జనం సాక్షి అనే ఓ తెలంగాణ పత్రికలో ‘నయీం డైరీని ఓపెన్ చేస్తారా’ అని ఓ స్టోరీ కనిపించింది… రేవంత్ సర్కారు పాత అరాచకాలన్నీ తవ్వుతోంది కదా, అలాగే సెన్సేషనల్ నయీం ఎన్‌కౌంటర్, తన అక్రమాలన్నీ రాసిపెట్టుకున్న డైరీలు, ఆ ఆస్తుల బాగోతాలను కూడా తవ్వి తీస్తుందా..? నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటారా అనే కోణంలో సాగిన స్టోరీ ఇది… చదవగానే అనిపించేది ఏమిటంటే..? నిజమే కదా… కేసీయార్ సర్కారు ఆ రహస్యాలన్నీ ఎందుకు పాతిపెట్టింది..? అపారమైన నయీం ఆస్తులన్నీ ఏమైపోయాయి అని..!
నో డౌట్… నయీంను పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు వాడుకోవడం ఆయా సర్కిళ్లలో బహిరంగ రహస్యాలు… తనకు ఎదురే లేదన్న తలబిరుసుతో పెద్ద తలకాయల జోలికి వెళ్లి ఎన్‌కౌంటర్ పాలయ్యాడు… అప్పట్లో అది సెన్సేషన్… తన రహస్య స్థావరాల్లో దొరికిన నగదు, నగలు, ఆస్తుల కాగితాల మీద బొచ్చెడు వార్తలు వచ్చేవి… నయీం డైరీల్లో ఇలా ఉందట, అలా ఉందట అనే గాసిప్స్ కూడా వచ్చేవి… కానీ ఆ సంపద ఎవరి చేతుల్లోకి పోయింది..? ఆ డైరీలు చెప్పిన నిజాలేమిటి..? తన అరాచకాలు ఈ రాష్ట్రమే గాకుండా ఇతర రాష్ట్రాల గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌లోనూ విస్తరించాయా..? ఈ ప్రశ్నలకు జవాబులే లేవు… ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్… కొన్నాళ్లయ్యాక ఇంకేదో సెన్సేషన్ మీద మీడియా దృష్టి, ఇక నయీం సంగతిని అందరూ మరిచేపోయారు…
Ads
నిజమే… నయీం బాధితుల సంఖ్యకు లెక్కే లేదు… నయీం అరాచకాల కథలన్నీ బయటపడితే, తన సంపద నుంచి బాధితులకు ఏమైనా సాయం దక్కితే మంచిదే… అయితే సాధ్యమేనా..? ఇదీ ప్రశ్న… ఎందుకంటే..? సమాజంపై విరుచుకు పడిన కాష్మోరా వంటి క్షుద్రశక్తిని మళ్లీ సమాధిని తవ్వి బయటికి తీయడాన్ని ఏ పాలకుడు కోరుకుంటాడు..? అందుకే నయీం గురించి తరువాత కాలంలో బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా మాట్లాడలేదు…
అప్పట్లో నయీం ఎన్‌కౌంటర్ ప్లాన్ చేసి, పక్కాగా, పర్‌ఫెక్ట్‌గా, సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించిన కీలక పోలీస్ అధికారిని కేసీయార్ తరువాత కాలంలో ఎందుకు దూరం పెట్టాడు..? అదీ ఓ మిస్టరీయే… నిజానికి ఆ అధికారికే మరింత స్వేచ్ఛ ఇచ్చి, మొత్తం కథలన్నీ బయటపడేలా చేసి ఉండాలి కదా… ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చాక అదే ఉన్నతాధికారి మళ్లీ కీలక స్థానంలోకి వచ్చాడు… సో, నయీం కథలో అసలు మలుపులు, అసలు నిజాలు రేవంత్‌కు కూడా తెలిసే ఉంటాయి… ఒకవేళ తెలియకపోయినా, తెలుసుకోవాలని అనుకుంటే తెలుసుకోవడం ఎంతసేపు..?
ఐతే నయీం మిస్టరీలన్నీ బయటికి తీయడం వల్ల రేవంత్‌కు ఫాయిదా ఏమిటి..? పొలిటికల్‌గా ఏమీ ఉండదు, పైగా హైదరాబాద్ హైలెవల్ ఎన్‌లైటెన్ సెక్షన్‌కు ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు… నయీం డైరీలు, నయీం మరణం తరువాత తన ఆస్తుల కథలోని చీకటి కోణాల్ని, చేదు నిజాల్ని గనుక బయటపెడితే తన ప్రత్యర్థి గులాబీ శిబిరానికి నష్టం అని గనుక భావిస్తే, నమ్మితే రేవంత్ దాన్ని తవ్వడం పెద్ద సమస్యేమీ కాదు… ఏదో గతం గతః అని వదిలేస్తే నయీం చరిత్ర కాలగర్భంలోకి జారిపోవడమే ఇక..!! చివరగా… నయీంను మించి తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లెందరో… ఉదాహరణకు రెరా బాలకృష్ణుడి వేల కోట్ల అక్రమాలు, ఆస్తుల తవ్వకాలు చదువుతున్నాం కదా… తన వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవ్వరివి..? అలాంటోళ్ల పని పట్టాలి కదా ఇప్పుడు..!!
Share this Article