ఆమధ్య ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది… వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక కొత్త పార్టీ ప్రారంభం కాబోతోంది, షర్మిలకూ-జగన్‌కూ నడుమ విభేదాలే కారణం, ఆమెకు నచ్చజెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి, ఆమె స్వయంగా తెలంగాణలోని వైఎస్ అభిమానులతో మాట్లాడుతోంది, పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి అనేది ఆ వార్త సారాంశం… షర్మిల కాస్త ఆలస్యంగా తమ కుటుంబంపై ప్రచారదాడిని ఖండిస్తున్నానని ఓ ప్రకటన జారీచేసిందే తప్ప, కొత్త పార్టీ ప్రచారం గురించి ఏమీ ప్రస్తావించలేదు అందులో… వైసీపీ వైపు నుంచి అసలు ఏ ఖండన, ఏ వివరణ లేదు… షర్మిలకూ జగన్‌కూ తగాదా అనేది అబద్ధం… జగన్‌కు వ్యతిరేకంగా ఆమె ఒక్క అడుగు కూడా వేయదు… మరి ఈ ప్రచారం ఎందుకు..? ఇప్పుడు ఓ కొత్త చర్చ తెలంగాణ, ఆంధ్రా పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది… అసలు జగన్ ఆశీస్సులతోనే ఈ కొత్త పార్టీ పురుడు పోసుకుంటోందనేది ఆ చర్చ సారాంశం… నమ్మేట్టుగా లేదు, కానీ జరుగుతున్న చర్చ మాత్రం అదే… రాజకీయాల్లో జరగొద్దని కూడా ఏమీ లేదు…
అన్నింటికీ మించి ఈ ప్రచారంలో వినిపించే ఓ విశేషాంశం ఏమిటంటే..? బీజేపీ హైకమాండ్ ఒత్తిడి, సూచనల మేరకే జగన్ వ్యవహరిస్తున్నాడనేది..! బీజేపీ చెబితే జగన్ చేస్తాడా..? దీనివల్ల జగన్‌కు ఏం ఉపయోగం..? బీజేపీకి ఏం ఉపయోగం..? ఇవీ కీలకప్రశ్నలు… దానికి వినిపించే కారణాలు ఏమిటంటే..? బీజేపీ వైపు తెలంగాణ రెడ్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు… ఇప్పటికీ వైఎస్ మీద అభిమానమున్న కేడర్ ఉంది… సెటిలర్లు, క్రిస్టియన్లు, రెడ్లు జగన్-కేసీయార్ బంధం కారణంగా టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు… మొన్న గ్రేటర్ ఎన్నికల్లోనూ వీళ్ల వోట్లు టీఆర్ఎస్కు బాగా ఉపయోగపడ్డాయి… ఇప్పుడు షర్మిల నేతృత్వంలో ఓ పార్టీ ప్రారంభిస్తే ఆ వోట్లు కేసీయార్‌కు ఉపయోగపడకుండా చీల్చేయవచ్చు… తద్వారా కేసీయార్‌కు నష్టం, బీజేపీకి లాభం… అలాగే తెలంగాణ రెడ్లు రేవంత్‌రెడ్డి వైపు, అంటే కాంగ్రెస్ వైపు మరింత పోలరైజ్ గాకుండా చూడటం… తద్వారా కాంగ్రెస్‌కు లాభం రావొద్దు, రేవంత్‌రెడ్డి బలం పుంజుకోవద్దు…
Ads
పైపైన చూస్తే కరెక్టే అనిపించినా… రాజకీయాల్లో ఎప్పుడూ ‘‘ఆశించిన ఈక్వేషన్’’ మేరకు పరిణామాలు ఉండవు, ఉండాలని లేదు… పైగా బీజేపీ ఒత్తిడి మేరకు జగన్ కేసీయార్‌తో బంధాన్ని తెంచేసుకుని, తనకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తాడనేది నమ్మేట్టుగా లేదు… కానీ పార్టీలోని ఒక సీనియర్, జగన్ కుటుంబసభ్యుడే తెలంగాణలోని కొందరు లీడర్లతో నోవాటెల్ లో భేటీ అయ్యాడనే ఒక సమాచారం కొత్త పార్టీ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది… అంటే జగన్ ఆలోచనల మేరకే వ్యవహారాలు సాగుతున్నాయని అనుకోవాలా..? లేక… కేటీయార్ కొత్త సీఎం, కేసీయార్ వానప్రస్థం ప్రచారాల్లాగే షర్మిల కొత్త పార్టీ అనే ప్రచారం కూడా నాలుగు రోజులకు తూచ్ అని వీగిపోతుందా..? రాజకీయాల్లో కొన్నిసార్లు పొగ నిప్పులేకున్నా వస్తుంది… కానీ ఇక్కడ నిప్పు ఉందా..? లేదా..? రేపు లాంఛనంగా ప్రకటన ఉండొచ్చా..? ఈనెలలోనే కాస్త ఆగి ప్రకటన వస్తుందా..? జవాబులు కాలం చెప్పాల్సిందే… ఒకవేళ ఇది నిజమైతే కేసీయార్ ఈ వ్యూహాన్ని ఎలా చెల్లాచెదురు చేస్తాడనేది కూడా ఆసక్తికరమే..!!
Share this Article