‘Success is always a Success, Criticism is just a Criticism’ అనేది ఈ మధ్య కాలంలో నేను అర్థం చేసుకుంటున్న ఫార్ములా. ఎవరైనా సక్సెస్ కోసమే పని చేస్తారు. సక్సెస్ రావాలనే ఆశిస్తారు. అది వస్తే ఆనందిస్తారు. విమర్శ అనేది పక్కన అలా అలా తిరుగుతూ ఉన్నా, దృష్టి మొత్తం విజయం మీదే ఉంటుంది, ముఖ్యంగా సినిమా రంగంలో. సినిమా ఫ్లాప్ అయితే తప్ప ఎవరూ విమర్శల్ని పెద్ద పట్టించుకోరు! సినిమా హిట్ అయితే ఆ విమర్శల గురించి ఆలోచించే అవకాశమే ఉండదు.
మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు, ఇటీవల హిట్టయిన ఓ సినిమా దర్శకుడిని భరద్వాజ్ రంగన్ ఇంటర్య్వూ చేశారట. అందులో సినిమా మీద వచ్చిన విమర్శల గురించి ఆ డైరెక్టర్ మాట్లాడుతూ “పనీపాటా లేని సంకుచిత భావాలున్న వాళ్లు చెప్పే మాటలు నేను పట్టించుకోను” అనే అర్థం వచ్చేలా ఏదో అన్నారట! సినిమా హిట్ అయింది, రూ.900 కోట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా అందంగానే ఉంటుంది. విమర్శకుల్ని పని లేని వారు అన్నా కూడా సొంపుగా అనిపిస్తుంది. ‘ఆదిపురుష్’ గనుక హిట్ అయి ఉంటే, రావణుడు గబ్బిలాల మీద వచ్చే షాట్ గురించి ఆహా ఓహో అనేవారు. ఆ సినిమా పరాజయం పాలై ఆ అవకాశం లేకుండా చేసింది.
Ads
సరే.. టాపిక్ ఎటో వెళ్లిపోయింది. #90s వెబ్ సిరీస్ చూశాను. ఉన్నమాట చెప్పాలంటే, యాప్‌లో చూడాల్సిన అవసరం లేకుండా మొత్తం సినిమా సన్నివేశాలన్నీ బిట్లుగా చేసి బోలెడన్ని రీల్స్ చేశారు. అందులోనే కథ మొత్తం తెలిసిపోయింది. శివాజీ & వాసుకి అమ్మానాన్న. ముగ్గురు పిల్లలు. ఆ కాలంలోని అనుభవాలు, అల్లరి, సర్దుబాట్లు, తడబాట్లు.. అన్నీ భలే ఉన్నాయి. మళ్లీ మళ్లీ చూసి ఆనందించదగ్గ సన్నివేశాలు. అందరూ బాగా చేశారు. చేసేందుకు కథలో బోలెడంత స్కోప్ ఉంది. కాబట్టే అందరి నటనా బాగా తెలిసింది. ముఖ్యంగా చిన్నోడి (రోహన్ రాయ్) నటన!
అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్కువే! కానీ మరీ చిరిగిపోయిన బనియన్ వేసుకుని కనిపించేంత తక్కువా? ఏమో మరి! నేచురాలిటీ కోసం అలా చేశారు కావొచ్చు. మన ఇళ్లల్లో చాలామంది అలా కనిపిస్తారు. కాబట్టి నో వర్రీస్! పిల్లలకు మేనమామ డబ్బులిస్తే, ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి వాళ్ల నుంచి లాక్కుని, పది రూపాయలు ఇవ్వడం.. ఈ సీన్‌కి బోలెడంత మంది కనెక్ట్ అయ్యారు. కానీ నాకు మాత్రం తేడా కొట్టింది. ఆ పిల్లలేమీ చిన్నోళ్లు కాదు. పదో తరగతి చదువుతున్నారు. వాళ్ల నుంచి వంద తీసేసుకొని, పది రూపాయలు ఇవ్వడం! జాగ్రత్తా? పిసినారితనమా?
కొడుకు క్లాస్‌మేట్ ఒకమ్మాయి ఇంటికి వచ్చి ‘మీ అబ్బాయి ఎక్కడ అంకుల్’ అని అడిగితే, “దొడ్డికి పోయిండు” అని చెప్పడం బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ టీచర్ అయిన వ్యక్తికి ‘బాత్రూం’ అని చెప్పడం రాదా? మరో మాట అనలేడా? పైగా “మా నాన్న నాకలా నేర్పలేదు” అనే ఎండ్ డైలాగ్. ఆయన గవర్నమెంట్ టీచర్, పైగా లెక్కల మాస్టారు అనే మాట మరచిపోయి రాసేసిన సీన్ ఇది. All is well. ఆ సన్నివేశానికి నేను కనెక్ట్ కాకపోయినా, జనం అయ్యారు. చెప్పానుగా! ‘Success is always a Success, Criticism is just a Criticism’.
PS: కూతురు పెద్దమనిషి అయిందని అని తెలిశాక, చేతిలో డబ్బు లేదని తండ్రి బాధ పడుతుంటే, భార్య అతణ్ని ఓదార్చి ధైర్యం చెప్పడం.. వాహ్! ఏం సీన్ అది! ఎంత బాగా చేశారు ఇద్దరూ! – విశీ
Share this Article