అదే హనుమంతుడు… అవే దివ్యశక్తులు… ఓ భక్తుడికి అండగా నిలిచే అద్భుతమైన ఫాంటసీ కథ… దేశం మొత్తానికీ తను ఆ రామభక్త ఆంజనేయుడే కదా… హిందూ జాతి మొత్తానికి అదర్శ, ఆరాధ్యుడైన దేవుడే కదా… మరి వాళ్లకు ఎందుకు నచ్చలేదు ఈ హనుమాన్ సినిమా… ఎందుకు లైట్ తీసుకున్నారు..?
అందరూ అనుకుంటారు, సౌత్ ఇండియా ప్రేక్షకుల అభిరుచి ఒకే రీతిగా ఉంటుందని..! కాదు, ఒకరి సినిమాలను ఒకరు ఇష్టపడరు… (కొన్ని మినహాయింపులు ఉండవచ్చుగాక)… హనుమాన్ సినిమాయే ఓ తాజా ఉదాహరణ… అయితే ఇక్కడ చిన్న సడలింపు… తెలుగువాడు ఇతర సౌత్ సినిమాల్ని, సౌత్ హీరోల్ని నెత్తిన పెట్టుకుంటాడు… కానీ కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులు మన హీరోలను, మన సినిమాల్ని పెద్దగా పట్టించుకోరు… (స్థూలంగా…) మన హీరోల్ని కూడా లైట్ తీసుకుంటారు…
ఒక రజినీకాంత్, ఒక కమల్‌హాసన్ మాత్రమే కాదు, సూర్య, కార్తి, సిద్ధార్థ, శివకార్తికేయన్, ధనుష్, విశాల్… ఎవరినైనా తీసుకొండి, తెలుగు ప్రేక్షకులు మన హీరో అన్నట్టుగా ఓన్ చేసుకుంటారు… కొందరి సినిమాలయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లాగే ఆడుతాయి… మలయాళ మమ్ముట్టిని, మోహన్‌లాల్‌ను కూడా మన తెలుగు హీరోలకు దీటుగా ఆదరిస్తాం.,. గతంలో లేదు గానీ, ప్రస్తుతం కన్నడ హీరోలు యశ్, రిషబ్, రక్షిత్ కూడా మనవాళ్లయిపోయారు…
Ads
ఒక కాంతార, ఒక కేజీఎఫ్, ఒక చార్లి తెలుగు నాట కూడా మంచిగా సొమ్ముచేసుకున్నాయి… మరీ పొన్నియన్ సెల్వం వంటి పజిల్ కథలు తప్ప మనకు తమిళ సినిమా కథలు కూడా నచ్చుతాయి… కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీలలో హిందీ సినిమాలు పెద్దగా ఆడవు గానీ హైదరాబాదులో హిందీ సినిమాలు కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లాగే ఆడతాయి… మరి మన తెలుగు సినిమాలు వాళ్లకెందుకు ఆనడం లేదు..?
హనుమాన్ సినిమా ఆ రికార్డు బద్దలు కొట్టింది, ఈ చరిత్ర తిరగరాసింది, తెలుగు సినీపెద్దల మొహాల్ని పగులగొట్టింది వంటి వార్తలు రోజూ బోలెడు వస్తున్నాయి… కానీ ఈ పాన్ ఇండియా సినిమా కన్నడ, తమిళ, మలయాళ కలెక్షన్లను ఓసారి చూడండి…
చూశారు కదా… కన్నడంలో మొదటి రోజు 2 లక్షలు, అయిదో రోజు 5 లక్షలు… అదీ కన్నడనాట బెంగుళూరు, గుల్బర్గా వంటి చోట్ల నివసించే తెలుగు ప్రజల నుంచి వసూళ్లు కావచ్చు… మలయాళం మరీ ఘోరం… మొదటి రోజు, అయిదో రోజు లక్ష రూపాయలే… తమిళం కాస్త నయం, తొలిరోజు 3 లక్షలతో మొదలుపెట్టి పదీపదిహేను లక్షలకు పెరిగింది… సో, నార్త్ ఇండియన్లు విరగబడి చూస్తున్నారు…
ఓవర్సీస్‌లో కూడా తెలుగు ప్రేక్షకులు ప్లస్ నార్త్ ఎన్ఆర్ఐలు చూస్తున్నారు… అంతేతప్ప కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులు చూడటం లేదు… ఎందుకు..? ఆమధ్య సలార్ సినిమాకు కూడా ఇదే ధోరణి వ్యక్తమైంది… ఎంత ప్రభాస్ అయితేనేం..? ఎంత హనుమంతుడు అయితేనేం..? మా హీరోలు, మా సినిమాలు అన్నట్టుగా ఇతర సౌత్ ప్రేక్షకుడు వ్యవహరిస్తున్నాడు… ఈ హనుమంతుడు కూడా వాళ్లకు జస్ట్, ఇగ్నోర్ చేయదగిన ఓ తెలుగు హనుమంతుడిలా మాత్రమే కనిపిస్తున్నాడు..!!
Share this Article