సైట్ పేరు దేనికిలే గానీ… ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… పద్మ పురస్కారాలు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు చేసింది కదా… ఇకపై ఆ పురస్కారం వస్తే 25 లక్షల నగదు బహుమతి, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామనీ రేవంత్ రెడ్డి చెప్పాడు… సరే, ఆ ప్రకటనల మీద కూడా భిన్నాభిప్రాయాలున్నా, కాసేపు పక్కన పెడదాం… సదరు వార్త ఏం చెబుతున్నదంటే…
‘‘పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మరాయి. చిరంజీవి ఏమన్నారంటే.. “ఎక్కడైతే కళాకారులు సత్కరించబడతారో, గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కళాకారులకు అవార్డు వచ్చిందంటే ఓ ప్రభుత్వం స్పందించడం, వాళ్లని సత్కరించడం గతంలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే జరిగింది. మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే దీనంతటికీ కారణం. మనవాళ్లను మనం సత్కరించుకోకపోతే ఎలా అని వాళ్లు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. కళాకారులకు కొత్త ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను చూస్తే నా మనసు పులకించిపోతోంది”.
“గతంలో నంది అవార్డులు ఇచ్చుకున్నాం. కానీ తర్వాత, తర్వాత ఇరు రాష్ట్రాల్లో అది గత చరిత్రలా అయిపోయింది. ఆ విషయంలో మా అందరికీ అసంతృప్తి ఉంది. కళాకారులను ఇంతలా ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు అనిపించేది. అవార్డులు ఇవ్వడం అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అవార్డులతో ప్రోత్సహిస్తే కళాకారులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. సినిమారంగం, నాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీన్ని ఈనాటి ప్రభుత్వం గుర్తించింది. అందుకే నంది అవార్డులను మళ్లీ పునరుద్ధరించింది. అదికూడా పాటే ప్రాణంగా బతికిన ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు మీద అవార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం నిజంగా అభినందనీయం. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక అభినందనలు” అన్నారు చిరంజీవి…
Ads
ఈ వార్త రాస్తూ… జగన్, కేసీయార్‌లపై చిరంజీవి పంచులు అని హెడింగ్ పెట్టారు… నిజంగానే చిరంజీవి పెద్దగా రాజకీయ వివాదాల్లోకి రాడు… పైగా కేసీయార్, జగన్ ప్రభుత్వాలతో కూడా చాన్నాళ్లు సత్సంబంధాలే మెయింటెయిన్ చేశాడు… పవన్ కల్యాణ్‌కు ప్రతిగా తనను రంగంలోకి దింపాలని జగన్ కూడా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి తను కూడా సాదరంగానే వ్యవహరించాడు… ఐనాసరే, నా తమ్ముడు, తనకు ఓ అత్యున్నత పదవి అనే భావన నుంచి చిరంజీవి పక్కకు జరగలేదు… అందుకే చిరంజీవి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, మొన్నటి తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకీ విమర్శలు చేశాడు పరోక్షంగా… ఇదీ సదరు సైట్ రిపోర్టర్ విస్మయం… చిరంజీవి సరే… రేవంత్ సర్కారు ఎందుకీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది…?
వెంకయ్యనాయుడేమో బీజేపీ… జీవితమంతా అదే పార్టీ… కొన్నేళ్లు చంద్రబాబు పార్టీకి గౌరవ సలహాదారుగా, శ్రేయోభిలాషిగా వ్యవహరించినా… తను బీజేపీ పార్టీ మాత్రం మారలేదు… కానీ తనను పిలిచి సన్మానించిన రేవంత్ రెడ్డేమో కాంగ్రెస్… ఆ రెండు పార్టీలకు పడదు… అఫ్‌కోర్స్, ఇప్పుడు వెంకయ్యనాయుడు రాజకీయాల్లో లేకపోయినా సరే… భావవైరుధ్యం అలాగే ఉంటుంది కదా… సాటి తెలుగువాడు, పద్మ పురస్కార గ్రహీత అనేదే కామన్ పాయింట్… సరే, రేవంత్ తన పొలిటికల్ కెరీర్ మొదట్లో కాషాయం క్యాంపే, అది వేరే సంగతి…
అలాగే చిరంజీవి అసలు రాజకీయాల్లోనే లేడు… కాకపోతే తన తమ్ముడిని ఉన్నత స్థానంలో చూసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి జనసేన శ్రేయోభిలాషి… సో, రేవంత్ పొలిటికల్ ఫాయిదా ఏమీ ఆలోచించకుండానే చిరంజీవిని సన్మానించాడా..? తను కళామతల్లి ముద్దుబిడ్డ అనుకుని గౌరవించాడా..? నెవ్వర్… పొలిటిషియన్ ఏం చేసినా దానికి ఓ లెక్క ఉంటుంది… చిరంజీవి పట్ల కాపుల్లో ఈరోజుకూ మంచి అభిమానం ఉంది… వెంకయ్యనాయుడికి కమ్మల్లో మంచి ఫాలోయింగ్ ఉంది… (పోనీ, అలా వాళ్లు అనుకుంటున్నారు)…
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సెటిలర్లు మొన్నటి ఎన్నికల్లో కేసీయార్‌కే జై అన్నారు… రేవంత్ చంద్రబాబు మనిషి కాబట్టి, పైగా కాంగ్రెస్ నాయకుడు కాబట్టి, చంద్రబాబుకు ప్రత్యర్థి జగన్ కాబట్టి… ఇక్కడ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్మేతర సెక్షన్ వ్యవహరించింది… ఇక్కడ రేవంత్ ‘రెడ్డి’కన్నా… జగన్ ‘రెడ్డి’ మాత్రమే కనిపించాడు… రాబోయే లోకసభ ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో మంచి రిజల్ట్ కావాలి… సో, సెటిలర్స్ వోట్లు కావాలి…
కమ్మ వోట్లు బలంగా ఆర్గనైజ్ కావాలి… అది కావాలంటే వెంకయ్యనాయుడు కావాలి, వెంకయ్యనాయుడికి చంద్రబాబు దాదాపు కవలసోదరుడు… చంద్రబాబుకు రేవంత్ వీరాభిమాని… సో, వెంకయ్యను సన్మానించడం అంటే రేవంత్ తనను తాను సన్మానించుకోవడమే… మరి చిరంజీవి..? కాపు వోట్లు కావాలి రేవంత్‌కు… ఎలాగూ తన పాత బాసు చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అవసరముంది… పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి… సో, రేవంత్‌కూ చిరంజీవి పక్కా శ్రేయోభిలాషి… అందుకే రేవంత్ వాళ్లను సన్మానించినా… కేసీయార్, జగన్ ప్రభుత్వాలను చిరంజీవి విమర్శించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు… ఎవరి లెక్కలు వాళ్లకున్నయ్… ఎందుకంటే… వాళ్లు పొలిటిషియన్స్…!!
Share this Article