తండ్రి ఎన్టీయార్ సమాధి దగ్గర నివాళ్లు అర్పించడానికి వచ్చిన ఆయన కొడుకు బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు తీసేయాల్సిందిగా తన అనుచరగణాన్ని ఆదేశించాడు… అక్కడ మీడియాతో ఏదేదో మాట్లాడి తండ్రిని యాది చేసుకున్నాడు గానీ, తన మాటల్లో ఎప్పటిలాగే సగమే అర్థమయ్యాయి… కానీ జూనియర్ ఫ్లెక్సీలు తీసేయాలంటున్న వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది…
ఇక్కడ కొన్ని అంశాలు బాలయ్య అర్థం చేసుకోవాల్సినవి… 1) అక్కడ జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలు ఉంటే ఎవరికొచ్చిన నష్టమేమిటి..? ఒక మనమడిగా కాదు, ఓ అభిమానిగా ఫ్లెక్సీలు కడతాడు, తప్పేమిటి..? 2) ఎవరికి భయపడి, చాన్నాళ్లు దూరం ఉంచాడో తెలియదు గానీ, జూనియర్ ఎన్టీయార్ పాపులరయ్యాక ఇక తన కొడుకే అని ఆ హరికృష్ణే అంగీకరించాడు కదా.., ఈరోజుకూ కల్యాణరాం, జూనియర్ సొంత అన్నాదమ్ముళ్లలాగే తిరుగుతారు కదా… మరి జూనియర్ ఎన్టీయార్‌కు కూడా దివంగత ఎన్టీయార్ మీద మిగతా కుటుంబసభ్యుల్లాగే హక్కు ఉన్నట్టే కదా…
3) బాలకృష్ణ, ఇతర సోదరులు, అక్కాచెల్లెళ్ల పిల్లలకు ఎన్టీయార్ మీద ఎంత నెత్తుటి వారసత్వపు హక్కు ఉందో జూనియర్‌కూ కూడా అంతే ఉంది… వేర్వేరు క్షేత్రాలైనా సరే, అదే బీజ ప్రాధాన్యం కదా..! 4) గతంలో ఎడాపెడా వాడేసుకున్నారు చంద్రబాబు అండ్ తెలుగుదేశం ఇదే జూనియర్‌ను… తరువాత చంద్రబాబు తన సహజధోరణిలో తీసిపడేశాడు, ఎక్కడ తన లోకేష్‌కు థ్రెట్ అవుతాడో అనే భయసందేహాలతో… మరి అప్పట్నుంచి జూనియర్ పార్టీని వదిలేశాడు కదా… తన తండ్రి బిడ్డే అయినా సరే, ఆ నందమూరి సుహాసినికి టికెట్టు ఇచ్చినా తను ప్రచారం చేయలేదు కదా… మరి తన ఫ్లెక్సీలతో పార్టీకి వచ్చిన నష్టమేమిటి..?
Ads
ఐనా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన పవన్ కల్యాణ్ కావాలి గానీ సొంత కుటుంబసభ్యుడు మాత్రం పనికిరాడు కదా…! అదేనా..? లేక మొన్నటికిమొన్న చంద్రబాబు అరెస్టు సందర్భంగా జూనియర్ ఏమీ స్పందించలేదనే మంట రగిలిపోతున్నదా..?
ఐనా పార్టీ విధానాలకు, నిర్ణయాలకు బాలయ్య బాధ్యుడేమీ కాదు కదా… సవాలక్ష మంది కార్యకర్తల్లో ఓ కార్యకర్త… కాకపోతే చంద్రబాబుకు బావమరిది కమ్ వియ్యంకుడు… లోకేష్‌కు మామ… అదే కదా తన హోదా… మరి ఏ హోదాలో జూనియర్ ఫ్లెక్సీల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు..? ఇవన్నీ ఎలా ఉన్నా సరే… అసలు ఎన్టీయార్ ఘాట్ నియంత్రణ, నిర్వహణ అధికారం ఎవరిది..? బాధ్యత ఎవరిది..? తెలుగుదేశం పార్టీదా..? బాలయ్యదా..? అక్కడ ఎవరి ఫ్లెక్సీలు ఉండాలో, ఎవరు మాత్రమే అక్కడికి రావాలో చెప్పడానికి బాలయ్య ఎవరు..?
ఎన్టీయార్ వీరాభిమాని, బాలయ్య అభిమాని మొన్నమొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడూ బాలయ్యకు ప్రభుత్వం మీద చనువు… ఇప్పుడు తనకు, తన బావకూ ఆప్తుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు మరింత చనువు… ఆ అలుసుతోనేనా ఒక సగటు హెచ్‌ఎండీఏ సిబ్బందిలాగా ఠాట్, ఆ ఫ్లెక్సీలు తీసేయండి అని ఆదేశించింది… తీయడానికి నీ అనుచరులకున్న అధికారమేమిటి బాలయ్యా… అస్సలు అర్థం కావు..! నీ సినిమాల్లాగే..!! చివరగా… చివరకు నీ తండ్రి సమాధి వద్ద నివాళ్లు అర్పించడానికి కూడా సైకిల్ గుర్తు, చంద్రబాబు బొమ్మ ఉన్న కండువాలు వేసుకుని వెళ్లాలా..? నీకు పెద్దగా తెలియదు, ఎవడూ నీకు చెప్పలేడు, చెప్పినా నువ్వు వినవు… భలేవాడివి బాలయ్యా..!!
Share this Article