అందరూ ఊహించినట్టుగా…. జార్ఖండ్ ముఖ్యమంత్రి కుర్చీని హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ అధిరోహించడం లేదు… హఠాత్తుగా జార్ఖండ్ టైగర్ అని పిలవబడే చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చాడు… ఇంట్రస్టింగు… నిజానికి అందరూ అనుకున్నదేమిటంటే… హేమంత్ తన కుర్చీని ఇంకెవరికీ ఇవ్వడు, తన భార్యనే మరో రబ్రీదేవిగా కుర్చీపై కూర్చోబెడతాడు అనుకున్నారు…
రాజకీయంలో ఎప్పుడేం జరుగునో ఎవరూ చెప్పలేరు కదా… తెర వెనుక రాజకీయం ఏం జరిగిందో ఏమో గానీ చంపయ్ సోరెన్ పేరు బలంగా ముందుకొచ్చింది… ఈడీ కేసుల నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేస్తారనే ఊహాగానాల నడుమ తను రెండు రోజులు మాయమైపోయి, తరువాత ప్రత్యక్షమయ్యాడు… చకచకా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి… జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలందరూ సమావేశమై, గత రాత్రి రెండు ఖాళీ కాగితాలపై సంతకాలు చేసి ఇచ్చారు…
ఒకటి కల్పన సోరెన్ కోసం… మరొకటి చంపయ్ సోరెన్ కోసం… కానీ అనంతరం చంపయ్ సోరెన్‌ను లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నారు… అంటే తనే సీఎం కాబోతున్నాడన్నమాట… ప్రస్తుత ప్రభుత్వంలో చంపయ్ మంత్రిగా ఉన్నాడు… ఎంతకీ ఎవరు ఈ మరో సోరెన్..? శిబూసోరెన్‌కు లేదా హేమంత్ సోరెన్‌కు ఏమవుతాడు..? ఆ సోరెన్ పేరు ఏం సూచిస్తోంది..? ఆ కుటుంబానికి బంధువేనా..?
Ads
కాదు… జిలింగ్‌గోడా అని సరైఖేలా- ఖర్‌సావన్ జిల్లాలో ఓ ఊరు… అక్కడ సిమల్ సోరెన్ అనే ఓ మామూలు రైతు… తన కొడుకు ఈ చంపయ్ సోరెన్… సర్కారీ బడిలో పదో తరగతి వరకు మాత్రమే చదివాడు… పొలం పనుల్లో తండ్రికి సాయం చేసేవాడు… చిన్న వయసులోనే పెళ్లి… నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు… సోరెన్ అనేది శిబూ సోరెన్‌కు ఉన్నట్టుగానే ఓ కామన్ ఇంటిపేరు… అంతే…
తొంభైలలో జార్ఖండ్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఈ చంపయ్ సోరెన్ జేఎంఎం అధినేత శిబూసోరెన్‌తో కలిసి యాక్టివ్‌గా పాల్గొనేవాడు… ఆ ఉద్యమకాలంలోనే తనకు జార్ఖండ్ టైగర్ అని పేరొచ్చింది… సరైఖేలా నుంచి ఇండిపెండెంట్‌గా ఓ ఉపఎన్నికలో నిలబడి తన రాజకీయ కెరీర్ స్టార్ట్ చేశాడు… ఆ తరువాతే జేఎంఎంలో అధికారికంగా చేరాడు…
అర్జున్ ముండా నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలోనూ చంపయ్ సోరెన్ మంత్రిగా పనిచేశాడు… 2010 నుంచి 2013 వరకు మంత్రిగా చేశాడు… తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన… తరువాత హేమంత్ సోరెన్ కేబినెట్‌లో పౌరసరఫరాలు, రవాణా మంత్రిగా చేరాడు… ఇదీ తన నేపథ్యం… మరి కల్పన సోరెన్..? ప్రస్తుతానికి జస్ట్, గృహిణి…! మరి హేమంత్ సోరెన్..? అరెస్టు చేస్తారని సమాచారం… సీఎంగా రాజీనామా చేశాడు…!! ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిశారు…
Share this Article