ఠాట్, ఈ కాంగ్రెస్ పార్టీతో మాకు పొసగదు… ఇది అయ్యేది కాదు, పోయేది కాదు… బెంగాల్‌లో మేం ఒంటరిగానే పోటీచేస్తాం… కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేది లేదు… అవసరమైతే ఎన్నికల ఫలితాల తరువాత కూటమి గురించి ఆలోచిద్దాం… ప్రస్తుతానికి మా దారి మాదే….. మమతా బెనర్జీ ఈ మాట అనేసింది… నిజానికి ఇది పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు…
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థుల్ని నిలపాలనే సంకల్పం మంచిదే, బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి మంచిదే… కానీ ఆ కూటమిలోని నాయకుల వ్యక్తిత్త్వాలు, మొండితనాలు, పెత్తందారీ పోకడల్ని చూస్తున్న వాళ్లెవరికీ విపక్ష ఐక్యత మీద పెద్ద భ్రమలేమీ లేవు… కనీసం అలా కల్పించే, కన్పించే సూచనలు కూడా కనిపించడం లేదు… కాంగ్రెస్ ఆశిస్తున్న దిశలోనే అది కొస దాకా వెళ్లేట్టు లేదు…
తాజాగా మమతా బెనర్జీ ‘‘బెంగాల్‌లోని మొత్తం 42 సీట్లలోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది… ఇండి కూటమిలోని ఓ పార్టీకి కూడా సీట్లు ఇచ్చేది లేదు’ అని ప్రకటించింది… నిజానికి ఆ పార్టీ కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఆఫర్ చేసింది… కానీ కాంగ్రెస్ కనీసం 10 సీట్లయినా ఇవ్వాలని అడిగింది… ఇక ఈరోజు ఆ రెండు కూడా ఇచ్చేది లేదని చెప్పేసింది ఆమె… ఆమెతో అంతే… అయితే నిజానికి కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కాదు, అక్కడ లెఫ్ట్‌కు ఏమైనా సీట్లు వదిలేయాల్సి వస్తుందా అనేది మమత సందేహం…
Ads
ఆల్‌రెడీ బెంగాల్‌లో లెఫ్ట్ పామును ఆమె చంపేసింది… ఏమాత్రం చాన్స్ ఇవ్వడమూ ఆమెకు ఇష్టం లేదు… సీపీఎంకు ఒక్క సీటూ ఇవ్వకుండా మమత దాటేస్తే, సీపీఎం సొంతంగా పోటీ చేస్తే ఇక ఇండి కూటమికి, ఉమ్మడి అభ్యర్థిత్వాలకు అర్థమే లేదు… రేప్పొద్దున ఇదే సిట్యుయేషన్ కేరళలో కూడా రాబోతోంది… అక్కడ ప్రత్యర్థులే లెఫ్ట్, కాంగ్రెస్… మరి అవి సీట్లు ఎలా పంచుకోగలవు..? మమతతో వోకే, కానీ లెప్ట్‌తో ఈ సీట్ల బేరాలు, పొత్తులు కష్టం…
ఇక బిహార్‌లో కూడా సిట్యుయేషన్ అలాగే ఉంది… ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్, నితిశ్‌ల నడుమ సీట్లు సర్దుబాటు మాటెలా ఉన్నా… నితిశ్‌కు అటూఇటూ జంపడం బాగా అలవాటు… ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉండటంతో మళ్లీ ఎన్డీయేలో చేరాలని ఆశిస్తున్నాడు… బీజేపీ కూడా ఇక్కడ బాగా కాన్సంట్రేట్ చేస్తోంది… మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వడం కూడా స్ట్రాటజీయే…
కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం మేం సొంతంగా పోటీచేస్తాం అంటున్నాడు… ఆ రెండు రాష్ట్రాల్లో ఎవరికీ సీట్లు ఇవ్వడట, ఇతర రాష్ట్రాల్లో మాత్రం తనకు ఇతర పార్టీలు సీట్లు ఇవ్వాలట… ఆల్రెడీ పంజాబ్ సీట్లకు అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసేసింది…
కర్నాటకలో జేడీఎస్ ఆల్‌రెడీ బీజేపీతో సయోధ్యకు, స్నేహానికి సై అనేసింది… మరో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే… కాంగ్రెస్‌ను ప్రధాన పార్టీగానే డీఎంకే పరిగణించదు… ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలం నామమాత్రం, సో, ఇక్కడ కాంగ్రెస్‌కు చాన్స్ ఎందుకివ్వాలి అనేది అఖిలేశ్ వాదన…
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే బాపతు శివసేన కూడా ఆత్మపరిశీలనలో పడినట్టు చెబుతున్నారు… కానీ షిండేను కాదని బీజేపీ అక్కడ ఠాక్రేను ఎంటర్‌టెయిన్ చేయకపోవచ్చు…
కేరళలో పినరై విజయన్ అయితే కాంగ్రెస్‌కు కనీసం రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ స్థానాన్ని కూడా ఇవ్వబోం, మేమే పోటీచేస్తాం అంటున్నాడు… మరి కాబోయే ప్రధానికి సీటు ఎక్కడ..? ఇక కర్నాటక లేదా తెలంగాణలో ఒక సీటు చూసుకోవాలి… వోకే, సీట్ల కోసం ఎన్నికల నోటీఫికేషన్ దాకా ఇలాంటి బేరసారాలు, సంప్రదింపులు, అలకలు, రాజీలు సహజమే అనుకుందాం… కానీ ఈలోపు అయోధ్య, అక్షింతల పంపిణీ పేరిట బీజేపీ ఆల్‌రెడీ జనంలోకి వేగంగా వెళ్లిపోయింది… దాని సగం ప్రచారం పూర్తయిపోయింది…!!
Share this Article