కడ ఇన్ స్టాల్ చేసినవే ఆ మరమగ్గాలు. ఒకరిని చూసి ఒకరు వాటిని తేవడం, ఇక్కడ పని ప్రారంభించడంతో ఇంతింతై వటుడింతై అన్నట్టు సిరిసిల్ల అన్నది మరమగ్గాల పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఒకటి వెనుక ఒకటి అనేక కార్ఖానాలు పెరిగిపోయాయి. నాణ్యమైన వస్త్రం తయారు కాదిక్కడ. కానీ ఈ మగ్గాలు స్థాపించిన వారికి అనాదిగా లాభాలు తెచ్చి పెట్టడంలో మటుకు అవి పనికొచ్చాయి. ఈ లొసుగు ఉన్నది కనుకే దశాబ్దాలుగా ఈ మగ్గాలను స్థాపించిన మాస్టర్ వీవర్లు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం అన్నది గానీ, నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన ఆధునిక మగ్గాల్లోకి మరలడం అన్నది కానీ చేయలేదు. కేటిఆర్ మంత్రిగా వచ్చాక జరిగిన ఆధునీకీకరణ అన్నది మొత్తం మగ్గానికి ఒక చిన్న బాక్స్ ని అటాచ్ చేయడం తప్ప వేరొకటి జరగలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి చేసిందేమిటీ అన్నది ఇప్పటికైనా నిగ్గు తేల్చాలి.
కాగా, అందుబాటులో ఉన్న లేబర్ తో కోట్లకు పడగలెత్తడం తప్ప ఇక్కడి మాస్టర్ వీవర్లు మరొకటి పట్టించుకోలేదు. లేబర్ తామిచ్చిన పని చెయనైనా చేయాలి లేదా పస్తులుండవలసిందే. అదీ ఇక్కడి పరిస్థితి. అందుకే ఇప్పుడు పరిశ్రమను సంక్షోభంలో ఉందీ అని చూపి మూసేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ముందే చెప్పినట్టు ఈ సాంచెలు (మర మగ్గాలు), వాటి కోసం ఏర్పడిన కార్ఖానాలు, అవన్నీ నలభై యాభై ఏండ్ల కిందట నిర్మించినవే. నిజానికి విశాలమైన నాటి పాత ఇండ్లు ఆ కార్ఖానాలు. ఒకటొకటిగా పవర్ లూమ్స్ పెరిగాయి గానీ వసతులలో మార్పు లేదు. ఉండదు. గాలి ఆడదు. వెలుతురు రాదు. బూజు పట్టి భూతాల నిలయాల్లా ఉంటాయవి. గంటలకు గంటలు నిలబడి పని చేసే కార్మికులకు విశ్రాంతి తీసుకునే పరిస్థితి అసలే ఉండదు. అంతెందుకు, మూత్ర విసర్జనకు, కాలకృత్యాలకు కూడా తగిన అవకాశాలు ఉండవు. ఉగ్గబట్టుకుని పనిచేసే పరిస్థితి ఇప్పటికీ అనేక కార్ఖానాల్లో ఉంది. ఇంకా విషాదం ఏమిటంటే, రాత్రి డ్యూటీ చేసే కార్మికులను లోపలికి వదిలి బయటి నుంచి తాళాలు వేసే మాస్టర్ వీవర్లు కూడా అక్కడున్నారు.
ఒక రకంగా బానిసల్లా కార్మికులు పని చేసే ఆ కార్ఖానాలు అచ్చంగా నరక కూపాలే. ఇది పది ఇరవై మంది కార్మికుల సమస్య కాదు, ఇరవై వేలకు మించిన కార్మికుల దుస్థితి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. అణిచివేతకు మారు పేరుగా ఉన్న సిరిసిల్ల కార్ఖానాల గురించి, ఆధునికతకు, మార్పుకు తావివ్వని మాస్టర్ వీవర్ల వైఖరి గురించి కొత్త ప్రభుత్వం ఆలోచించవలసిందే. ఐతే, ఇటువంటి పరిస్థితులు మార్చడానికి కేటిఆర్ ఏం చేశారన్నది చెప్పకుండా మళ్ళీ సంక్షోభంలో పరిశ్రమ ఉందని కొత్తగా చెప్పడం చిత్రమే మరి.
నిజానికి దశాబ్దానికి ఒక మారు లేదా పుష్కరానికి ఒకసారి తలెత్తే సిరిసిల్ల జీవన సంక్షోభానికి కారణం పని లేకపోవడం ఒక్కటే కాదు. పని పరిస్థితులు దుర్భరంగా ఉండటం కూడా ముఖ్య కారణం. ఇక్కడి మాస్టర్ వీవర్లు తగిన పని ఇవ్వలేని స్థితి ఏర్పడినప్పుడు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారికంగా ఆరేడు వందలని చెప్పినా నిజానికి వేయికి పైగా నేతన్నలు చచ్చిపోయారంటే, గుడి గంటకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారంటే దానికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన ఈ పరిశ్రమ యధావిధిగా కొనసాగడమే. ఇందుకు మాస్టర్ వీవర్ల బాధ్యతా రాహిత్యం ఎంత చేటు చేసిందో వీళ్ళని అదుపు చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం అంత కీడు చేసిందని చెప్పాలి. ఆ లెక్కన ఈ పదేళ్ళలో ఎక్కువ ఆత్మహత్యలు లేకపోవచ్చు గానీ కుటుంబాల్లో జీవచ్చవాలు ఉన్నాయన్నది గమనించాలి.
చిత్రమేమిటంటే, ఆత్మహత్యల వల్ల బాగా లబ్ది పొందింది కూడా మాస్టర్ వీవర్లే. ఆత్మహత్యలు పెరిగిన ప్రతి సందర్భంలోనూ వారు ప్రభుత్వం నుంచి అత్యధికంగా సహాయం పొందగలిగారు. విద్యుత్ సబ్సిడీ మొదలు బ్యాకు రుణాల దాకా వారు కార్మికుల ఆత్మహత్యల చూపే లాభపడుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా వారు మరింత లబ్ది పొందుతూ వచ్చారు. అందుకు బతుకమ్మ చీరల తయారీ ప్రాజెక్టు వారికి పెద్ద వరంలా కలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం అంటున్నారు అంటే, తిరిగి మళ్ళీ మరో అంకం తెరలేస్తున్నదా అన్న సందేహం కలుగుతోంది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడేందుకే ఈ బతుకమ్మ చీరల తయారీ అని ప్రభుత్వం అంటోంది గానీ అది కేవలం మాస్టర్ వీవర్ల ప్రయోజనాలు కాపాడటానికే అని అర్థం చేసుకోవలసి వస్తుంది. వరుస ఆత్మహత్యల ఉదంతం ఎలాగో ఈ పథకం మరోసారి ఈ మాస్టర్ వీవర్లు యధేచ్ఛగా బలపడటానికి వీలు దొరికింది. విషాదం ఏమిటంటే ఈ పథకం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయి. ఏటా మూడు వందలు, దాదాపు ఏడేళ్ళు.
బతుకమ్మ చీరల పథకం వచ్చాక కూడా మాస్టర్ వీవర్లు మర మగ్గాలను పెద్దగా మార్చలేదు. కార్ఖానాల్లో పని పరిస్థితులు ఎంతమాత్రం మెరుగు పరచలేదు. బతుకమ్మ చీరలకు చక్కటి డిజైన్లు రావడానికి వీలుగా పింజర్లు, జకర్టాలు వంటివి బయటి నుంచి అమర్చడమే తప్ప మరమగ్గాలను ఆధునీకరణ చేయడానికి ఎంతమాత్రం పూనుకోలేదు. తూతూ మంత్రంగా ఒక ఆధునీకరణ కోసం ఒక పథకం తెచ్చారు గానీ ఆచరణలో దాన్ని ఫలితం ఏమీ లేదు. వీటన్నిటి గమనిస్తే, సిరిసిల్ల పరిశ్రమ అవకాశం ఉండీ ఒక పెద్ద ముందడుగు వేయలేక పోయింది. వరసగా ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసిన రెండు వేల కోట్ల రూపాయలు కూడా మౌలిక మార్పుకు దోహదపడలేదు.
విచారకరమైనది ఏమిటంటే, ప్రతి ఏటా మూడు వందలకు కోట్ల రూపాయలకు పైగా వ్యయం గల బతుకమ్మ చీరలు నేసే ఈ నేతన్నల అస్తిత్వం, ఉపాధి, వారి మెరుగైన జీవన ప్రమాణాలు అన్నవి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యాలుగా లేకపోవడం. అందువల్లే ఇరవై ఆరు వేల మందికి పైగా నేతన్నలు ( ప్రస్తుతం కొంత తగ్గి ఉండవచ్చు ) కేవలం దినసరి కూలీలుగా, ఒకరకంగా దొరల ఇండ్లలో బతుకమ్మను పేర్చే జీతగాల్లుగా మరిపోవలసి వచ్చింది తప్ప ఈ పథకం వల్ల తమ బతుకులు మారలేదు. జీవన ప్రమాణాల్లో కనీస మార్పు జరగలేదు.
ఈ పథకం వ్యక్తిగతంగా గానీ, వస్త్ర పరిశ్రమ వికాసానికి గానీ దోహద పడక పోవడం యాదృచ్చికం కాదు. దేన్నీ అలక్ష్యం అనో లేదా మాస్టర్ వీవర్ల స్వప్రయోజనాలు నెరవేర్చే పథకం అనో అనుకోకుండా ఇప్పటికైనా కూలంకషంగా చర్చించుకుని సమీక్షించుకోకపోతే, ఒక విజన్ తో పని చేయకపోతే సిరిసిల్ల ఎప్పటికీ మారదు. ప్రజాధనం వృధాకాకుండా ఆగదు. ఇక్కడి సంక్షోభం అన్నది కేటి ఆర్ వంటి రాజకీయ నేతలకు ఉపాధి హామీ పధకమే అవుతుంది.
ఇంకో సంగతి. పేరుకు మూడు వందల కోట్లు అంటాం గానీ, నేతకారులకు వారానికి ఒకసారి జీతం పడుతుంది. బతుకమ్మ చీరలు లేనప్పుడు నెలకు అతి కష్టం మీద ఏడెనిమిది వేలు లభిస్తే, ఈ చీరల పని ఉండే ఆరు మాసాలు దానికి రెట్టింపు లేక మరికొంచెం అధికంగా సంపాదిస్తారు. సగటున ఇరవై వేలు సంపాదన అనుకోవచ్చు. ఆ డబ్బు ఆ నెలరోజులకే సరిపోతుంది తప్ప దాన్ని పొదుపు చేసుకునే స్థితి వారికి ఉండదు. ఒక్క మాటలో బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల కార్మికులు వేతన జీవులుగా బతికి బట్ట కడుతున్నారు తప్ప వారు సంపాదిస్తున్నది ఏమీ లేదు. అందుకే వారి కళ్ళలో ఆనందం లేదు. ఒంట్లో ఉత్సాహం లేదు. కేవలం మూగజీవాల మాదిరిగా నోరెత్తకుండా, ప్రస్తుతం ఉన్న పని పోకుంటే చాలు అనుకుని అన్యాయాన్ని సహిస్తూ బతుకుతున్నారు. పైపైన చూస్తే వారి బ్రతుకుకు భరోసా దొరికినట్లు అనిపిస్తుంది గానీ, ఆ భరోసా మాస్టర్ వీవర్లకు దొరికిందే తప్ప వీళ్ళకు కాదని ఎవరికైనా సులభంగా భోదపడుతుంది.
ఇక్కడే కార్ఖానాల సంగతి కూడా చెప్పాలి. నెలకు ఆరునెలల బతకమ్మ చీరల పని, ఇది కాకుండా ప్రభుత్వ యూనిఫారాలు, ఎన్నికల సామాగ్రీ, ఇతరత్రా చిన్న చితకా పని ఇస్తారు మాస్టర్ వీవర్లు. ఇంతకు మించి నాణ్యమైన వస్త్రాన్ని తయారు చేసేందుకు, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ నేసేందుకు సిరిసిల్లను ప్రణాళికా బద్దంగా ఎవరూ అభివృద్ధి చేయలేదు. అందుకే మరమగ్గాల ఆధునికతకు చోటివ్వడం లేదు. ఫలితంగా సుమారు రెండు వందల కార్ఖానాలు ఎటువంటి వసతీ సౌకర్యాలను ఇముడ్చుకోకుండా నరక కూపాల్లా ఉన్నాయి.
విషాదం ఏమిటంటే ఈ మాస్టర్ వీవర్లను ఎవరూ ప్రశ్నించరు. కుదరదు కూడా. కరోనా వంటి విపత్తు సమయంలో కార్మికులు ఆధారపడ్డది కూడా వీరిపైనే. అందుకే ఈ యజమానులను కాదని బతికే పరిస్థితి కార్మికులకు ఉండదు. కాబట్టే మాస్టర్ వీవర్ల బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించే కథనాలు కూడా స్థానిక విలేకరులు రాయరు. ఎందుకంటే వాళ్ళూ అదే కులస్తులు. అవే సంబంధ బాంధవ్యాల్లో ఉంటూ వస్తారు కనుక వాస్తవాలు చెప్పలేని అనివార్యత. కాబట్టి మాస్టర్ వీవర్లను అడిగే వ్యక్తి ఉండరు. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కూడా ఈ వ్యవస్థను మార్చే పని కంటే లాలూచీ పడి బ్రతక నేర్చడం వలన సిరిసిల్ల ఎప్పుడూ మృత్యుశయ్య మీదనే ఉంటూ వస్తోంది.
నిజానికి బతుకమ్మ చీరల బడ్జెట్ తో సిరిసిల్లలోని కార్మికులను వేరే ప్రత్యామ్యాయ వ్యవస్థలోకి దశల వారీగా మరల్చే ప్రణాళిక చేయవచ్చు. చేయవలసి ఉండింది. కానీ నిన్నటి మంత్రి నేటి స్థానిక శాసన సభ్యలు కేటీఆర్ రాజకీయ మనుగడకు ఊతగా మళ్ళీ ఈ మాస్టర్ వీవర్లే నిలబడవలసి వస్తుంది. అందువల్ల మంత్రిగా ఉన్నప్పటికీ అన్నీ తెలిసి వారు చూసీచూడనట్టు వ్యవహరించవలసి వస్తోంది. కానీ విజనరీ లీడర్ గా ఎదగవలసిన ఈ యువనేత తన ఉదాసీన వైఖరి కారణంగా తక్షణ రాజకీయ లబ్ది పొందినప్పటికీ దీర్ఘకాలికంగా సిరిసిల్ల పతనానికి బాధ్యత వహించవలసే వస్తుంది.
సారాంశంలో ఈ మాస్టర్ వీవర్లు, రాజకీయ వ్యవస్థ, రెండూ పడుగు పేకల్లా కలిసిపోవడం వల్ల సిరిసిల్ల పునర్నిర్మాణం అన్నది కోట్ల డబ్బు వెచ్చించినా జరగకపోవడం విషాదం. పనులన్నీ సంస్కరణ రీతిలో ముందుకు సాగుతున్నవి తప్ప మనుగడలో సాదిస్తున్నది ఏమీ లేదు. విచారకరం ఏమిటంటే, రోజురోజుకూ కార్మికుల జీవితాలు దెబ్బ తినడం. వారు మనుషులుగా మనగలిగే స్థితి లేకుండా పోవడం. ఏదో రకంగా మునుపటి జీవితంలోనే మగ్గి పోవడం. ఒక్క మాటలో యంత్ర భూతాల మధ్య రక్తమాంసాలు లేని, ఆత్మ వీడిన భూతాల్లా ఆ కార్ఖానాల్లోనే కొట్టుమిట్టాడవలసి రావడం. మీకు ఇదంతా పట్టణం బయట కానరాదు. దయచేసి కార్ఖానాల్లోకి అడుగుపెట్టండి. తెలిసిపోతుంది.
సిరిసిల్లలో మాస్టర్ వీవర్లు రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉంటారు. వీరిలో కోట్లాది రూపాయల బతుకమ్మ చీరల ప్రాజెక్టును చేసే మాస్టర్ వీవర్లు నూటాయాభై మంది దాకా ఉంటారు. ఈ ఇరువురు మాస్టర్ వీవర్ల కింద దాదాపు ఇరవై ఆరువేల కార్మికులు నలిగిపోతూ ఉంటారు. ఇంతమంది జీవితాలను నిర్దేశించేది ఆ కొద్ది మందే అని గమనించాలి.
వస్త్ర పరిశ్రమకు సంబంధించిన తమ అధీనంలోని మగ్గాలు ఉత్పత్తి చేసే వస్త్రానికి ఏ కారణంగా నైనా బయట డిమాండ్ లేకపోతే మాస్టర్ వీవర్ల అకస్మాత్తుగా పని ఆపేస్తారు. దాంతో మరుసటి రోజు నుంచి కార్మికులకు పూట గడవదు. ఆత్మహత్య లు చేసుకోవలసిందే. అదే నాడు జరిగింది. సిరిసిల్ల ఉరిశాల కావడానికి కారణం ఈ రెండు కారణాల వల్లే. నిజానికి వారి అత్మహత్యలకు కారణం పని లేని స్థితి ఒకటైతే, పని చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించడం మరో కారణం…
నిజానికి రెండు లేదా నాలుగు మర మగ్గాలను ఒక మనిషి చూసుకోవాలి. కానీ వాటి సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి, ఆ తర్వాత పన్నెండుకూ పెంచిన మాస్టర్ వీవర్లూ ఉన్నారు. దాంతో పది పన్నెండు పవర్ లూమ్స్ ని ఒక్క కార్మికుడు చూసుకునే పరిస్థితి తలెత్తింది. దాంతో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఉదయం షిఫ్టు, రాత్రి షిప్టుల్లో కార్మికులు తీవ్ర ఒత్తిడి మధ్య … సదా నిలబడే పని చేయడం వల్ల వాళ్ళు శారీరకంగా మానసికంగా బాగా దెబ్బతిన్నారు. నిత్యం దడదడలాడే ఆ సౌండ్ల మధ్య వాళ్ళ మానసిక స్థితి గందరగోళంగా తయారవుతుంది. శబ్ద కాలుష్యం, మానసిక దౌర్భల్యం …ఈ రెండిటి మధ్య వారికి మైండ్ బ్లాంక్ గా ఉంటుంది. ఇంటికి వెళ్లి తినలేరు. తాగకుండా ఇంటికి పోలేరు. ఆ తాగేది మత్తు పెంచే తెల్ల కల్లు కావడం ఆరోగ్యాలు మరింత దెబ్బతిన్నాయి. ఇంకా చెప్పాలంటే … తాగి ఇంటికి వెళ్ళాక సరిగా తినరు. సంసార జీవితం గడపలేరు. దుర్మార్గమైన ఇటువంటి పని పరిస్థితుల మధ్య పురుషులు సహజమైన జీవితానికి, ముఖ్యంగా నిద్ర, తిండి, సంభోగం – ఈ మూడు సహజాతాలకు దూరమయ్యారు. ఇదే పెను సంక్షోభానికి దారితీసి భార్యాభర్తల మధ్య కలహాలకు, అకాల మరణాలకు, ఆత్మహత్యలకు కారణమైంది.
ఈ నేపథ్యం అంతా మనం గమనించకుండా, విమర్శనాత్మకంగా పరిశీలించకుండా ఉంటే కేటిఅర్ మాటలు నమ్మే పరిస్థితే ఉంటుంది. అందుకే ఈ వ్యాసం. ఇక, చివరగా పవర్ లూమ్స్ కి షిఫ్ట్ కాకుండా ఇంకా హ్యాండ్ లూమ్స్ పై పనిచేసే డెబ్బై కుటుంబాలు ఉన్నాయక్కడ. వారంతా వృద్ధులు. సిరిసిల్ల వస్త్ర సంక్షోభంలో వీరిలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోక పోవడం గమనార్హం. వారి స్పూర్తితో సిరిసిల్లను మరనేత కాకుండా చేనేత కేంద్రంగా చేయడానికి ఇంకా గొప్ప భవిష్యత్తు ఉందనేది ఈ వ్యాసకర్త అభిప్రాయం.
సిరిసిల్లకు ప్రత్యేక బ్రాండ్ ఏదైనా రూపొందించడానికి అవకాశమూ వారికి తెలుసు. ఇప్పటికీ పనిచేస్తున్న ఇక్కడి నాలుగు సంఘాల్లోని ఆ చేనేత వృద్ధ కళాకారులను పేరుపేరునా పిలిచి సన్మానం చేసి, వారి సలహా సూచనలు తీసుకోవచ్చు. సిరిసిల్ల తిరిగి సంక్షోభంలో పడకుండా ఉండటానికి ఏం చేయాలో కనుక్కోవచ్చు.
అంతేకాదు, ఈ వృద్ద నేతన్నలతో పాటు ఇక్కడి మహిళలతో తప్పక మాట్లాడాలి. ఆత్మహత్యలు చేసుకున్న పురుషుల భార్యలతో చర్చించాలి. కుటుంబాలను నెట్టుకు రావడానికి వారు ఇంకా బీడీలు చేస్తున్నారు. వారితో మాట్లాడాలి. సిరిసిల్లకు ఏం కావాలీ అన్నది వారు బాగా చెబుతారు. అంతేగానీ అవకాశం ఉండీ పని చేయని రాజకీయ నేతలు మాటలు వినడం మరింత ప్రమాదకరం. అస్తమనూ సంక్షోభం పేరిట కాకుండా పునర్నిర్మాణం దిశలో ఆలోచిస్తే నూతన ప్రభుత్వం ముందట సైతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ దిశలో రేవంత్ రెడ్డి సిరిసిల్లను కొత్తగా అధ్యయనం చేయాలన్నది ఈ పాత్రికేయుడి ప్రతిపాదన… వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు… కందుకూరి రమేష్ బాబు, మొబైల్ 9948077893
Share this Article