సముచిత నేతకు సమున్నత గౌరవం … కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకుర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించింది. రేపు ఆయన జయంతి. ఇంతకీ ఎవరాయన??
1924 జనవరి 24న బీహార్‌లో జన్మించిన కర్పూరి ఠాకుర్ బీసీ (నాయీ బ్రాహ్మణ) వర్గానికి చెందిన వ్యక్తి. గాంధీజీ, సత్యనారాయణ సిన్హాల విధానాలకు ఆకర్షితులై ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్)లో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కళాశాలను వదిలేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని 26 నెలలపాటు జైలు జీవితం గడిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. 1952లో సోషలిస్టు పార్టీ తరఫున విధానసభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ధర్నాను వెనుక ఉండి నడిపించిన కారణంగా 1960లో అరెస్టయ్యారు. టెల్కో ఉద్యోగుల డిమాండ్ల సాధనకు 1970లో 28 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. 1967 నుంచి 1968 వరకు బీహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన పదోతరగతి పాసయ్యేందుకు ఆంగ్లం తప్పనిసరి అనే నిబంధనను తొలగించేలా చర్యలు చేపట్టారు. అదే సమయంలో రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత 1970 నుంచి 1971 వరకు ఒకసారి, 1977 నుంచి 1979 వరకు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీహార్ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఆయనే!
Ads
కర్పూరి ఠాకుర్ విద్యకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఆయన హయాంలో బిహార్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ఆయన తీవ్ర కృషి చేశారు. 1975లో దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితిలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌తో కలిసి ‘సంపూర్ణ విప్లవం’ పేరిట సమాజంలో మార్పు కోసం ఉద్యమించారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో 1977లో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. తర్వాత కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటుకు అది తొలి అడుగుగా మారింది.
సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన ఠాకూర్ లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారికి రాజకీయ గురువుగా వ్యవహరించారు. ప్రజలు ఆయన్ని ‘జన్ నాయక్’ అని కీర్తించేవారు. 1988 ఫిబ్రవరి 17న తన 68 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన పుట్టిన పిటాంఝియా ఊరిని ఆయన మరణానంతరం ‘కర్పూరీ గ్రామ్’గా పేరు మార్చారు. దర్భంగా-అమృత్‌సర్ మధ్య ప్రయాణించే రైలుకు ‘జన్ నాయక్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
ఇప్పుడు కర్పూరి ఠాకుర్‌కు భారతరత్న ప్రకటించడం హర్షణీయం! సరైన నేతకు సముచిత గౌరవం. ఇందులో ఎటువంటి వివాదం లేదు. ఎటొచ్చీ,ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది (2025) బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే విషయం మాత్రం గుర్తొస్తోంది. ఏదైతేనేం, ఈ గౌరవం సంతోషకరం… – విశీ
.
(ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి… ఆయన తండ్రి నిరాడంబరత గురించి… కర్పూరీ ఠాకూర్ 1988 లో పట్నాలో మరణించారు. వారి తండ్రి గోకుల్ ఠాకూర్… కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆయన తన కుల వృత్తిని వదులుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ విషయం తెలిసిన ఒక తెలుగు పత్రిక, ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా!’ అనే శీర్షికతో ఈ వార్తను బాక్స్ ఐటంగా ఆ రోజుల్లో ప్రచురించింది… By Bhandaru Srinivasa Rao)
Share this Article