Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నితిశ్ చూపిన దోవ, చెప్పిన పాఠం… కేసీయారే బీజేపీని అలుముకుంటాడు…

February 1, 2024 by M S R

పార్థసారథి పోట్లూరి….. బీహార్ రాజకీయం! బీహార్ అంటే కుల రాజకీయాలకి కేంద్ర బిందువు! ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏకఛత్రాధిపత్యంగా బీహార్ ను ఏలాడు. గత 25 ఏళ్ళుగా నితీష్ కుమార్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ వస్తున్నాడు. నితీష్ కుమార్ కి పల్టూ రామ్ అనే ముద్దు పేరు ఉంది బీహార్ లో! అంటే తరుచూ పొత్తులు మారుస్తూ ఉంటాడు. నితీష్ కుమార్ కి ఎలాంటి నైతిక విలువలు ఉండవు. ఆమాటకి వస్తే అసలు ఇప్పటి రాజకీయాలలో నైతిక విలువలు కలిగిన వారు చాలా తక్కువ.

కానీ నితీష్ కుమార్ మాత్రం కొంచెం స్పెషల్. తనకి అధికారం ముఖ్యం! దాని కోసం ఎన్నిసార్లు అయినా U టర్న్ తీసుకుంటాడు. అలా చేయడానికి మొహమాట పడడు, సిగ్గు పడడు! అదేంటో కానీ బీహార్ ప్రజలు కూడా నితీష్ కుమార్ తరుచూ పొత్తులు మారుస్తున్న అతనికి ఓట్లు వేస్తూనే వస్తున్నారు కానీ సీట్ల సంఖ్య పెరగదు, తరగదు.

**********
రెండు రోజుల క్రితం నితీష్ కుమార్ మహగట్భంధన్ (indi కూటమి)నుండి బయటపడి తిరిగి బీజేపీతో చేతులు కలిపాడు. అయితే నితీష్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలపడాన్ని బీజేపీ అభిమానులు హర్షించలేదు. 2022 లో NDA తో తెగతెంపులు చేసుకోవడం కాంగ్రెస్, RJD పంచన చేరిన వైనంతో నితీష్ కుమార్ పట్ల బీజేపీ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కానీ రాజకీయ అవసరాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ లెక్కలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ కూడికలు, తీసివేతల మతలబు ఏమిటో అర్థం అవుతుంది.

*********
నితీష్ కుమార్ JDU… మొదట్లో  నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు బీహార్ కి ఒక స్వర్ణ యుగం ప్రారంభం అయ్యింది అనే భావన ఉండేది. అది 2005 నుండి 2010 వరకు అన్నమాట! ఆఫ్కొర్స్ ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టు మహా వృక్షం అయినట్లు నితీష్ కుమార్ కి ముందు కాంగ్రెస్ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ పాలన బీహార్ ను మధ్య యుగాలలోకి తీసుకెళ్లాయి.

Ads

2005 లో నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక బీహార్ లో పాలన గాడిన పడ్డది. అది 2010 వరకూ కొనసాగింది. అందుకే 2005 నుండి 2010 వరకూ నితీష్ కుమార్ పాలనను స్వర్ణయుగంగా అంటారు. 2010 తరువాత నితీష్ కుమార్ కి అధికార యావ తప్ప బీహార్ అభివృద్ధి కోసం చేసింది ఏమీలేదు. అసలు నితీష్ కుమార్ కి పూర్తి మెజారిటీ వచ్చిందీ లేదు. కానీ కలగూర గంప పార్టీలతో పొత్తులు పెట్టుకొంటూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తూ వస్తున్నాడు. అధికారం కోసం బద్ధ శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపాడు. అందుకే నితీష్ కుమార్ ను కుర్చీ కుమార్ అని పిలుస్తారు బీహార్ ప్రజలు.

********
2022 లో NDA తో తెగతెంపులు చేసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ RJD, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమితో జట్టు కట్టాడు. ఆ తరువాత I.N.D.I. కూటమి ఏర్పాటు చేయాలని సూచించింది నితీష్ కుమారే! I.N D.I కూటమికి అంకురార్పణ చేసి దానికి నీళ్లు పోసింది నితీష్ కుమారే! కానీ నితీష్ కుమార్ అనుకున్నది వేరు, జరిగిందీ జరుగుతున్నదీ వేరు!

నిజానికి ఇండి కూటమికి తాను కన్వీనర్ అవాలని అనుకున్నాడు, ప్రతిపాదన మిగతా పక్షాల నుండి ఏకగ్రీవంగా వస్తుంది అని ఆశించాడు. కానీ అలా జరగలేదు. ముఖ్యంగా రాహుల్ నుండి ప్రతిపాదన రావాలని ఆశించాడు నితీష్. కానీ రాహుల్ అస్సలు పట్టించుకోలేదు, సరికదా లాలూ ప్రసాద్ యాదవ్ నుండి ప్రతిపాదన వచ్చింది. దానికి మల్లిఖార్జున ఖర్గే సమర్థించాడు.

మమత బెనర్జీ మౌనంగా ఉండిపోయింది. అఖిలేష్ యాదవ్ ముభావంగా సరే అన్నాడు. స్టాలిన్ కు ఎవరయినా సమ్మతమే! నితీష్ కుమార్ అనుకున్నది ఏమిటంటే గతంలో UPA కన్వీనర్ లేదా చైర్ పర్సన్ గా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసినట్లు తానూ అలాగే అవ్వాలని చూసాడు! నితీష్ కుమార్ చిరకాల స్వప్నం! నితీష్ కుమార్ కి తాను ఎప్పటికైనా ప్రధాని అవ్వాలని ఆశ!

********
నితీష్ కుమార్ U టర్న్ తీసుకోవడానికి కారణం ఉంది! అయితే ఈ సందర్భంగా మాయాబజార్ సినిమాలో ఒక సంభాషణను ప్రస్తావించాలి! “ శ్రీ కృష్ణుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరుగుతుంది అని” ఇది శకుని డైలాగ్. నితీష్ కుమార్ కూడా ఇలాగే అనుకున్నాడు. I N.D.I.A. కూటమి పనులతో బిజీగా ఉన్న నితీష్ కుమార్ తన వెనుక ఏం జరుగుతున్నదో తెలుకోలేకపోయాడు!

లాలూ ప్రసాద్ యాదవ్ JDU కి చెందిన 13 మంది MLA తో రహస్యంగా మంతనాలు జరుపుతున్నాడు! JDU MLA లకి మంత్రి పదవులు, డబ్బు ఆశ పెట్టి RJD ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ ప్లాన్. నితీష్ కుమార్ ను దించేసి తన 9th ఫెయిల్ అయిన కొడుకు తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి బీహార్ ను తన గుప్పెటలో పెట్టుకోవాలని ప్లాన్ చేశాడు.

అమిత్ షా అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండేవాడు. అమిత్ షా 13 మంది MLA ల పేర్లు, ఎవరు ఎప్పుడెప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులతో ఎక్కడెక్కడ సమావేశం అయ్యారో వివరాలు ఇచ్చారు. అమిత్ షా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను ధృవపరుచుకున్న నితీష్ కుమార్ వెంటనే బీజేపీతో చేతులు కలిపాడు. So! నితీష్ కుమార్ కి వేరే దారి లేదు!

బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు నిశ్చింతగా ఉన్నాడు నితీష్ కుమార్! లాలూ ప్రసాద్ యాదవ్ వలన తన పార్టీకి ముప్పు ఉంటుంది అని తెలిసీ పొత్తు పెట్టుకున్నాడు. ఇండి గ్రూపు ఎటూ అధికారంలోకి రాదు అని తెలుసుకొని ఇంకా అంట కాగడం వృధా అవుతుంది అని భావించాడు. రామమందిర బాల రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వలన బీహార్ లో 3% ఓట్లు బీజేపీ వైపు పెరుగుతుంది అని అంచనా! మూడు శాతమే అయినా హీనపక్షం 12 పార్లమెంటరీ స్థానాలలో ప్రభావము ఉంటుంది.

ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ వెన్నుపోటు రాజకీయం ఎదుర్కుంటూ INDI గ్రూపుతో కలిసి ఎన్నికలకి వెళ్లి తనకి తాను కొరివితో తల గొక్కోవడం కంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తే తనకు మంచిది అని భావించాడు నితీష్ కుమార్! ప్రపోజల్ నితీశ్ కుమార్ నుండే వచ్చింది!

*******
మరి బీజేపీ ఎందుకు సమ్మతించింది? ఇదిగో ఈ గణాంకాలు చూస్తే అర్థం అవుతుంది! RJD కి ఉన్న ఓటింగ్ శాతం 32%. ఇందులో ముస్లిం ఓటర్లు 18%, యాదవ ఓటర్లు 14% ఉన్నారు. ఈ లెక్కలలో కొద్దిగా అటూ ఇటుగా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులని బట్టి.
నితీష్ కుమార్ JDU కి Non యాదవ్ OBC ఓటర్లలో గట్టి పట్టు ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా నాన్ యాదవ ఓటర్లు జేడీయు వైపే ఉంటూ వస్తున్నారు.

RJD+ JDU+ Congress+ CPI(ML) కూటమి అనేది బీహార్ లో చాలా స్ట్రాంగ్. తాజా సర్వే ప్రకారం ఈ కూటమికి మెజారిటీ సీట్లు రావొచ్చు. అదే JDU+ BJP+ LJP కూటమికి దాదాపుగా 39 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలుపు సాధ్యమవుతుంది. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో NDA కూటమి 53.25% ఓట్లు సాధించింది.

మహాగట్భందన్ (I.N.D.I.A అని పిలవడం హాస్యాస్పదంగా ఉంటుంది) 31% ఓట్ షేర్ పొందింది. బీహార్ లో CPIML కి కనీసం 5 స్థానాలలో ప్రత్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేసే శక్తి ఉంది. కాబట్టి తేలికగా తీసుకోకూడదు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో బీహార్ లోని 40 స్థానాలలో పోటీ చేసిన NDA 38 సీట్లని గెలుచుకుంది.

కేవలం మూడు చోట్ల మాత్రమే 50 వేల మెజారిటీ వచ్చింది మిగతా 35 సీట్లలో రెండు లక్షలకి పైగా మెజారిటీతో NDA గెలిచింది. కాబట్టి నితీష్ కుమార్ మహాగట్భంధన్ తో కలిసి పోటీ చేయడం NDA కి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తుంది.

**********

మోడీజీ, అమిత్ షాల ఆందోళనకి అర్థం ఉంది! కానీ అదృష్టం లాలూ ప్రసాద్ యాదవ్ రూపంలో బీజేపీ తలుపు తట్టింది. లాలూ ప్రసాద్ యాదవ్ కనుక JDU ను చీల్చడానికి ప్రయత్నించకపోతే నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపేవాడు కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ను ఇండి గ్రూపుకి కన్వీనర్ గా ప్రతిపాదించకుండా ఉండి ఉంటే నితీష్ కుమార్ కి అనుమానం వచ్చేది కాదు.

********
ఈ మొత్తం వ్యవహారంలో అమిత్ షా లాలూ ప్రసాద్ యాదవ్ మనుషుల కదలికల మీద నిఘా పెట్టి సమాచారం సేకరించడం అనేదే కీలకంగా మారింది. గత నాలుగు నెలల్లో అమిత్ షా 8 సార్లు ఫోన్ చేశారు నితీష్ కుమార్ కి. ఫోన్ చేసింది కేవలం జేడీయు ఎమ్మెల్యేలు లాలూ ప్రసాద్ యాదవ్ మనుషులు కలిసిన సందర్భాలలో.

మొదట అమిత్ షా తనని ఇండి కూటమి నుండి బయటకి తీసుకురావటానికే అని అనుమానించారు నితీష్ కుమార్. కానీ ఎందుకైనా మంచిదని తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేత క్రాస్ చెక్ చేయించిన తర్వాత అమిత్ షా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే అని నిర్ధారించుకుని తనంత తానే బీజేపీతో చేతులు కలిపాడు!

*********
ఇండి కూటమి వ్యవహారాలతో తనని తలమునకలు అయేలా చేసి బీహార్ ను తమ గుప్పెటలోకి తీసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పన్నిన వలలో పడకుండా అమిత్ షా కాపాడాడు! ప్రధాని కావాలన్న తన కోరికను పక్కన పెట్టి తన స్వరాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నిమగ్నం అయ్యాడు నితీష్!

So! 40 పార్లమెంటరీ స్థానాలు ఉన్న కీలకమయిన బీహార్ రాష్ట్రాన్ని బీజేపీ ఎలా వదులుకుంటుంది? అందులోనూ గత ఎన్నికలలో 40 కి గాను 39 సీట్లను గెలుచుకున్న బీహార్ ను కాపాడుకోవడం బీజేపీకి అనివార్యం! మన వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టుకోవాలి! మనల్ని కాదని వెళ్లిన వాడితో చేతులు కలపడం దేనికి? అంటూ శుష్క వాదన చేయడం అవివేకం!

*********
అమిత్ షా తన ఇంటెలిజెన్స్ అధికారులకి స్వేచ్చ ఇస్తారు కాబట్టి సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. తనకి సంతోషం కలిగించే వార్తను ఇవ్వవద్దని, ఉన్నది ఉన్నట్లుగా రిపోర్టు చేయమని కోరతారు. తెలంగాణ విషయంలో కావొచ్చు, బీహార్ విషయంలో కావొచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్టు చాలా ఖచ్చితంగా ఉంది. ఇక్కడ వాస్తవం ఏదయితే ఉందో దానిని అంగీకరించడం విజ్ఞత…

కెసిఆర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు. నితీష్ కుమార్ నష్టం కలగకముందే గ్రహించాడు. రెండు చోట్లా అమిత్ షా సందర్భోచితంగా వ్యవరించారు. మనం పరీక్ష రాసే సమయంలో మన ఉపాధ్యాయులు ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం!
1. ముందు నీకు సమాధానం తెలిసిన ప్రశ్నలకి వేగంగా జవాబులు వ్రాయాలి!
2. తరువాత కొంచెం అవగాహన ఉన్న ప్రశ్నలకి సమాధానాలు వ్రాయాలి. కనీసం సగం మార్కులు అన్నా వస్తాయి.
3. సమయం ఉన్నంత వరకు తెలియని ప్రశ్నలకి సమాధానం వ్రాయడం చేయాలి. కనీసం ఒకటీ అరా మార్కులు వస్తాయి.
అమిత్ షాకి బీహార్ రాష్ట్ర పరిస్థితి తెలిసిన ప్రశ్నే కాబట్టి అక్కడ తన దృష్టిని కేంద్రీకరించి పనిచేశారు, వంద మార్కులు వస్తాయి. కర్ణాటక సగం జవాబులు తెలిసిన ప్రశ్న కాబట్టి పాస్ మార్కులు వచ్చాయి. తెలంగాణ జవాబు తెలియని (ఇంటెల్ రిపోర్టు ప్రకారం) ప్రశ్న కాబట్టి కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది.

**********
మాయావతి స్వంతంగా పోటీ చేస్తుంది ఎవరితో పొత్తు లేకుండా! మమత బెనర్జీ స్వంతంగా పోటీ చేస్తుంది బెంగాల్ లో! ఢిల్లీ,  పంజాబ్ లలో సీట్లు పంచుకునే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ చెప్పేశాడు. I.N.D.I. కూటమికి ఆద్యుడు నితీష్ కుమార్ దాని నుండి బయటకి వచ్చాడు! కర్ణాటకలో బీజేపీ, JDS కలిసి పోటీ చేస్తాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ తినగా మిగిలినవి తినాలి అఖిలేష్. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, NCP కలిసి పోటీ చేయడం జరుగుతుంది.

ఇంకెక్కడ ఇండియా కూటమి? గతంలో కంటే ఇంకో పది సీట్లు ఎక్కువే వస్తాయి… బీజేపీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కెసిఆర్ తనంత తానుగా బీజేపీతో కలిసి పోటీ చేయడానికి నితీష్ కుమార్ లాగే ప్రతిపాదిస్తాడు, ఇది జరిగి తీరుతుంది… కెసిఆర్, లాలూల విషయంలో బీజేపీ మౌనంగా ఉండిపోయింది! చాణక్య నీతి: నీ శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండు… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions