దాసోజు శ్రవణ్ ఎందుకు అనర్హుడు అయ్యాడు..? కోదండరాం అర్హుడు ఎలా అయ్యాడు..? ఇద్దరూ రాజకీయ నాయకులే కదా… మరి గవర్నర్ శ్రవణ్ పేరును ఎందుకు పక్కన పెట్టేసింది..? కోదండరాం పేరుకు ఎలా ఎస్ అని టిక్ పెట్టింది…? ఇది గవర్నర్ పక్షపాతం కాదా..? ఈ చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది… వోకే, డిబేట్ పర్లేదు, గవర్నర్ విచక్షణాధికారం మీదే హైకోర్టులో చర్చ జరుగుతోంది… గుడ్, జరగాలి… కానీ..?
గవర్నర్ మీద నోళ్లు పారేసుకునేవాళ్లు ఇంకాస్త వెనక్కి వెళ్లి ఆమె పట్ల బీఆర్ఎస్ క్యాంపు ఎంత నీచంగా ప్రవర్తించిందో కూడా చూడాలి… ఎస్, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలు అన్నప్పుడు గవర్నర్‌కు విచక్షణాధికారం ఎందుకు ఉండకూడదు..? అంతకుముందు ఎవరిదో (కౌశిక్ రెడ్డి) పేరు వచ్చినప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది… ఇంకా తెర వెనుక ఆమె మీద ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నారో తెలియదు… కానీ కేసీయార్ నుంచి దిగువ స్థాయి కార్యకర్త దాకా ఆమెను అవమానించారు…
ఒక మహిళ అని చూడలేదు, ఆమె గవర్నర్ పోస్టులో ఉందనీ చూడలేదు, అదొక కానిస్టిట్యూషనల్ పోస్టు అనీ మరిచారు… ఒకవైపు బీజేపీ హైకమాండ్‌తో లోపాయికారీ అవగాహన కుదురుతూ, తెగుతూ ఉండగా, ఆమెను మాత్రం ఓ పక్కా ఓ ప్రత్యర్థిలా చూశాడు కేసీయార్… ప్రోటోకాల్ పక్కన పెట్టేయండి, అసలు గవర్నర్ ఒకరు ఈ రాష్ట్రానికి ఉన్నారు అనే విషయమే తెలియనట్టుగా వ్యవహరించారు… ఆమె బాధపడింది తప్ప, పలు సందర్భాల్లో బాధను వ్యక్తం చేసింది తప్ప కేసీయార్ ప్రభుత్వం మీద కక్షసాధింపు కనబరిచినట్టు అనిపించలేదు…
Ads
ఏవో కొన్ని బిల్లులు ఆపినా సరే, గవర్నర్ అధికార పరిమితులు మామూలు సందర్భాల్లో తక్కువే కాబట్టి వాటి మీద పెద్దగా నెగెటివ్ ప్రభావం లేదు, అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపితే గవర్నర్ సంతకం చేయకతప్పదు… ఎప్పుడైతే శ్రావణ్, మరొకరి అభ్యర్థిత్వాల ఫైల్ వచ్చిందో ఆమె కొరడా పట్టుకుంది… ఎహెపొండి అనేసింది… ఆమెకు మాత్రం కోపం మండుతూ ఉండదా.,.? నిజానికి ఎవర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే… కానీ అది సాఫీగా, రాజ్యాంగ హితమైన ప్రోటోకాల్, వ్యక్తిగత మర్యాదలు కూడా కనిపించే వాతావరణంలో మాత్రమే…
ఎస్, మెజారిటీ నిరూపించుకునే సందర్భాల్లో, ఎవరికీ మెజారిటీ రాని వేళల్లో, అవిశ్వాసాలు భగ్గుమనే స్థితిలో గవర్నర్లది కీలకపాత్ర… మామూలు సందర్భాల్లో గవర్నర్‌ది ఓ లాంఛనప్రాయ పాత్రే… కాకపోతే అధికారిక ప్రొటోకాల్, మర్యాదలు తప్పనిసరి… ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో ఉండేది గవర్నర్ల ప్రభుత్వమే… కేసీయార్ రాస్తానన్న కొత్త రాజ్యాంగంలో అసలు గవర్నర్ అనే పదమే ఉండకపోయేదేమో… అది వేరే సంగతి…
మరి రేవంత్ రెడ్డి..? ఆమె బీజేపీ, తను కాంగ్రెస్… బయట పార్టీల సంగతికొస్తే ఆ రెండు జాతీయ పార్టీలే బద్ధ ప్రత్యర్థులు… కానీ వాళ్లు సిస్టంలో ఉన్నారు… ఆమెకు సముచిత మర్యాద ఇస్తున్నాడు రేవంత్… ఉపముఖ్యమంత్రి భట్టిని వెంటేసుకుని వెళ్తున్నాడు, తన అవసరమేమిటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు, ఆమెను వ్యక్తిగతంగానే కాదు, ఆమె హోదాను, పదవిని కూడా గౌరవిస్తున్నాడు… (ప్రధానిని కూడా కలిసి వచ్చాడు కదా)… టీఎస్పీఎస్సీ సంగతి చెప్పాడు… మహేందర్‌రెడ్డి, ఇతర సభ్యుల పేర్లకు వోకే… ఇద్దరు ఎమ్మెల్సీలకు గవర్నర్ కోటాలో వోకే అని వోకే టిక్ పడింది… సో, ఈ కథలో తేలిందేమిటయ్యా అంటే… అధికారంలో ఉన్నప్పుడు మహిళల్ని ఇన్‌సల్ట్ చేయడం తప్పు అని..!!
Share this Article