రోటిపొడి – రోకటిపోటు
~~~~~~~~~~~~~~~~
పండుగ రెండుమూడు రోజులూ
Ads
కొద్దిగంత తీరుపాటం దొరికింది గద.
మా పిల్లలకు హాస్టలుకు పంపుటానికని
ఓ రెండు తీర్ల పొళ్లు చేద్దామని ముందేసుకున్న.
పండుగకు ఊరికి పోయినము గనుక–
కట్టెల పొయ్యి దొరికె, రోలూరోకలిబండా దొరికె.
పచ్చని ఆక్కూర చెట్లూ, పప్పులూ, పంటలూ దొరికె.
వాటిని పలుకరించుకోకపోతే ఎట్లా అని.. ఇట్లా ఓ పని.
రోలుదే మొగడా ! రోకలిదే మొగడా!
రోలుకాడ నన్నెత్తెయ్యి మొగడా.. !! అని సామెత.
నేనూ.. అన్ని అందిస్తెనే పొందిచ్చే బాపతేమి కాదు,
కానీ, ఆడవాళ్ల మధ్యన అర్రలకూ వంటింట్లకూ పోలేం.
మా వైపున అత్తా అల్లుడూ ఎదురుపడి మాట్లాడుకోరు.
అల్లుడి దరిదాపులకు పిల్లనిచ్చిన ఇంటి అత్తమ్మలు రారు.
ఇవన్ని ఉత్తర తెలంగాణకు చెందిన, మా ఇండ్లల్ల పద్ధతులు.
కనుక అత్తగారింట్ల, భార్య సహకారం తప్పనిసరిగ అవసరం.
పై సామెతను తిరిగేస్తే.. రోలూరోకలీ తనే నాకు సమకూర్చాలి.
తను కట్టెలపొయ్యి ముట్టించి, గిన్నెలు & సరాతం తెచ్చిపెడితే
పల్లీలు, కందిపప్పు, నేనే తెంపి కడిగి ఆరవెట్టుకున్న చెన్నంగాకు
అన్నీ దోరగ వేయించి, ఆఖరుకు జిల్కర ఎల్లిపాయ వేయించిన.
ఆ తర్వాత చివరాఖరుకు మిరుపవరుగు వేయించి పెట్టుకున్న.
అలువాటు లేని పని ఆగమాగం కావద్దని నేను అడిగిన ప్రకారంగ
తను కంది పప్పు, మిరుపకాయలు వక్కముక్క గ్రౌండు జేసిచ్చింది.
మావోడు ఇంటికి ఆ పక్కున్న చిన్నరోలు ఈ పక్కకు తెచ్ఛిపెట్టిండు.
రోలు, రోకలిబండ కుదురుకున్న తర్వాత ఇగ పని మొదలయింది.
నూనెబొట్టున్నది వాసనకే లేకుంట అన్నీ వేయించి పెట్టుకున్న గద.
ముందుగ కంది పప్పు, ఆ తర్వాత పల్లీలు ఆఖరుకు చెన్నంగి ఆకు
ఒకటెనుక ఒకటి నూరుకుంట, కారపు పొడి, జిలుకరెల్లిపాయ వేసి
గల్లుప్పువేసి, అన్నీ మల్లోసారి కలెగలిపి తాత్పరంగా సుతారంగా
నూరుటానికి, ఎంతలేదన్నా అల్కగ ఓ రెండుగంటలు మాపట్టింది.
కని, చుట్టు నాలుగిండ్లోళ్లు ముక్కులు ముర్క చూసి ఎగబీల్చే విధంగ
కమ్మటి వాసన వెదజల్లే మూడు తీర్ల పొడులైతే సిద్ధవర్తి అయినయి.
కథ బాగనేవున్నదిగని, ఫలశృతి చెప్పలేదంటరా, ఆ ముచ్చటా చెప్త.
కొడుక్కోపాలు, బిడ్డకోపాలు, ఇంటోళ్లకోపాలు మిగిలింది మాపాలు.
ఈ ముచ్చట నచ్చి, చేసుకోదలిస్తే, మీరు చేసుకున్నదంతా మీ పాలే.
విన్నోల్లెవలో, విననోళ్లెవలో, నచ్చెటోళ్లెవలో, నవ్వెటోళ్లెవలో…
ఇదుల్లా, ఉన్నకాడ ఉండబుద్ధిగాక, పండుగపూట నా ఘనకార్యం !
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article