పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అబ్బాయి… జస్ట్, 34 ఏళ్ల వయస్సు… సినిమా అంటే పిచ్చి… పేరు ప్రశాంత్ వర్మ… షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్, యాడ్ ఫిలిమ్స్‌తో మొదలైన జర్నీ… 2018లో ఆ అనే ఓ సినిమాకు చాన్సొచ్చింది… కష్టమ్మీద మళ్లీ 2019లో కల్కి వచ్చింది… రెండింటి ప్రజెంటేషన్ ఎవరబ్బా ఈ దర్శకుడు అనిపించేలా ఉంది… దాంతో హనుమాన్ అనే ఇప్పటి సినిమా చేతిలో పడింది… దాంతో దశ తిరిగిపోయింది…
‘ఆదిపురుష్ సినిమాలాగా తెలుగు సినిమా ఎప్పుడూ దేవుళ్లను నీచంగా చూపించదు’ అనే తన తాజా వ్యాఖ్య ఆశ్చర్యం గొలపడమే కాదు, బాలీవుడ్ బడా ప్లేయర్లకు భయపడని ఆ సాహసం బాగుందనిపించింది… మొన్నటికిమొన్న గుంటూరుకారం పెద్ద తలకాయలకే మంట ఎక్కించేలా హనుమాన్ సినిమా విషయంలో స్థిరంగా నిర్మాత పక్కనే నిలబడిన తీరు కూడా ముచ్చటేసింది… హనుమాన్ పాత ఘన రికార్డులనే బద్దలు కొడుతోంది…
ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శిటీ పేరిట… మొత్తం 12 మంది సూపర్ పవర్ దేవుళ్ల పాత్రలతో వరుసగా సినిమాలు చేస్తానని ప్రకటించాడు… అవన్నీ తీస్తాడా లేదా అనేది తరువాత సంగతి, ఆ కల సాకారం కావాలంటే చాలా అంశాలు అనుకూలించాలి… సరైన నిర్మాణ సంస్థ కావాలి, వరుస విజయాలు కావాలి, ఈ టెంపో కంటిన్యూ కావాలి… అన్నీ అనుకూలించాలి… కానీ తను హనుమాన్ దయతో టాప్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు హఠాత్తుగా… గుడ్…
Ads
నిజమే, హాలీవుడ్‌లో బోలెడు సినిమాలు వచ్చాయి సూపర్ పవర్స్ ఉన్న కేరక్టర్లతో… ఇంగ్లిషు సాహిత్యంలో, పాశ్చాత్యుల సంస్కృతిలో సూపర్ పవర్ పాత్రలు ఎన్ని ఉన్నాయో తెలియదు గానీ… ఇండియా సాహిత్యంలో, ప్రత్యేకించి మన పురాణాల్లో, అంటే మన సాంస్కృతిక పరంపరలో ఎన్నో సూపర్ పవర్ కేరక్టర్లున్నయ్… బోలెడంత వైవిధ్యం… ఇవి పిల్లలకే థ్రిల్, వినోదం మాత్రమే కాదు, పెద్దలకు ఓ ఆధ్యాత్మిక పలకరింపు…
ఈ హనుమాన్‌లో విభీషణుడి కేరక్టర్ ఆల్‌రెడీ జొప్పించాడు… అఫ్‌కోర్స్, విభీషణుడు సూపర్ పవర్ దేవుడు కాదు… అయితే మరి తన యూనివర్శిటీ పేరిట తీయాలనుకుంటున్న మరో 11 మంది సూపర్ పవర్ కేరక్టర్లు ఏమిటి..? దేవుళ్లు వేరు, పురాణ పాత్రలు వేరు… ఉదాహరణకు భారతాన్ని తీసుకుంటే కృష్ణుడు దేవుడు… అంతే తప్ప ఒక భీముడు, ఒక అర్జునుడు ఎట్సెట్రా వీరులు బలమైన కేరక్టర్లు తప్ప దేవుళ్ల పాత్రలు కారు… రామాయణంలో రావణుడు రాముడికి దీటైన బలశాలి… కానీ దేవుడిగా చూపించడం కుదరదు… అంటే మన పురాణాలు, పాత గ్రంథాల నుంచి ఏయే సూపర్ పవర్ దేవుళ్లను ప్రశాంత్ వర్మ ఆల్‌రెడీ ఎంచుకుని ఉన్నాడనే ఆసక్తి కలుగుతోంది…
ఈ హనుమాన్‌కు సీక్వెల్ జైహనుమాన్ సినిమా అంటున్నారు… హనుమాన్ సినిమా చివరలో రాముడికి హామీ ఇచ్చిన హనుమంతుడు అనే ఓ పాయింట్ ఉంది… దాన్ని పొడిగించి, డెవలప్ చేస్తాడా..? అంటే రాముడి పాత్రను సూపర్ పవర్‌గా చూపిస్తాడా..? తెలియదు… రామాయణంలో రాముడు, హనుమంతుడు మాత్రమే దేవుళ్లు… దేవుడు అంటే ఆధ్యాత్మిక విద్యుత్తు, శక్తుల్లో విద్వత్తు ఉండాలి… ఆల్‌రెడీ దేవకినందన వాసుదేవ అనే మరో టైటిల్ కూడా వినిపిస్తోంది… అంటే శ్రీకృష్ణుడి పాత్ర… మిగతా వారెవరో ప్రశాంత్ వర్మ చెప్పేకొద్దీ వినాల్సిందే తప్ప మొత్తం డజను మంది సూపర్ పవర్ దేవుళ్లు ఎవరో స్పష్టంగా మనం ఊహించడం కష్టమే…!!
Share this Article