తెలుగు జర్నలిస్టుగా ఇవ్వాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలర్ ఎగరేశాడు… ఎహె, ఒంటినిండా పచ్చరంగు పులుముకుని, చంద్రబాబు చేతిలో మైకు, తనకిష్టం వచ్చింది రాసే తనకు ఈ అభినందన ఏమిటంటూ చాలామందికి చిర్రెత్తొచ్చు… కానీ నిజమే… వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సంబంధించి మొట్టమొదట వార్త రాసి, రెండు తెలుగు రాష్ట్రాలకూ ‘సమాచారం’ అందించిన మొదటి జర్నలిస్టు తనే… ఓనర్ కమ్ రిపోర్టర్ కమ్ కాలమిస్ట్… 9న పార్టీ యాక్షన్ స్టార్టవుతుందని రాసిందీ తనొక్కడే… రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కారణాలతో ఎవరి కొమ్ముకాసినా సరే, జర్నలిస్టిక్ టెంపర్మెంట్ చూపిస్తున్నది తనే… తను చెప్పిందే నిజమైంది… #RKisRight… అయితే మరో రెండుమూడు విషయాలు ఓసారి చెప్పుకోవాలి…
జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ ముఖ్యమైన డెవలప్మెంట్ దొరికింది కదా… జగన్‌ను ఉతికి ఆరేయొచ్చు అనే దురభిలాషతోనే రాధాకృష్ణ ఈ వార్తను మొదట పబ్లిష్ చేసిన మాట నిజం… తన ప్రతి వాక్యంలోనూ జగన్ మీద ఆ కసి కనిపించాల్సిందే… అందుకే చెల్లెకూ, అన్నకూ పడటం లేదు, అందుకే కొత్త పార్టీ పెడుతోంది అని రాసుకొచ్చాడు… నిజానికి అసలు కథ వేరు, అదొక వ్యూహం… ఆ జగన్నాటక సూత్రధారిని, ఆ ఎత్తుగడనూ రాధాకృష్ణ అర్థం చేసుకోలేదు… అన్నాచెల్లెళ్లకు నడుమ చిచ్చు మొదలైంది, అందుకే షర్మిల కొత్త పార్టీ పెడుతోంది అనే ఓ అబద్ధపు ప్రచారమే తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలి, అదీ జగన్, తన వెనుక ఉన్న బీజేపీ పెద్దల ప్లాన్… అనుకోకుండా ఆంధ్రజ్యోతి కూడా దాన్నే జనంలోకి తీసుకెళ్లింది…
Ads
నిజానికి తెరవెనుక జరుగుతున్నది వేరే, బయటికి కనిపించేది వేరే, ఏదో తేడా కొడుతున్నదీ అనే విషయం కాస్త ఆలస్యంగా తెలిసి, ఆంధ్రజ్యోతి కూడా మళ్లీ షర్మిల పార్టీ వార్తల జోలికి పోలేదు… వదిలేసింది… కానీ నిన్న పొద్దున్నే ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… అంతకుముందురోజు వైవీ నేరుగా తెలంగాణ సంబంధ నాయకులతో భేటీ జరిపిన విషయం, 9 నుంచి షర్మిల తన కార్యాచరణను స్టార్ట్ చేయబోతున్న విషయాన్ని చెప్పింది… పార్టీ ఏర్పాటు వెనుక రాజకీయ ఉద్దేశాలేమిటో కూడా వివరించింది… దీంతో తెలుగు జర్నలిస్టులు అలర్టయ్యారు… మరి రాధాకృష్ణకు ఉన్న పాత్రికేయ స్పృహ మిగతా పత్రికలు, టీవీలకు ఎందుకు లేదు..? ఏ పార్టీ రంగు పూసుకున్నా, షర్మిల కొత్త పార్టీ అనేది ఒక వార్తే కదా… అది రాయతగిన వార్త కాదా..? ఎందుకు ఇగ్నోర్ చేసినట్టు..? ఇక్కడ జనం పకపకా నవ్వుతున్నది ఈనాడును చూసి…!
అసలే ఈమధ్య ఈనాడు రంగురుచివాసనచిక్కదనం ఏమీ లేని పత్రిక అయిపోయింది… ఇన్నిరోజులూ ఏమీ రాయకపోయినా సరే, ఈరోజు షర్మిల పార్టీ ఏర్పాటు అనేది పాఠకులకు చెప్పాల్సిన వార్తే కదా… ‘‘వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశం’’ అని ఓ రీతిలేని రాత వదిలింది ఈనాడు… అసలే వైఎస్ కుటుంబం అంటే ద్వేషం… అయితేనేం..? ఒక వార్తను దాచి ఉంచలేదు కదా… రాధాకృష్ణలాగా బట్టలు చించుకోనక్కర్లేదు కానీ ప్రొఫెషనల్‌గా జనానికి సమాచారం అయినా ఇవ్వాలి కదా… సర్లెండి, ఈనాడు తాజా పాత్రికేయం గురించి చెప్పుకోవడం స్పేస్ దండుగ…
మరి సాక్షి…! ఎప్పుడూ చెప్పుకునేదే కదా… దానికి ఓ డైరెక్షన్ లేదు, దాని పయనం ఏమిటో దానికే తెలియదు… మామూలు రోజుల్లోనే ‘మా రాత, మీ ఖర్మ’ అన్నట్టుగా పాఠకులంటే పరమ తేలికభావన దానికి..! ఇక షర్మిల కొత్త పార్టీ సంగతికొస్తే… ఆమె జగన్‌ను విభేదించి కొత్త పార్టీ పెడుతోంది అని జనంలోకి వెళ్లాలి, సాక్షిలో పాజిటివ్ వార్తలొస్తే జగన్ ఈ పార్టీ వెనుక ఉన్నాడనే సంకేతాలు వెళ్తాయి, నెగెటివ్ రాయలేరు… అందుకని మూసుకుని అసలు వార్తే రాయకుండా వదిలేసింది… ఈరోజు జనంలో చర్చనీయాంశంగా ఉన్న ఓ రాజకీయ పరిణామంపై ఒక్క ముక్క రాయలేని దురవస్థ నంబర్ టూ పత్రికది..! ఇంగ్లిషు పత్రికలు నయం… వార్తను వార్తలా చూశారు… అంతే… మిగతా తెలుగు పత్రికల గురించి అంటారా..? వద్దులెండి…!!
Share this Article