అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, పునర్నిర్మిత గుడిలోకి భక్తులకు ప్రవేశం… ఈరోజు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇదే… వేల గుళ్లు కడుతుంటారు, మరి అయోధ్య గుడికే ఏమిటీ ప్రాధాన్యం..? గతంలో వేల ఇళ్లను దేశం మీదకు దాడిచేసిన పరధర్మం కూల్చేసింది… మరి అయోధ్య పునర్నిర్మాణానికే ఏమిటీ ప్రాధాన్యం..? ఆ పోరాటం ఏమిటో, హిందూ ఆత్మాభిమాన సంకేతంగా అయోధ్య ఎలా మారిందో చరిత్ర తెలిసినవాళ్లకు మాత్రమే ఈ గుడి విశిష్టత అర్థమవుతుంది…
మరి ఈ సందర్భాన్ని తెలుగు మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసింది… హెడింగుల్లోనే అంతా అర్థమవుతుంది కదా… ఓసారి చూద్దాం… ఇంగ్లిషు పత్రికల జోలికి పోలేదు ఇక్కడ… కేవలం తెలుగు పత్రికల్లో కనిపించిన హెడింగులు ఇవి… మీడియా కూడా దీన్ని పొలిటికల్ లైన్స్‌లోనే చూస్తోంది… యాంటీ బీజేపీ మీడియా బీజేపీ మీద కోపంతో హిందూయిజానికి, హిందువుల మనోభావాలకు వ్యతిరేక లైన్ తీసుకుంది…
కాకపోతే మెజారిటీ మీడియా అయోధ్య మీద ఫుల్ కవరేజీ ఇచ్చింది… ప్రత్యేక పేజీలు పబ్లిష్ చేశాయి… టీవీలు కూడా వాటి పొలిటికల్ లైన్‌ను బట్టి బాగానే హంగామా చేస్తున్నాయి… వాతావరణాన్ని బట్టి వాటికీ తప్పదు కదా… రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ ఎట్సెట్రా చానెళ్ల సంగతి చెప్పనక్కర్లేదు… ఈనాడు, ఆంధ్రజ్యోతి సండే స్పెషల్స్ వేశాయి, సాక్షికి ఆ సోయి లేదు, టేస్ట్ లేదు… హఠాత్తుగా అరెరె, మరిచిపోయామే అనుకుని, నిన్న ఫ్యామిలీ పేజీల్లో అప్పటికప్పుడు ఏవో అయిదారు స్టోరీలు అలికారు…
Ads
నేడే బాల రాముడి ప్రాణప్రతిష్ట… ఇది ముద్ర అనే వెబ్ పత్రికలో హెడింగ్… స్ట్రెయిట్, ఆప్ట్… ప్రాణప్రతిష్ఠకు వేళాయె… ఇది దిశ అనే వెబ్ పత్రిక హెడింగ్… ఇదీ సూటిగా, సరళంగా ఉంది… జైశ్రీరామ్, నేడు భవ్యమందిరంలోకి బాలరాముడు… మన తెలంగాణ అనే ఓ పత్రికలో హెడింగ్… ఇది సరైన శీర్షిక… నేషన్ మూడ్‌కు తగ్గట్టు సింపుల్‌గా జైశ్రీరామ్ అని పెట్టడం బాగుంది… భవ్యమందిరంలోకి బాలరాముడు అనేదే కరెక్ట్, ఆప్ట్ వ్యక్తీకరణ…
కాంగ్రెస్ పత్రిక అయినా సరే… వెలుగు డెయిలీ కోదండరామయ్య కొలువుదీరే ఘడియ అనే హెడింగ్ పెట్టింది… సందర్భానికి తగిన హెడింగ్ కాదు, కానీ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అని పక్కనే ఉన్న సబ్‌హెడింగ్ కరెక్టు… ఈ పత్రికలో యూపీ ప్రభుత్వ అయోధ్య యాడ్ ఇంట్రస్టింగ్ అనిపించింది… వార్తలో అదిగో అయోధ్య, బాలరాముడదిగో శీర్షిక, పర్లేదు, గుడ్… ఇందులో కూడా యూపీ ప్రభుత్వ యాడ్ ఉంది… ప్రజాపక్షం అని ఓ సీపీఐ పత్రిక… అయోధ్యపై నిఘానేత్రం అని ఓ చిన్న వార్త రాసి, కమ్యూనిస్టులు హిందూ వ్యతిరేకులే అనే తమ ఖ్యాతిని మళ్లీ చాటుకుంది…
నవతెలంగాణ అనే సీపీఎం పత్రికకు ఎప్పుడూ హిందూయిజం మీద విషమే కదా… వాళ్లు ఫస్ట్ పేజీలో పెట్టిన వార్త ఏమిటో తెలుసా..? రాజస్థాన్‌లోని ఓ ఊళ్లో కొందరు దళితులు తమ విరాళాలను అక్కడి పెత్తందార్లు తీసుకోలేదని ఆరోపించారట… పైగా అప్పట్లో సోమనాథ్ గుడిని నెహ్రూ లైట్ తీసుకున్నాడు అంటూ ఇప్పటి మోడీని తిట్టిపోసే మరో స్టోరీ… 251 మీటర్ల భారీ రామవిగ్రహం అన్నావు ఏమైందోయ్ అని యోగి మీద దాడి…
సాక్షిలో అయోధ్యలో నేడు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ అనే తూతూమంత్రం హెడింగ్ పెట్టారు… కాకపోతే యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రత్యేక వ్యాసాల్ని ఎడిట్ పేజీలో తెలుగులోకి అనువదించి పబ్లిష్ చేశారు… సందర్భానుగుణం… ఆంధ్రజ్యోతి శ్రీరామజయం అని మెయిన్ హెడింగ్ పెట్టేసి, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అని డెక్ పెట్టింది… కరెక్టు…
తెలుగుజాతికి, తెలుగు పాత్రికేయజాతికి నిత్యమూ నీతులు చెప్పే ఈనాడు జగమంతా రామోత్సవం అనే మెయిన్ హెడింగ్ వరకూ పర్లేదు, అపురూప మందిరం నేడు ఆవిష్కృతం అనే ఫస్ట్ డెక్ కూడా కరెక్టే… కానీ దాని దిగువనే అయోధ్యలో కొలువు దీరనున్న రామయ్య అని డెక్ పెట్టింది… ఇది రాముడి పట్టాభిషేకం కాదురా నాయనా… ఫస్ట్ లీడ్ స్టోరీకైనా తప్పుల్లేని వ్యక్తీకరణ చేతకాదా..? ఎడిట్ పేజీ మెయిన్ వ్యాసం బాగుంది…
అయోధ్య రాముడి అవతరణ నేడే… ఇదేమో రోజురోజుకూ ప్రమాణాలు దిగజారిపోయిన నమస్తే తెలంగాణలో హెడింగ్… సంబంధిత ముఖ్యులు ఏమాత్రం పాత్రికేయ జ్ఞానాన్ని ఉపయోగించలేదని తెలుస్తూనే ఉంది… ఈరోజు అవతరించడం ఏమిటి..? ఆల్‌రెడీ అక్కడ బాలరాముడు (రామ్ లల్లా) పూజలు అందుకుంటూనే ఉన్నాడు… ఆలయ పునర్నిర్మాణం, కొత్త విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అక్కడ జరిగేది… అసలు ఆ హెడింగులో ఆ సెన్స్ ధ్వనించడం లేదు సరికదా, ఈరోజే అయోధ్య రాముడు అవతరిస్తున్నట్టు ఓ తప్పుడు శీర్షిక… అదే గ్రూపుకి చెందిన ఇంగ్లిషు పత్రిక తెలంగాణ టుడేలో శీర్షిక బాగానే ఉంది…
Share this Article