మైండ్ ఫుల్ ఈటింగ్……. శ్లోకం:- “అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం”
భావం :- మనం తినే ఆహార పదార్థాలన్నీ మన ఉదరంలోని జఠరాగ్ని(వేడి) పచనం(గ్రైండ్)చేసి , మనకు పుష్టి కలిగిస్తుంది. తిన్నది జీర్ణం చేయడానికి ఆయనే వైశ్వానరాగ్ని(జఠరంలో ఉన్నది కాబట్టి జఠరాగ్ని )అయి జీర్ణం చేస్తున్నాడు.
ప్రాణ అపానాది ఐదు వాయువులే ఐదు అగ్నులౌతాయి. —ఈ పచన కార్యానికి ప్రాణ వాయువు, అపాన వాయువు చేరువౌతాయి.
-భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ
Ads
ఈ గీతా శ్లోకాన్నే అన్నమయ్య అనన్యసామాన్యమైన కీర్తనగా తేట తెలుగులో తీర్చి దిద్దాడు.
పల్లవి:-
అనియానతిచ్చె కృష్ణుడర్జునునితో
విని యాతని భజించు వివేకమా!
చరణం-1
భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడ నేను;
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను.
చరణం-2
దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను;
ఏపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను.
చరణం-3
వేదము లన్నటిచేత వేదంతవేత్తలచే
ఆది నే నెరగతగిన ఆ దేవుడను;
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను.
“లక్షాధికారైనా లవణమన్నమె కానీ…మెరుగు బంగారం మింగబోడు”
అని కవి శేషప్ప నృసింహ శతకంలో అన్నాడు.
శ్రీకృష్ణుడు చెప్పినా, అన్నమయ్య చెప్పినా…మనం సంపాదించుకున్న అన్నం మనమే తింటున్నాం అని అనుకుంటాం తప్ప…ఆ అన్నం పుట్టించింది దేవుడు…కడుపులో అన్నం కరిగించే వేడి దేవుడు…అన్నం కరిగి బలంగా మన ఒంట్లో నిలబెట్టింది దేవుడు అంటే ఒప్పుకోము.
తగినంత తినకపోవడం, వేళకు ఎంత కావాలో అంతే తినడం, పీకల దాకా తినడం, అరగని నానా చెత్త తినడం…ఇలా రకరకాల ఆహారపుటలవాట్లు. వేళకు తిండి దొరక్క ఆకలితో అలమటించే అభాగ్యులున్నట్లే…తిన్నది అరక్క అలమటించే దుర్భాగ్యులు కూడా ఉంటారు.
ఉద్యోగుల ఆహారపుటలవాట్ల మీద పెద్ద పెద్ద ప్రయివేటు కంపెనీలు ఒక కన్ను వేయాల్సిన రోజులొచ్చాయి. ఆఫీసు క్యాంటీన్లలో ఫ్రీగా ఫుడ్డు దొరుకుతోందని ఎంతపడితే అంత తినడం; ప్లేట్ల నిండా కొండల్లా అన్నాలు పేర్చుకుని నాలుగు మెతుకులు తిని మిగతాదంతా పడేయడంతో కంపెనీలు దీని మీద దృష్టి సారించాల్సి వచ్చిందట. దాంతో “మైండ్ ఫుల్ ఈటింగ్” అనే కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయట.
“నిన్న ఈ క్యాంటీన్లో తిన్నది ఇన్ని క్వింటాళ్లు; వృథాగా పడేసింది ఇన్ని క్వింటాళ్లు”
అని ఏ రోజుకారోజు బోర్డుల్లో రాసి పెడుతున్నాయి.
“తక్కువ తినకండి;
ఎక్కువ తినకండి;
తినలేనంత పెట్టుకుని ఒక్క మెతుకు కూడా పడేయకండి. ఎంగిలిచేసి మీరు పడేసిన
అన్నం మెతుకులు ఎన్నెన్ని కడుపులకు అవసరమై…అందకుండాపోయాయో ఆలోచించండి” అన్న అర్థంతో బోర్డులు రాసి పెడుతున్నారు.
నిజమే. మైండ్ ఫుల్ ఈటింగ్ మంచిదే. ప్రాణాన్ని నిలబెట్టే ఆహారం కుళ్లిపోయి, పాసిపోయి ఎవరికీ ఉపయోగపడకుండాపోవడం మీద ఫ్రీ ఫుడ్ అవకాశమున్న ప్రయివేటు ఉద్యోగులే కాదు…కడుపుకు అన్నం తినే ఎవరయినా ఆలోచించాల్సిందే…. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article