అయోధ్యలో రామమందిరం మీదే ప్రధాన చర్చంతా..! మరి ఆ నగరం..? తనపై అన్యాయంగా అభాండాలు, నిందలు వేసి, రాముడు తనను విడిచిపెట్టడానికి కారణమైన అయోధ్య నగర ప్రజలపైనా, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని చెబుతుంటారు…
అదే ఉత్తరప్రదేశంలోని కాశీ, మథుర వంటి హిందూ పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు నిజంగానే వేలాది సంవత్సరాలుగా లేవు… ఈ ప్రాచీన నగరిలో అడుగుపెడితే కనిపించేది నీరస వాతావరణమే… దీనికి సీతమ్మ శాపమే కారణమట… కానీ, ఇప్పుడు అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణంతో సీతాదేవి తన శాపాన్ని వాపసు తీసుకున్నారని అనుకోవచ్చునని అయోధ్య హిందూ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
సరే, జనంలో ఉండే నమ్మకాలు, ప్రచారాల మాటెలా ఉన్నా… అయోధ్యకు ఈ గుడి ప్రారంభంతో దశ తిరిగిందనే అనుకోవచ్చు… అదిప్పుడు పాడుపడ్డట్టు కనిపించే ఓ ప్రాచీన నగరం కాదు… ఈ రామమందిరం కోసమే అయోధ్య రూపురేఖలే మార్చేశాడు యోగి… సరయూ నదీతీరం, వీథులు, రవాణా సౌకర్యాలు, సుందరీకరణ… ఒకటేమిటి… అదొక హాపెనింగ్ సిటీ ఇప్పుడు…
Ads
సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఏర్పడిన తాత్కాలిక రామాశ్రయం దర్శంచడానికి పండుగలు, సెలవు రోజుల్లో భక్తజనం రావడం ప్రారంభమైంది… ప్రత్యేకించి మంగళవారాల్లో భక్తుల రాకడ ఎక్కువ… క్రమేపీ అది పెరుగుతూ వస్తోంది… ఇప్పుడిక రాముడి గుడి నిర్మాణం అయిపోవడంతో భక్తుల తాకిడి ఇంకా పెరగనుంది… ప్రతి హిందువుకూ కాశీ క్షేత్రం సందర్శన జీవితలక్ష్యంగా ఉండేది… దానికితోడు ఇప్పుడు అయోధ్య గుడి కూడా చేరినట్టే… ఆ బజ్ క్రియేట్ చేయడంలో కాషాయశిబిరం సక్సెసైంది…
అయోధ్య హిందూ జాతికి మోస్ట్ వాంటెడ్ రెలీజియస్ డెస్టినేషన్ అవుతుందనే భావన వ్యక్తమవుతోంది… కొన్నేళ్ల క్రితం వరకు అయోధ్యలో సరైన వసతి దొరికేది కాదు… ఓ మోస్తరు హోటళ్లూ ఉండేవి కావు… ‘‘ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మించడానికి ఇప్పుడు 100 అప్లికేషన్లు వచ్చాయి, జిల్లా కలెక్టరే నాతో చెప్పాడు ఈ విషయం’’ అంటున్నాడు బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా… ఈయన అయోధ్య రాజపరివార వారసుడని చెబుతుంటారు… రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కూడా… అయోధ్య ఉద్యమంలో మొదటి నుంచీ యాక్టివ్… ‘కింగ్ ఆఫ్ అయోధ్య’ అంటుంటారు ఆయన్ని… గుడి నిర్మాణ ప్రధాన పర్యవేక్షకుల్లో ఒకరు…
యోగీ ఆలోచన ఏమిటంటే… గుడి సందర్శన కోసమే కాదు, అయోధ్య సిటీని కూడా చూడటానికి జనం రావాలి… టెంపుల్ టూరిజానికి ఇది దేశంలోనే ప్రధాన క్షేత్రం కావాలి… అయిదారేళ్లలో అయోధ్య ఓ స్మార్ట్ సిటీ అయిపోవాలి… కొత్తగా ఎయిర్ పోర్టు, మొత్తం రైల్వే స్టేషన్ స్వరూపమే మారిపోయింది… ‘‘సీతమ్మ శాపం గడువు తీరినట్టేనని అయోధ్యవాసులు నమ్ముతున్నారు ఇప్పుడు…’’ అంటున్నాడు మిశ్రా… ‘1990లో కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు… నేను చాలామంది కరసేవకులకు షెల్టర్ ఇచ్చాను, నాటి ఉద్రిక్త వాతావరణం ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది నాకు…
‘‘అసలు నా జీవితకాలంలో ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందనే ఆశ లేకపోయేది… కానీ నా కళ్లతో చూస్తున్నా, కళ్లెదుట పనులు సాగుతుంటే స్వయంగా పర్యవేక్షించాను… అంతా ఓ కలలా ఉంది’’ అని ఎన్డీటీవీతో చెప్పాడాయన రీసెంటుగా… 1949 డిసెంబరు 22 రాత్రి… గార్డులు డ్యూటీలు మారే వ్యవధిలో అభిరామదాస్ అనే రామభక్తుడు ఆ కట్టడంలో రామ్ లల్లా విగ్రహాల్ని పెట్టాడని చదువుకున్నాం కదా… దశాబ్దాల పోరాటానికి ఓ ఎత్తుగడగా ప్రారంభమైన చర్య అది…
అప్పటి నుంచి అనేక దశల్లో ఉద్యమం… వెంటనే ఆ విగ్రహాల్ని తీసేయాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉరిమినా… అప్పటి ముఖ్యమంత్రి జీబీ పంత్ ఆదేశించినా… అక్కడి కలెక్టర్, ఉన్నతాధికారులు నిష్కర్షగా తిరస్కరించడంతో అసలు కథ మొదలైంది… అక్కడి నుంచి సుప్రీంకోర్టు తీర్పు దాకా అనేక దశల చరిత్ర… ఆ తీర్పు తరువాత గుడి నిర్మాణం అనేది కాషాయశిబిరం సాధనసంపత్తికి చిన్న విషయం… ఇక నేటి ప్రాణప్రతిష్ఠతో రామజన్మస్థలికీ, అయోధ్య నగరానికీ ఆ సీతమ్మ శాపవిముక్తి జరిగిపోయినట్టే లెక్క… ప్రధాన కర్త మోడీ నిమిత్తమాత్రుడు… జరిగిందంతా రాముడే ఆడించుకున్న ఓ జగన్నాటకం… అంతే…
Share this Article