మొన్నటి పండుగపూట టీవీలు తీవ్రంగా నిరాశపరిచాయి… నిజానికి సంక్రాంతి అంటే స్పెషల్ ప్రోగ్రామ్స్, యాడ్స్, హంగామా… నిజానికి ఈరోజుల్లో టీవీ వినోదమే కదా ఇంటింటికీ దిక్కు… జేబులు కత్తిరించే, కుర్చీలు మడతపెట్టే చెత్తా సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే సాహసం లేదు… బయట ప్రోగ్రాముల నిర్వహణ కూడా తగ్గిపోయింది…
తెలుగు టీవీల్లో మాత్రం ప్రధానంగా అవే పాత సినిమాలు, సాగదీత సీరియళ్లు… పండుగ కోసం జీవాడు ఏవో రెండు స్పెషల్ వంటలు చేసినట్టున్నాడు, ఒకటేమో పండగంటే ఇలా వుండాల… దాన్ని జీవిత, రాజశేఖర్‌లకు అంకితం… వాళ్ల బయోపిక్ ప్రోగ్రామ్ అన్నట్టుగా సాగింది… కాసేపు సరదా అనిపించినా తరువాత బోర్ అయిపోయింది… చానెల్ ఆర్టిస్టులు, గ్రూపులు, కిట్టీ పార్టీల్లా పోటీలు… రాశి, సుమన్, ఆమని తదితరులతో వండిన మరో వంట బావా మరదళ్ల సరదా సంక్రాంతి కూడా పెద్దగా రక్తికట్టలేదు…
బిగ్‌బాస్ వంటి భారీ బిగ్‌బాస్‌లు మినహా మిగతా రియాలిటీ షోలను పెద్దగా సక్సెస్ చేయలేకపోతున్న స్టార్ మాటీవీ నాసామిరంగ అంటూ సంక్రాంతి స్పెషల్ వంట వండింది… నిజానికి అది పండుగ కోసం కాదు, నాసామిరంగ సినిమా ప్రమోషన్ కోసం… అందుకే హీరో నాగార్జునతోపాటు సహ-హీరోలు అల్లరి నరేష్, రాజ్‌తరుణ్‌తోపాటు హీరోయిన్ ఆషిక రంగనాథ్ కూడా వచ్చింది… అచ్చం ఓ సినిమా ఫంక్షన్‌లాగే సుమ హోస్ట్… నిజానికి అది బిగ్‌బాస్ ఎక్స్‌టెండెడ్ షో అనిపించింది…
Ads
మొన్నటి సీజన్‌లో చుక్క, ముక్క గ్రూపులుగా (స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ SPY n SPA) విడిపోయి తన్నుకున్నట్టే ఈ షోలో కూడా అంతే… మిగతా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కొందరు, పాత సీజన్ల కంటెస్టెంట్లు, కొందరు మాటీవీ ఆస్థాన సీరియల్ ఆర్టిస్టులు ప్లస్ హరి వంటి ఒకరిద్దరు కమెడియన్లు… సుమ హోస్టింగ్ అదిరిపోయింది… పాత సుమ కాదు, షో ఆరంభం నుంచీ అదే ఎనర్జీ, అదే జోష్… పైగా ఈసారి స్టెప్పులు, డాన్సులు… అందుకే ఆమె ఈరోజుకూ టీవీ హోస్టింగులో నంబర్ వన్… మిగతా యాంకర్లు, హోస్టులు ఆమెకు ఓ పది మైళ్ల దూరంలోనే ఉండిపోయారు…
కాకపోతే అందులో కూడా శివాజీకి యావర్, ప్రశాంత్‌ల కీర్తనలు, భజనలు చిరాకెత్తించాయి… సీరియల్ ఆర్టిస్టుల డాన్సులు మాత్రం బాగున్నాయి… పండుగపూటే ప్రసారం చేసిన ‘స్టార్ మా పరివారం’ పాత చింతకాయే, కొత్తగా ఏమీ లేదు… నిజానికి ఇలాంటి పండగలు, ముఖ్యసందర్భాల స్పెషల్ షోలకు ఈటీవీ పెట్టింది పేరు… వాళ్లకు జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎట్సెట్రా షోలకు చెందిన ఆస్థాన కమెడియన్లు, ఎవరో ఒకరిద్దరు గెస్టులు… లాగించేస్తారు…
ఈసారి అల్లుడా మజాకా అంటూ వెంకటేష్, మీనా, ఖుష్బూ తదితరులు… అదే ఆది, అదే ఆటో రాంప్రసాద్, అదే ఆస్థాన కమెడియన్లు, అదే ఢీ బ్యాచ్ డాన్సర్లు… ఏదో సంక్రాంతి డ్రామా కంపెనీ చూస్తున్నట్టు సాగింది… మూడు వినోద చానెళ్ల ప్రోగ్రామ్స్‌లోనూ ఏమాత్రం కొత్తదనం లేదు… పైగా మూడు టీవీల్లోనూ ప్రోగ్రాములకు ఈసారి బీజీఎం ఏమిటో తెలుసా..? పదే పదే ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్, ట్యూన్, మ్యూజిక్…
రీల్స్ అవే, షార్ట్స్ అవే, షార్ట్ వీడియోలు అవే… ప్చ్, ఆ పాటలో మహేశ్‌బాబు ఓ బూతును సూచించే బాడీసైన్ ఉంటుంది కదా… ఈ షార్ట్ వీడియోల్లో కూడా లేడీస్ ఎంచక్కా దాన్నే అనుకరించేస్తున్నారు… సరే, ఈటీవీ షోలో వెంకటేష్ స్కిట్‌లో పార్టిసిపేట్ చేయడం బాగుంది… సుధీర్ పర్‌ఫామెన్స్ ఎప్పటిలాగే అదిరింది..! చూడాలిక వీటికి ఏ రేటింగ్స్ వస్తాయో..!!
Share this Article