సిరియన్ క్రైస్తవ మహిళలకు ఆస్తిలో హక్కేదీ..? కేరళకు చెందిన పి.వి.ఐజాక్, సుసీ ఐజాక్ దంపతులది సిరియన్ క్రైస్తవ కుటుంబం. వారికి నలుగురు పిల్లలు. అందులో ఒకరు మేరీ రాయ్. దిల్లీలో పెరిగిన మేరీ మద్రాసులో డిగ్రీ పూర్తి చేసి, కొలకతాలో ఒక కంపెనీలో సెక్రటరీగా చేరారు. అక్కడే రాజీవ్ రాయ్ అనే బెంగాలీ హిందూను పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో గృహహింసకు గురైన ఆమె అతనికి విడాకులు ఇచ్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు మనందరికీ తెలిసిన ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్. మరొకరు లలిత్ రాయ్.
భర్తతో విడిపోయిన తర్వాత ఊటీలో తన తండ్రికి చెందిన ఇంట్లో మేరీ నివాసం ఉన్నారు. 1960లో ఆమె తండ్రి పి.వి.ఐజాక్ మరణించారు. ఊటీలోని ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆమె పెద్దన్న జార్జి ఐజాక్ ఆమెను ఒత్తిడి చేశాడు. గూండాల చేత బెదిరించాడు. వెళ్లడానికి మరో చోటు లేని ఆమె కొట్టాయంలో తన తండ్రికి చెందిన 75 సెంట్ల స్థలంలో తనకు వాటా కావాలని కోరింది. దానికి జార్జి నిరాకరించాడు. అప్పటికి కేరళలో Travancore Christian Succession Act of 1916 అమల్లో ఉంది. దాని ప్రకారం 1916 కంటే ముందుగా కేరళకు వచ్చి స్థిరపడ్డ సిరియన్ క్రైస్తవ కుటుంబాల్లో మహిళలకు ఆస్తిలో వాటా రాదు. వారికి కేవలం నామమాత్రపు స్త్రీ ధనం మాత్రం దక్కుతుంది. దీంతో మేరీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. ఆస్తిలో తనకు సమాన వాటా రావాలని కోరారు. కానీ కింది కోర్టు ఆమె కేసును కొట్టేసింది. సిరియన్ క్రైస్తవ మహిళలకు ఆస్తిలో వాటా రాదని తేల్చేసింది.
మేరీ పట్టుదల వీడలేదు. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం తనకు అందించిన సమానత్వ హక్కును కాపాడాలని కోరారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ఆమె అన్న జార్జ్ నుంచి వేధింపులు ఆగలేదు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. జస్టిస్ పి.ఎన్.భగవతి నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. మేరీ రాయ్ తరఫున ఇందిరా జైసింగ్ వాదించారు. 1986లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేరళలోని ట్రావెన్‌కోర్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని, అలాంటప్పుడు 1951 తర్వాత Travancore Christian Succession Act చెల్లదని తీర్పు ఇచ్చింది. కానీ ఈ కేసులో నెలకొన్న లింగవివక్ష(Gender Discrimination) గురించి వారు ఏమీ పేర్కొనకపోవడం గమనార్హం. అప్పటిదాకా ఇలాంటి వివాదాలతో సతమతమయ్యే వారికి ఈ తీర్పు ఊరటనిచ్చింది.
Ads
ఆ తర్వాత కూడా మేరీ రాయ్‌కి ఆస్తి దక్కలేదు. తనకు రావాల్సిన వాటా కోసం ఆమె కొట్టాయం జిల్లా కోర్టును ఆశ్రయించగా, తల్లి బతికి ఉన్నంత వరకూ ఆస్తి పంచడం కుదరదని వాళ్లు తేల్చి చెప్పారు. తండ్రి మరణించాక ఆ ఆస్తికి తల్లినే యజమాని అవుతుందని, ఆమె మరణం తర్వాతే పంపకాలు చేపట్టాలని తెలిపింది. 2000లో మేరీ రాయ్ తల్లి మరణాంతరం మరోమారు ఆమె కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం 2009లో ఆమెకు ఆస్తిలో వాటా పంచారు. రూ.2 కోట్ల విలువైన ఆస్తిని ఆమె స్వచ్ఛంద సంస్థలకు రాసి ఇచ్చారు.
మేరీ రాయ్ తన అన్నల మీద కేసు వేసినప్పుడు అప్పటి సిరియన్ క్రైస్తవ సమాజానికి అదొక వింత విషయంగా తోచింది. తమ కుటుంబాల్లో మహిళలకు ఆస్తిలో వాటా వస్తుందని వారికి నమ్మకం లేదు. మేరీ లాంటి సమస్యతోనే పలువురు ఇబ్బంది పడుతున్నా, వారెవరూ ఇలా కేసులు వేయలేకపోయారు. విచిత్రమేమిటంటే, మేరీ సోదరి మోల్లీ సైతం ఈ కేసు పట్ల వ్యతిరేక భావంతోనే ఉన్నారు. సిరియన్ క్రిస్టియన్ మహిళ ఆస్తిలో వాటా కోరకూడదనే భావనతోనే మెలిగారు. అలెయ్‌కుట్టి చాకో అనే మరో మహిళ మాత్రం మేరీతోపాటు ధైర్యంగా కేసు వేసి, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పోరాడారు. సిరియన్ క్రైస్తవ మహిళల హక్కుల్ని కాపాడారు. వారి ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ‘Mary Roy Verus The State Of Kerala 1986’ పేరిట ఈ కేసు ప్రాధాన్యం పొందింది. స్త్రీలకు సమాన హక్కులు అందించే విషయంలో మార్గదర్శకంగా నిలిచింది.
1961లో కొట్టాయంలో ‘Corpus Christi’ అని సొంతంగా పాఠశాల ప్రారంభించిన మేరీ రాయ్ అనంతరం దాని పేరు ‘పళ్లికూడం’గా మార్చారు. తాను బడి పెట్టడానికి స్థలం కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చినప్పుడు ప్రముఖ మలయాళ రచయిత్రి కమలాదాస్ ఆమెకు ఉత్తరం రాశారు. మీకు అందమైన, ప్రశాంతమైన స్థలం చూపిస్తానని అన్నారు. ఆ తర్వాత చివరి దాకా వారి మధ్య స్నేహం కొనసాగింది. ఐదు దశాబ్దాల పాటు మేరీ ఆ స్కూల్ బాధ్యతలు చూశారు. 2022 సెప్టెంబర్ 1న 89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. తనకు బుకర్ ప్రైజ్ అందించిన ‘The God of the Small Things’లో ధైర్యం, పట్టుదల కలిగిన అమ్ము పాత్రకు తన తల్లి మేరీ రాయే ప్రేరణ అని అరుంధతి పలు సందర్భాల్లో తెలిపారు… – విశీ
Share this Article