నో డౌట్… ధనుష్ గుడ్ యాక్టర్… పాత్రలోకి దూరిపోయి, ఆ పాత్రకు ఎంత అవసరమో అంతే నటిస్తాడు… నో ఓవరాక్షన్… లోటు చేయడు… తన సినిమాలో కావాలని వేరే యాక్టర్లను డామినేట్ కూడా చేయడు… కానీ…
కెప్టెన్ మిల్లర్ అనే సినిమా మొన్నటి సంక్రాంతికి తమిళంలో రిలీజైంది… అసలే రెండు తెలుగు రాష్ట్రాలలో స్ట్రెయిట్ సినిమాలు నాలుగు తన్నుకుంటున్నాయి… హనుమాన్ అనే సినిమాను తొక్కేయడానికి థియేటర్లనే సరిగ్గా ఇవ్వలేదు… ఈ స్థితిలో ఇక డబ్బింగ్ సినిమాకు చాన్స్ ఎక్కడుంది..? మన తెలుగు మాఫియా నిర్మాతలు నిర్మించిన తమిళ సినిమా అయితే వోకే, కానీ మిల్లర్ తమిళ నిర్మాణం కదా…
సో, ఆ పోటీలో ఇక్కడ థియేటర్ల కోసం మాఫియా కాళ్ల మీద పడటం దేనికనుకుని తెలుగు రిలీజ్ వాయిదా వేసుకున్నారు… 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 63.5 కోట్లు వసూలు చేసిందీ అంటే హిట్టే… కానీ తమిళ వసూళ్లు కాబట్టి, ధనుష్ తమిళుడు కాబట్టి ఆ సంఖ్య వచ్చింది… అదే సినిమా అదే సంక్రాంతి వేళ వచ్చి ఉంటే గుంటూరుకారం, హనుమాన్ నడుమ నలిగిపోయేది… ఎందుకంటే, కెప్టెన్ మిల్లర్ పెద్ద ఇంప్రెసివ్‌గా లేడు కాబట్టి…
Ads
నో డౌట్… ధనుష్ ఎంచుకునే పాత్రలు బాగుంటయ్… కానీ ఇందులో పాత్ర ఏమంత ప్రభావమంతంగా లేదు… ఓ డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీ కుర్రాడు… ఊరి జమీందారు నుంచి అవమానాలు, వివక్ష భరించలేక గౌరవం దక్కుతుందని బ్రిటిష్ ఆర్మీలో చేరతాడు… ఐనా తను పడిన మానసిక వేదన, తరువాత తమ కులస్తుల ఆత్మాభిమానం, సమస్యల పరిష్కారం కోసం తను చేసిన పోరాటమే ఈ సినిమా కథ…
స్టోరీ లైన్ గుడ్… కానీ ప్రజెంటేషన్ గత సినిమాల్లాగా బలంగా లేదు… పైగా ఈమధ్య అన్ని సినిమాల్లోనూ కేజీఎఫ్ తరహా భీకరమైన యాక్షన్ సీన్లు పెడుతున్నారు కదా, అదే ట్రెండ్ అనుకుంటున్నారు… ఇందులోనూ అంతే… ఎడతెగని యాక్షన్ సీన్లు… అప్పటికాలంలోనూ మోడరన్ వెపన్స్ కనిపిస్తుంటాయి… దాంతో నిజంగానే హీరో తమ కులస్తుల కోసం చేసే పోరాటం అనే పాయింట్ ఫోకస్ కోల్పోయింది…
కన్నడ శివ రాజకుమార్, తెలుగు సందీప్ కిషన్, కన్నడ-తమిళ నేపథ్యాల ప్రియాంక అరుళ్ మోహన్… ఇంకేం పాన్ ఇండియా సినిమా అయిపోయింది… దర్శకుడు అలాగే అనుకున్నట్టున్నాడు… కానీ హీరోయిన్ సహా శివన్న, సందీప్‌లకు కూడా పెద్దగా పాత్రాప్రాధాన్యం లేదు… మరనీ సందీప్ కిషన్ పాత్ర అయితే ఓ అతిథి పాత్ర… శివన్నే నయం, కాస్త అక్కడక్కడా కనిపిస్తాడు… మొత్తం ధనుష్ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది… నివేదిత కూడా జస్ట్ వోకే…
నిర్మాణ విలువలు వోకే, కానీ రాసుకున్న సీన్లను ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం కొంత కనిపించింది… ఒకవైపు నిమ్నకులాల అస్థిత్వ, ఆత్మాభిమాన పోరాటం మరోవైపు దేశభక్తి కలగలపడం మంచి స్టోరీ లైన్… కానీ యాక్షన్ ఒరవడిలో, ఉరవడిలో అసలు కథ కొట్టుకుపోయింది… ప్చ్, నిరాశపరిచావ్ ధనుష్…
Share this Article