మహారాష్ట్ర… చెంబూర్ అనే ఓ సబర్బన్ ఏరియా… పిర్ పావ్ జెట్టీ… అక్కడ కొన్ని నెలల క్రితం ఒక పావురం అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది… మనకు దేశభద్రత మీద అవేర్‌నెస్ చాలా ఎక్కువ కదా… పురుగును కూడా దేశం సరిహద్దులు దాటి రానివ్వం కదా… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి కాందిశీకులు, బర్మా నుంచి రోహింగ్యాలు వస్తున్నారంటే, సరే, అది వేరే విషయం…
రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) పోలీసులు తెలివిగా, చాకచక్యంగా ఆ పావురాన్ని పట్టేసుకున్నారు… దాన్ని పరిశీలించి నివ్వెరబోయారు… దాని కాళ్లకు అల్యూమినియం రింగ్స్ కనిపించాయి… దాని రెక్కల దిగువ భాగంలో చైనీస్ (మాండరిన్) భాషలో ఏవో అక్షరాలు కూడా ఉన్నాయి… హమ్మ, చైనావాడూ… నువ్వు పావురాల్ని సమాచార డ్రోన్లుగా, గూఢచార్లుగా వాడుతున్నావా..? నీ దుంపతెగ అనుకున్నారు… కస్టడీలోకి తీసేసుకున్నారు…
అక్కడ The Bai Sakarbai Dinshaw Petit Hospital అనే ఓ వెటర్నరీ హాస్పిటల్‌లో పెట్టారు… తప్పదు కదా, ఎవరింట్లోనూ కట్టేయలేరు… ఠాణాల్లో అసలే వీలు కాదు… తప్పించుకుపోతే ఎవడి ఉద్యోగం పోతుందో తెలియదు కదా, అసలే దేశభద్రత వ్యవహారం… అందులోనూ చైనావాడి గూఢచర్యం… పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు… దర్యాప్తు ప్రారంభించారు… RAW, మిలిటరీ ఇంటలిజెన్స్, NIA ఎట్సెట్రా ఏవేవో సంస్థలు దర్యాప్తు చేశాయి కావచ్చు…
Ads
నిజమేమిటో తెలుసా..? పోలీసులు పెట్టే అనేకానేక తప్పుడు కేసుల్లో అదీ ఒకటిట… వాళ్ల అనుమానాలే ఆధారరహితాలట… ఫాఫం, ఏ జంతు కారుణ్య సంస్థలూ పట్టించుకోలేదు… చివరకు పౌరహక్కుల సంఘాలు కూడా పావురం పౌర జాబితాలోకి రాదు కాబట్టి మాకక్కర్లేదుపో అనేశారట,.. ఛార్జిషీటు వేయరు, కోర్టులో ప్రవేశపెట్టరు… దానికి ఏ కపిల్ సిబల్ కూడా దొరకలేదు… దాని భాష, దాని గోస మనకు అర్థం కాదు…
ఎట్ లాస్ట్ చివరాఖరికి ఎవరో పోలీసాయన ఆ పావురాన్ని చూసి, ఠాట్ ఇంకెన్నాళ్లు ఉంచాలి దీన్నిక్కడ, డిస్పోజ్ చేయాలి కదా అనుకున్నాడట… తనే కొన్ని వివరాలు గట్రా ఇంటర్‌నెట్‌లో చూశాడు… చదివాడు… చివరకు అది చైనా గూఢచారి పావురం కాదు… తైవాన్‌లో నీళ్లలో జరిగే రేసుల్లో పాల్గొనే పావురం అని తెలుసుకున్నాడు… ఆ పోటీల్లో ఎగిరీ ఎగిరీ అది హద్దులు కూడా దాటేసి ఇండియా హద్దుల్లోకి వచ్చి, దారి తప్పి, ఎటుపోవాలో తెలియక అటూఇటూ తిరుగుతుంటే మన పోలీసులు పట్టేసుకున్నారట…
ఎహె, దాన్ని వదిలేయండి అన్నాడుట… నో, నో, అధికారికంగా మా దగ్గర పెట్టారు, వదిలేస్తే మమ్మల్ని బుక్ చేస్తారు అని హాస్పిటల్ వాళ్లు హఠం వేశారట… అబ్బా, మీతో ఇదో తల్నొప్పి అనుకుని సదరు పోలీసాయన అధికారికంగానే ‘నిరభ్యంతర పత్రం’ ఇస్తే, అప్పుడు అది ఆరోగ్యంగానే ఉంది, పోలీసులు చెబితేనే వదిలేస్తున్నాం అని రాసుకుని, ఆ పావురాన్ని వదిలేశారు… హమ్మయ్య, ఈ ఇండియా పోలీసుల చేతికి మళ్లీ జన్మలో దొరకొద్దు అనుకుని అది స్వేచ్ఛగా ఎగిరిపోయింది… కేసు మూసేశారు… ష్, కాంగ్రెసోళ్లకు, కమ్యూనిస్టోళ్లకు ఇంకా ఈ విషయం తెలియదుట… మీరూ చెప్పకండి…దేశభద్రత మీద ఏమిటీ నిర్లక్ష్యం అని మీడియాకు ఎక్కగలరు… ఏమో, మన చైనా పావురమే కదా అనుకుని వాళ్లూ వదిలేసేవాళ్లేమో…!!
Share this Article