Abdul Rajahussain …. నేను చూసిన ఓ మంచిసినిమా…! ఓ ఫీల్ గుడ్ మూవీ.. రోడ్ టు సంగమ్.. (Road to Sangam..Hindi Movie)
అన్ని సినిమాలు ఒకలా వుండవు.. ఈ సినిమా “రోడ్ టు సంగమ్” ఓ గొప్ప సినిమా. ఇందులో హీరో హీరోయిన్లు లేరు. ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు లేవు. ఉన్నదల్లా మానవత్వం.. అదీ గాంధీ మార్గంలో.!
అలహాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ ముస్లిం సమాజం చుట్టూ తిరుగుతుంది. కథ కూడా చాలా సింపుల్, కానీ గొప్ప కథ.. పరేష్ రావెల్ మెట్రిక్ తప్పిన ఇంజనీర్.. అదేనండీ మోటర్ మెకానిక్.. ఓరోజు 70 యేళ్ళ పాత ట్రక్ ఇంజన్ ను బాగుచేయమని ప్రభుత్వ శాఖ నుంచి వర్తమానం వస్తుంది.. అయితే త్వరగా కావాలంటుంది.. అలాగే అంటాడు పరేష్…
Ads
ఇలా వుండగా ఓ బ్యాంక్ లాకర్ లో ఓ చిన్న పెట్టె దొరుకుతుంది. తీరాచూస్తే గాంధీ మహాత్ముడి అస్థికకలవి.. గాంధీ మరణానంతరం ఆయన అస్థికలను దేశంలోని నలుములల వున్న నదుల్లో కలపమని కొందరికి పురమాయిస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బ్యాంక్ లాకర్లో పెడతాడు.. ఎందువల్లనో అస్థికలు అలా లాకర్లోనే వుండిపోతాయి…
ప్రభుత్వం ఈ అస్థికలను నదిలో కలపటానికి తేదీ ఖరారు చేస్తుంది. గతంలో గాంధీజీ అస్థికలను తెచ్చిన ట్రక్ నే దీనికోసం వినియోగించాలనుకుంటుంది. అయితే ట్రక్ ఇంజన్ చెడిపోయివుండటంతో.. బాగు చేయించటానికి ఆ ఊర్లో పేరు మోసిన మెకానిక్ పరేష్ రావల్ వద్దకు పంపుతుంది…
దేశ విభజన నేపథ్యంలో అల్లర్లు జరుగుతుంటాయి. పాకిస్తానీ టెర్రరిస్టులు బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. వీరికి కొందరు ముస్లిం యువకులు సాయం చేస్తున్నారన్న అనుమానంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతారు పోలీసులు.. అయితే వారు నిరపరాధులని, అరెస్టులు అన్యాయమంటూ ముస్లిం పెద్దలు నిరసన తెలుపుతారు. ఇందులో భాగంగా షాపులు, వ్యాపారాలన్నీ బంద్ చేయాలని ఫత్వా జారీ చేస్తారు..
గాంధీజీ అస్థికలు కలిపే తేదీ దగ్గర పడుతుంటుంది. పైగా ఈ కార్యక్రమానికి గాంధీజీ మనవడు… తుషార్ గాంధీ వస్తున్నారని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక్కడేమో షాపులు మూసేస్తారు. ట్రక్ ఇంజన్ బాగుచేసే పని ఆగిపోతుంది. పరేష్ బాధపడతాడు. తొందరగా బాగుచేసి ఇస్తానన్న మాట తప్పినవాడ్నవుతానని మధన పడతాడు. ముస్లింపెద్దలవద్దకెళ్ళి, విషయం చెబుతాడు, షాపు తెరిచి ఇంజన్ బాగుచేసేందుకు అనుమతి ఇవ్వమంటాడు.పెద్దలు ససేమిరా అంటారు…
అయితే మీ ఆజ్ఞ ధిక్కరించి షాపు తెరుస్తానని వెళ్ళిపోతాడు. పరేష్ ను అడ్డుకుంటారు. కొందరు దాడి చేస్తారు. అయినా కిమ్మనకుండా. షాపు తెరిచి ఇంజన్ బాగుచేస్తాడు.. తనని ఎంతమంది వద్దని వారించినా. (చివరకు కుటుంబసభ్యులతో సహా) వినకుండా కాగలకార్యం చేస్తాడు..
ఆరోజు రానేవస్తుంది. ప్రభుత్వం తమను వేధిస్తోందని ముస్లింలంతా కోపంగా వుంటారు. గాంధీజీ అస్థికల నిమజ్జనం ఊరేగింపులో పాల్గొందాం అంటూ పరేష్ తమ మత పెద్దల్ని ఒప్పిస్తాడు. అలాగే ముస్లింలు ఊరేగింపులో పాల్గొని, గాంధీజీకి ఘనంగా నివాళులర్పిస్తారు. గాంధీజీ మనవడు ‘ తుషార్ గాంధీ ‘ స్వయంగా తన తాత అస్థికలను నదిలో కలుపుతాడు. సినిమా శుభం కార్డు పడుతుంది…
ఈ సినిమా ఆద్యంతం డ్రామా గొప్పగా వుంటుంది. ముఖ్యంగా పరేష్ తన పాత్రలో జీవించాడు. గాంధీ భక్తుడిగా, గాంధేయవాదిగా పరేష్ ఈ పాత్రలో నటించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. హిందూ, ముస్లిం సమాజాల మధ్య వున్న అపోహలు, వాటిని ఎలా తగ్గించుకోవాలో, ఎలా మెలగాలో పరేష్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు చిత్ర దర్శకుడు.. సినిమా చూస్తే గానీ. ఇందులో స్వారస్యం అర్ధం కాదు… ఓ గాంధేయవాదిగా ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది… మీరూ చూడండి. మీకూ నచ్చేస్తుంది… (2010 నాటి సినిమా… యూట్యూబ్)
Share this Article