Sampathkumar Reddy Matta…. సంకురాత్రి.. పీడపండుగ
~~~~~~~~~~~~~~~~~
చిన్ననాడు, అంటే నా డిగ్రీ పూర్తయేదాకా
పుస్తకాలు,రేడియోలు, టీవీలు, సినిమాలు…
సంక్రాంతికి పంటలు ఇంటికి వస్తయని చెప్పేవి.
కానీ మా ఊర్లల్ల దీలెకే పంటలు ఇంటికొస్తయాయె.
రెండుపంటల మధ్యకాలంలో సంక్రాంతి వస్తదిగదా
మరి ఇదేంది?? ఇవన్నీ ఇట్లచెప్తయని అనిపించేది.
గంగెద్దులవాళ్ళూ, మిత్తిలివార్లూ, బొబ్బిలివాళ్ళూ..
వానకాలపు పంటకల్లాల కాడికి తప్పకుంట వచ్చేవారు.
సంక్రాంతి నెలపెట్టిన తర్వాత వారు ఇండ్లల్లకు వచ్చినా
అది ధనుర్మాస సంస్కృతిలో భాగంగానే కనిపించేది.
అంతేకానీ, అది పంటలు ఇల్లుజేరిన సందర్భం కాదు.
సంక్రాంతి నెలవెట్టిన తర్వాత ఇక శుభకార్యాలు లేవు,
ఇంటిముందు తప్పక గోటుముగ్గులు మాత్రమే వేద్దురు
పిల్లలు వేలితో ముగ్గులు వేస్తే పెద్దవారు కోప్పడేవారు.
పీడ దినాలని ఏ కొత్తపనీ అసలు మొదలువెట్టకపోదురు
ఎంతోమంది ముసలోల్లు సంక్రాంతి ముందే రాలిపోదురు.
మిగతా రోజులకంటే ప్రమాదాలసంఖ్య ఈ నెలల ఎక్కువ.
ఎమకోరల పున్నం దాటితే ఏడాది గడిచినట్టేనని సామెత.
ఎమకోరల పున్నానికి తల్లవ్వ కోటిపుర్రెల నోమునోముద్దట.
మార్గశిరాన వచ్చేదే యమకోరలపున్నం.చలికి చావులెక్కువ.
ఈరోజున యమధర్మరాజు ప్రీతికోసం కుక్కలపండుగ చేస్తరు.
అందుకనే మాటమాటకూ సంక్రాంతి పీడ అని వినబడుతది.
ఇది అనుభవంలోనూ.. సత్యదూరం అని అసలు అనిపించదు.
ఇక్కడ భోగిమంటల సంస్కృతిని నేనైతే చూడనేలేదు.
భోగినాడు పులుగం వండుకునుడు పాత సంప్రదాయమే
చిక్కుడుగాయకూర, పచ్చిపులుసుల శాఖాహారభోజనం.
పండుగరోజు కూడా తెల్లతెల్లటి సాదా సుద్దముగ్గులే వేసేది,
గిరుకముగ్గులు ఎక్కువ, రథంముగ్గులది పైనుండి పక్షిచూపు.
పక్కనుండి దర్శనమిచ్చే రథంముగ్గులు అంతగ కనబడవు.
ముగ్గులకు రంగులూ హంగులూ , పూల జోడింపులూ లేవు.
ఇక్కడ గొబ్బెమ్మ కాదు, గౌరమ్మ అనేమాట సుప్రసిద్ధం !
పెండ గౌరమ్మకు,, వట్టి ఆయీ పూల అలంకరణ కంటే,
పసుపుకుంకుమ, గరుక & పిండికూరలు ప్రాథమిక విధి !
కడుపలమీద కూడా తప్పక గౌరమ్మలు నిలుపుకుంటరు.
గౌరమ్మలకుతోడు నవధాన్యాలు & తీరొక్క కాయగూరలు
ముగ్గుమధ్యల సంక్రాంతి బొమ్మను/పౌష్యలక్ష్మిని ప్రతిష్టించి
దీపహారతులతో ఆహ్వానం పలుకుట కూడా ఒక ఆచారం !
సంక్రాంతి రోజు నడివాకిట్లగానీ, నడింట్లగానీ దాలి తవ్వి,
ఏరుపిడుకలువేసి పాలుపొంగించి పరమాన్నం వండేవారు
మరికొందరు ఇంటి పద్ధతి ప్రకారం మట్టిపొయ్యి వేసేవారు.
తినగా మిగిలింది అందులో వేసి దాలిపూడ్చి అలికేవారు.
సాయంత్రం కలిగినకాపుల ఇండ్లల్లకు తమ్మలివారు వచ్చి
గౌరమ్మలు ఎత్తి చెట్లగుడ్డల్లో వేసి, కానుకలు తీస్కునేవారు.
కనుమనాడు దొడ్డి & తోరణం , పశువుల అలంకరణ..
ఊర బర్ల/గొడ్ల మందలకు కాటిరేవుల పండుగజేసేవారు.
తాము తినకముందే ఇంటి పశువులకు తినిపించేవారు
కనుమనాడు మినుముకొరుకాలనే మాట ఈడలేదు.
పశువులను తోరణం దాటించే పద్దతి ఆడాడ ఉండేది.
శ్రమదోస్తులైన పశువులతో.. వినోదాలు,వ్యాపారక్రీడలు
ఇక్కడ కనబడవు, గతంలో ఉన్నట్టు రికార్డూ కనబడదు.
తమతోటి శ్రమజీవులైన కూలీలకు ధావతు ఒక బాధ్యత.
పండుగకు కొందరు సంక్రాంతినోములు నోముకునుడూ
చాలామంది, పితృదేవతలకు మొక్కుకునుడూ ఉన్నది.
కట్టెకొట్టెతెచ్చె అని దొడ్డుగ చెప్పినట్టుగ, ఇవీ..
నాకంటే ముందుతరం నుండి కనబడుతూవున్న
మా కరీంనగరు ప్రాంతపు సంక్రాంతి పండుగవిశేషాలు.
ముఖ్యంగ ఇవి ఇక్కడి కాపుదనపు కుటుంబాల ముచ్చట్టు.
ఇంక చాలా విషయాలే మిగిలిపోయాయేమో…
ఆయా ప్రాంతాలలో వైవిధ్యాలూ తప్పక ఉండిఉంటయి,
అవి మీరంతా పంచుకుంటే… పండుగజేసుకోవచ్చు గద !
~~~~~~~~~~~~~~
పండుగ అంటే పరమార్థాలు ఎన్నెన్నో చెపుతాము, కానీ…
వండుకతినే వంటలతోనే పండుగసంబురం వెల్లడయితది.
మనసుకు మాటలతోనే తృప్తి – మనిషికి వంటలతోనే తుష్టి.
సంక్రాంతి అంటే చాలు..మావైపున,ఇదిగో ఈ మూడే ప్రధానం.
ఈ నెళ్లాళ్లు ఏ తలుపుతట్టినా, ఏ అరుగుతొక్కినా పళ్లెం సిద్ధం.
లక్షపతికైనాభిక్షపతికైనా సకినాలు,అరిసెలు,గారెలతోనే పండుగ.
డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article
Ads