నటి శ్రీవిద్య ఆస్తులెక్కడ? గణేష్ కుమార్ ఏమయ్యాడు? (నటి శ్రీవిద్య అన్న శంకర్ రామన్ భార్య విజయలక్ష్మి ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇవి..)
నటుడు కమల్‌హాసన్ శ్రీవిద్యను ప్రేమించి మోసం చేశారని, ఆఖరి రోజుల్లో శ్రీవిద్యను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని.. ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవేమీ నిజం కాదు. నాకు శంకర్ రామన్‌తో 1981లో వివాహమైంది. అప్పటి నుంచి ఆ కుటుంబంలో నేను ఒక సభ్యురాలిగా మారాను. శ్రీవిద్య, నేనూ వదినా మరదళ్ల కన్నా ఎక్కువగా, సొంత అక్కాచెల్లెళ్ళలాగే ఉండేవాళ్ళం. నేను తనను ‘విద్దీ’ అంటే తను నన్ను ‘విజ్జీ’ అనేది. మా ఆయనకు తన చెల్లెలు అంటే ప్రాణం. నా పెళ్లయ్యేనాటికే తనకు జార్జ్ థామస్‌తో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. అప్పటిదాకా దూరంగా ఉన్న తను మా పెళ్లి సందర్భంలో మాతో కలిసిపోయింది. ఆ తర్వాత అందరూ ఒక్కటయ్యారు.
శ్రీవిద్య, కమల్‌హాసన్ ఒకరినొకరు ప్రేమించుకున్నారనే మాట వాస్తవం. నా పెళ్లి కాకముందు జరిగిన విషయాలవి. ఇవన్నీ నాకు మా ఆయన చెప్తే తెలిసింది. నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నా! కమల్‌హాసన్‌ను మేము ఏరోజూ శత్రువులా చూడలేదు. ఆయన కూడా మమ్మల్ని చాలా అభిమానించారు. మా ఆయన, కమల్ ఇద్దరూ స్నేహితులు. కమల్ హీరో కాకముందే వారిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. అలా తనకు, శ్రీవిద్యకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ విషయం కమల్ వెళ్లి శ్రీవిద్య వాళ్ల అమ్మ, మా అత్తగారు ఎం.ఎల్.వసంతకుమారి (ప్రముఖ సంగీత విద్వాంసురాలు)కి చెప్పారు. కమల్ కన్నా శ్రీవిద్య ఒక సంవత్సరం పెద్దది. ఇద్దరూ సినిమా రంగంలో అప్పుడప్పుడే పైకి వస్తున్నారు. ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం సరికాదని మా అత్తయ్య అన్నారట! అలా ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ విషయంలో విద్య చాలా బాధపడింది. ఆ తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా వాటికి వద్దని చెప్పేదట!
Ads
జార్జ్ థామస్ మలయాళ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్. 1978లో శ్రీవిద్య అతణ్ని పెళ్లి చేసుకుంది. అతను సిరియన్ క్రిస్టియన్. శ్రీవిద్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. అతణ్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో విద్య మతం మారింది. మా పెళ్లి జరిగిన తర్వాత శ్రీవిద్య మా ఇంటికి రావడం, మేము తన ఇంటికి వెళ్లడం సహజంగా జరిగేది. ఎక్కడా తను పడే ఇబ్బందుల గురించి బయటకు చెప్పేది కాదు. అంతా మాములుగానే ఉండేది. మా ఆయన మాత్రం చెల్లి ప్రవర్తనలో ఏదో తేడా గమనించేవారు. ఒకసారి నేను, మా ఆయన, విద్య, జార్జ్ కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్లాం. అక్కడ తన జుట్టు చూస్తూ “విద్దీ! నీ వెంట్రుకలు ఎంత బాగున్నాయో కదా!” అన్నాను. తను వెంటనే “తల వెంట్రుకలు బాగుంటే ఏం? తలరాత మాత్రం బాగా లేదు కదా!” అంది. 1987లో నిజం బయటకు వచ్చింది. తనకు, జార్జ్‌కు గొడవలవుతున్నాయని, అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఒక సందర్భంలో శ్రీవిద్య ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఎలాగో దాన్ని ఆపి, మా అత్తగారు తనను జార్జ్ దగ్గరి నుంచి తీసుకొని వచ్చేశారు. సిరియన్ క్రిస్టియన్లు విడాకులు పొందడం అంత సులభం కాదు. దాంతో అతణ్నుంచి విడాకులు తీసుకోవడానికి శ్రీవిద్య 1991 దాకా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత విడాకులు వచ్చాయి.
1990లో శ్రీవిద్య వాళ్లమ్మ (ఎం.ఎల్.వసంతకుమారి) క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ తర్వాత నుంచి శ్రీవిద్య మాకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది. చెన్నైలోని తన ఇంట్లో తను ఉన్నా తను షూటింగ్‌లలో బిజీగా ఉండేది. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేది. మేమూ మా పనుల్లో ఉండేవాళ్ళం. 2001లో శ్రీవిద్య వాళ్ల నాన్నగారు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఒక రోజు మాకెవరికీ చెప్పకుండా చెన్నైలో ఇల్లు ఖాళీ చేసి కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లిపోయింది. ఆ విషయం చాలా రోజుల తర్వాత కానీ మాకు తెలియలేదు. సరే! అక్కడే హాయిగా ఉంటుంది కదా అనుకున్నాం! శ్రీవిద్య తమిళనాడులో పుట్టినా, మలయాళీలు ఆమెను తమ సొంత మనిషి అనుకునేవాళ్లు. ఆ రోజుల్లో మలయాళంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుల్లో తను ఒకరు. 2001 తర్వాత తను మలయాళ సీరియళ్లు చేస్తూ అక్కడే ఉండిపోయింది. మేమూ ఎక్కువగా అక్కడికి వెళ్లలేదు.
తనకు క్యాన్సర్ ఉందన్న సంగతి మాకెవరికీ తెలియదు. తను మాతో అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, ఏరోజూ తన అనారోగ్యం గురించి చెప్పలేదు. 2006 ఆగస్టులో హిందూ పేపర్‌లో ‘Actress Sri Vidya counting her days’ అనే ఆర్టికల్ వచ్చింది. ఆ విషయం వేరే వాళ్లు చెప్పడంతో మాకు విషయం తెలిసింది. వెంటనే మా ఆయన తిరువనంతపురం వెళ్లారు. అక్కడ హాస్పిటల్లో శ్రీవిద్యను చూసి ఆయన షాకయ్యారు. జుట్టు మొత్తం ఊడిపోయి, చర్మం అంతా పాలిపోయిన తనను చూసి ఆయన తట్టుకోలేక ఏడ్చారు. అంత చివరి దశకు వచ్చేదాకా మాకు ఆ విషయం తెలియదు. ఎవరూ చెప్పలేదు. తను కళ్లు తెరిచి “ఎందుకు వచ్చావు? వెళ్లిపో! నేను బాగానే ఉన్నాను” అని నీరసంగా అందంట! అక్కడున్న డాక్టర్లు మా ఆయన నెంబర్ తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో శ్రీవిద్య చనిపోతుందనగా ఆ డాక్టర్లే మాకు ఫోన్ చేసి చెప్పారు. మేము వెళ్లి తనను చూశాం! 2006 అక్టోబర్ 19న శ్రీవిద్య మరణించింది.
ఆ తర్వాత రోజు రాజాజీ హాల్‌లో తన భౌతికకాయం ఉంచారు. మలయాళ సినీరంగంలో ఉన్న అందరూ వచ్చి నివాళి అర్పించారు. అక్కడే దహనం చేశాం! అతి దారుణమైన విషయమేమిటంటే, శ్రీవిద్యకు ఆఖరి కర్మలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తను క్రైస్తవ మతం తీసుకుందని బ్రాహ్మణులు ఆమెకు చివరి కర్మలు చేయలేమని చెప్పేశారు. మా ఆయనే పూనుకుని సొంతంగా అన్నీ చేశారు. అప్పటిదాకా తిరువనంతపురంలో తను ఎలా ఉందో, ఏం సంపాదించిందో తెలియదు. తను మరణించాకే మాకు కె.బి.గణేష్ కుమార్ అనే వ్యక్తి గురించి తెలిసింది.
కె.బి.గణేష్ కుమార్ ప్రస్తుతం(2024) కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. 2001 నుంచి అతను ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలోనూ మంత్రిగా పనిచేశారు. వాళ్ల నాన్న బాలకృష్ణ పిళ్లై కేరళ సీనియర్ నాయకుడు. వాళ్లది చాలా పెద్ద రాజకీయ కుటుంబం. గణేష్ కుమార్ నటుడు కూడా! ఆ నటనలో భాగంగా తనకు, శ్రీవిద్యకూ పరిచయం ఏర్పడి ఉంటుంది. ఒక సమయం తర్వాత శ్రీవిద్య అతణ్ని పూర్తిగా నమ్మింది. తన ఆస్తి మొత్తానికి అతనికి Power of Attorney రాసి ఇచ్చింది.
చనిపోయేముందు వీలునామా కూడా రాసిందని గణేష్ కుమార్ అన్నారు. దాని ప్రకారం తన ఆస్తిలో కొన్ని లక్షలు మా ఇద్దరు అబ్బాయిలకు, కొన్ని లక్షలు పనివాళ్లకు, మిగిలిన ఆస్తి అంతా తన పేరిట ఒక ట్రస్టు పెట్టి పేదలకు సేవ చేయాలని ఆ వీలునామాలో ఉంది. ఆ వీలునామాలో సంతకం శ్రీవిద్యదే కానీ, తను స్పృహలో లేనప్పుడు ఆ సంతకం చేసి ఉంటుందని అందరి అనుమానం. తన అంత్యక్రియలు పూర్తి అయిన వెంటనే మేం చెన్నై వచ్చేశాం! తిరువనంతపురంలో తనకు ఇల్లు ఉంది, అందులో చాలా నగలు, విలువైన సామగ్రి ఉన్నాయి. అవన్నీ ఏమయ్యాయో తెలియదు. ఆ ఇంట్లో పనివారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు.
గణేష్ కుమార్‌కు కేరళలో చాలా పలుకుబడి ఉంది. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనుషుల్ని చంపేసినా అడిగే ధైర్యం ఎవరికీ లేదని విన్నాం. అలాంటప్పుడు మేము అతణ్ని ఎలా ఎదుర్కోవాలి? మాకు ఎవరు సాయం చేస్తారు? శ్రీవిద్య ఆస్తి మాకు వద్దు. కనీసం తన కోరిక ప్రకారం ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలి కదా! తను చనిపోయి 18 ఏళ్లు అయింది. మరి ఇంకా ట్రస్టు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆమె ఆస్తులు అన్నీ ఎటు పోయాయి? ఎవరు అనుభవిస్తున్నారు. 2011లో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మమ్మల్ని పిలిచి శ్రీవిద్య ఆస్తుల్ని తాను తిరిగి ఇప్పిస్తామని అన్నారు. మొత్తం విషయం ప్రెస్ ముందు చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఏదీ ముందుకు కదలలేదు. తమిళనాడులో కరుణానిధిని కలిశాం, స్టాలిన్‌ను కలిశాం, నడిగర్ సంగం( నటీనటుల సంఘం) వారిని కలిశాం! ఇది సివిల్ కేసు అని, మేము ఎవరం ఏమీ చేయలేమని అన్నారు.
శ్రీవిద్యకు కొంత మొండితనం, పిడివాదం ఉండేది. అవి లేకపోతే తను ఉన్నత స్థాయిలో ఉండేదని మా అత్తగారు అనేవారు. ఆ మొండితనం కారణంగానే తన జీవితం ఎటో అయిపోయింది. ఇప్పుడు తను లేదు, మా ఆయన లేరు. నేను, మా పిల్లలు ఉన్నాం. ఈ వయసులో ఇంక పోరాడే శక్తి లేదు. మాకు ఆస్తులు వద్దు. శ్రీవిద్య కోరిక ప్రకారం అవన్నీ పేదలకు ఉపయోగపడాలి. అదే మా కోరిక…. PS: ఇటీవల విడుదలైన మలయాళ సినిమా ‘NERU’లో సీఐ పాల్ వర్గీస్ పాత్ర పోషించింది ఆ కె.బి.గణేష్ కుమారే!
Share this Article