అనస్వర రాజన్… మలయాళీ… వయస్సు 21 ఏళ్లు… 2017లో మొదలుపెడితే… అంటే ఆరేళ్లలో 16 సినిమాల్ని ఉఫ్‌మని ఊదిపారేసింది… ప్రస్తుతం మాలీవుడ్‌లో ఓ జోష్… బక్కపలచగా, ఏదో ఇంటర్ చదువుతున్నట్టుగా కనిపించే ఈ అమ్మాయి మన శ్రీలీల టైపు మొత్తం పిచ్చి స్టెప్పుల పాత్రల్ని కాదు, జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుంటోంది… గాలి వీస్తోంది కాబట్టి ఎడాపెడా చేసేస్తోంది అనేది కరెక్టు కాదు… మెరిట్ ఉంది…
కొత్తగా విడుదలైన నెరు సినిమాలో మోహన్‌లాల్‌కు దీటుగా నటించిందీ, ఎమోషన్స్ పలికించిందీ అంటేనే అర్థం చేసుకోవాలి… నిజానికి మలయాళీ నటులు ప్రధానంగా మెరిట్‌నే నమ్ముకుంటారు, ఫుల్ ఎఫర్ట్ పెడతారు… మన తెలుగు సినిమాల్లోలా ఉత్త బుట్టబొమ్మల పాత్రలు గాకుండా వాళ్ల కథల్లో కాస్త మంచి పాత్రలే దొరుకుతాయి వాళ్లకు… ఈమెకు కొంత సుదీర్ఘ కెరీర్ ఉన్నట్టే కనిపిస్తోంది…
నెరు సినిమాకు వస్తే, ఆల్‌రెడీ థియేటర్లలో రిలీజై చాలారోజులైంది… హిట్… ఓ 100 కోట్లు ఇప్పటికే కుమ్మేసింది… డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ పెట్టారు తాజాగా… దర్శకుడు జీతూ జోసెఫ్… అంటే అర్థమైంది కదా… దృశ్యం సీరీస్ చూశాం కదా… పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా నడిపిస్తాడు కథను… తెలుగులో మనం డ్రై కంటెంట్‌గా తీసిపారేసే కోర్టు సీన్లను కూడా తను ఇంట్రస్టింగుగా మలుస్తాడు… కొత్త సెక్షన్లను పట్టుకొస్తాడు…
Ads
ఇదీ అంతే… ఏకంగా ప్రధాన కథానాయిక మొదట్లో అత్యాచారానికి గురవుతుంది… పైగా ఆమె అంధురాలు… ఎవరు దోషి… ఏ క్లూ లేదు, ఈ దశలో శిల్ప జ్ఞానం కూడా ఉన్న ఆ అమ్మాయి రఫ్‌గా ఓ బొమ్మ రూపొందిస్తే, దాన్ని పట్టుకుని పోలీసులు ఓ పెద్ద వ్యాపారి కొడుకును జైలులో పడేస్తారు… ఆ అమ్మాయిని కేసు సెటిల్ చేసుకోవాల్సిందిగా ఆఫర్లు వస్తే ఆమె తిరస్కరిస్తుంది… అదుగో ఆమె తరఫున మోహన్‌లాల్ లాయర్‌గా రంగంలోకి దిగుతాడు… ఒక్కసారి ఊహించండి, ఏమాత్రం ఇమేజీ బిల్డప్పులు, ఎలివేషన్లు లేకుండా మన హీరోల్లో ఒక్కడైనా ఈ పాత్ర చేస్తాడా..? ఈ కథను ఏ దర్శకుడైనా తెర మీదకు తీసుకొస్తాడా..?
ఏమో, ఏ స్టార్ హీరోనో ఈ కథ రైట్స్ కొని, నానా బీభత్సమైన ఇమేజీ బిల్డప్పులతో కథను దారుణంగా మార్చేసి, రొటీన్ తెలుగు సినిమాగా మార్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి… ఓటీటీలోనే చూసేయండి…
తను మోహన్‌లాల్… హీరో కాదు, నటుడు… ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టే తప్పుడు సైగలు, స్టెప్పులు, భీకరంగా నరకడాలు, బీభత్సమైన హింస, వెకిలి కామెడీ ఏమీ ఉండదు… ఆ అత్యాచారం చుట్టూ కోర్టు డ్రామా… సరే, సినిమా అన్నాక కొంత లాజిక్‌రాహిత్యం కూడా ఉంటుంది… ఇందులోనూ కనిపిస్తుంది… కానీ బిగి సడలని స్క్రీన్ ప్లే సినిమాకు బలం… దృశ్యం-2 కూడా అంతే కదా… అక్కడక్కడా మనకు కథలో కామన్ సెన్స్ లోపించినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ, దర్శకుడు మనల్ని కన్విన్స్ చేస్తూ కథ నడిపిస్తాడు… నెరు కూడా అంతే…
అబ్బే, అత్యాచార దిగ్భ్రాంతిలో, రోదనలో ఉన్న అంధురాలు దోషి శిల్పాన్ని రూపొందించడం ఎలా సాధ్యం అనే బేసిక్ ప్రశ్న వదిలేయండి, అదే కథకు మూలాధారం… సినిమాలో ఈ కథానాయకుడైన లాయర్‌కూ ఓ బ్యాక్ డ్రాప్ ఉంటుంది… సినిమాలో ప్రియమణి కూడా ఓ లాయర్ పాత్ర పోషించింది… మళ్లీ చెబుతున్నా… ఈ సినిమాకు హీరో దర్శకుడు జీతూ జోసెఫ్… తరువాతే మోహన్‌లాల్… తనకు దీటుగా మనం మొదట్లోనే చెప్పుకున్న అనస్వర రాజన్… మరీ సీరియస్‌గా ఇన్వాల్వ్ అయిపోకండి, లేకపోతే ఆమెతో ప్రేమలో పడిపోతారు…!!
Share this Article