ఒక వైద్యుని మీద నమ్మకమో… ఒక కొత్త మందు మీద ఆకాంక్షో… బలంగా మన మెదడు చుట్టూ కొన్ని పాజిటివ్ వైబ్స్ ఆవరిస్తాయి.., తద్వారా మనం బాధపడుతున్న వ్యాధి కొంత తగ్గినట్టు, నిజంగానే కొంత రిలీఫ్ కనిపిస్తుంది… పోనీ, మనకు అలా అనిపిస్తుంది… దాన్ని ఇంపాక్ట్ విత్ పాజిటివిటీ అందాం కాసేపు… మెడికల్ పరిభాషలో ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం… అంటే ఇది దైహిక నిజ ఫలితం కాదు, వ్యాధి తగ్గుతున్నదనే ఓ మానసిక భావన… అంటే మన నమ్మకాలు, ఆకాంక్షలు ఎలా మన మానసికస్థితిని, మన దేహంపై దాని ప్రభావం ఎలా చూపిస్తాయో చెప్పుకోవడం…
మనం చూసే కోణం, మన చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని అలౌకిక భావనలకు గురిచేస్తాయి… సరే, దీని మీద చాలా అధ్యయనాలు, డిబేట్లు ఉన్నాయి… ఇదెందుకు గుర్తొచ్చిందంటే… అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై దాని శిల్పి అరుణ్ యోగిరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం అనిపించాయి… తనేమంటాడంటే… ‘‘నేను చెక్కుతున్నప్పుడు కనిపించిన విగ్రహం వేరుగా, ఇప్పుడు గర్భగుడిలో ప్రతిష్ఠించిన తరువాత కనిపించే విగ్రహం వేరుగా కనిపిస్తున్నాయి…ప్రాణప్రతిష్ఠ తరువాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నాడు…
ఏడు నెలలపాటు నేను శిల్పాన్ని చెక్కాను… అలాంటిది నేనే గర్భగుడిలో కొలువైన రాముడిని హఠాత్తుగా గుర్తించలేకపోయాను… చాలా మార్పులు వచ్చాయి, విగ్రహంలో ఒక ప్రకాశం కనిపించింది… చెక్కింది నేనేనా అని సందేహం కలిగింది నాకు… తాను ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు తరచూ కోతులు వచ్చేవనీ, రాకుండా తలుపులు బిగిస్తే, పదే పదే తెరిచేదాకా కొట్టేవనీ, విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేవనీ మరో ముచ్చట పంచుకున్నాడు తను…’’
Ads
ఏడు నెలలపాటు చెక్కిన శిల్పే తన సృష్టిని తనే గుర్తుపట్టలేకపోవడం అనేది ఓ అబ్బురం… అయితే తనలో ఓ భావన బలంగా ఉంది… నేను చెక్కిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది, అది ఓ మహత్తు, దివ్యత్వం సంతరించుకుంది, అందుకే కొత్తగా కనిపిస్తోందనేది తన నమ్మిక… దానికితోడు ఓ దివ్యమైన మందిరం, ప్రపంచవ్యాప్తంగా జనం జేజేలు కొట్టిన తీరు, గర్భగుడిలో వాతావరణం, విగ్రహానికి ఆభరణాలు, పూలదండలు, అలంకరణ, నొసటన నామాలు గట్రా తనను ఒకరకమైన తాదాత్మ్యతలోకి, తద్వారా తన రాముడి రూపమే మారిపోయిందనే ఓ భావనకు దారితీసి ఉండవచ్చు…
ఎంతటి భక్తులైనా సరే… అజ్ఙాత దివ్యతేజస్సు ఏదో ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆ విగ్రహంలోకి ఆవాహన జరుగుతుందని నమ్ముతారేమో… కానీ ఏకంగా మొహం మారిపోతుందని నమ్మలేరు… సరే, నమ్మితే అది వాళ్ల బలమైన ఆధ్యాత్మిక విశ్వాసం… నాస్తికులైతే ఎహె అని కొట్టిపారేస్తారు… అందుకే రామ విగ్రహం ఒక తేజస్సు, ఒక ప్రకాశం సంతరించుకోవడం కూడా ప్లాసిబో ఎఫెక్టే అనుకోవచ్చా..? అంటే మన మానసిక భావన, మన నమ్మిక మన ఎదురుగా ఉన్న విగ్రహాన్ని మరోలా కనిపించేలా చేయడం..!
ఒక ఫోటో మామూలుగా గోడకు వేలాడదీస్తే మామూలుగానే కనిపిస్తుంది… కానీ రెండు అగరుబత్తీలు వెలిగించి, ఓ దండ వేసి, రెండు దీపాలు వెలిగించి, భక్తిగా కళ్లు మూసుకుని ఓసారి దండం పెట్టుకుని, తరువాత కళ్లు తెరిస్తే అదే ఫోటో కాస్త భిన్నంగా కనిపిస్తుంది… దాని రూపు మార్చడం కాదు, దాని చుట్టూ ఓ భక్తి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనుకోకుండానే మన దృష్టికోణాన్ని మార్చేస్తాయన్నమాట… అవునూ, అరుణ్ యోగిరాజ్ పరిస్థితి కూడా అదేనా..? ఏమో, ఇంట్రస్టింగ్ స్టోరీ…!!
Share this Article