జయజయహే తెలంగాణ . కాల గమనంలో పాటలు కూడా ఆటుపోటులకు గురవుతాయి. గీతాలు తమ రీతులు మార్చుకుంటాయి.
తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఎన్.టి.ఆర్ తాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘తల్లా పెళ్లామా’ చిత్రాన్ని 1970 లో విడుదల చేశాడు. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్దేశిస్తూ’ సినారె’ గారితో ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అనే పాటను రాయించారు.
అనేక పోరాటాల పరిణామాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సమకాలీన పరిస్థితుల్లో ఆ పాట ఔచిత్యం గురించి సినారె గారిని అడిగితే వారు దానిదేముంది , ఇప్పుడా పాటను ‘ తెలుగు జాతి మనది, రెండుగ వెలుగు జాతి మనది’ అని పాడుకుంటే సరిపోతుంది అన్నారు.
Ads
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందీ అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ‘ ‘జయజయహే తెలంగాణ, జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా శాసనసభలో ఫిబ్రవరి నాలుగున అధికారికంగా ప్రకటించారు.
మలి దశ తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడినప్పుడు తెలంగాణ సహజ వాగ్గేయకారుడు అందెశ్రీ గారు తాను రాసి, బాణీ కట్టిన ఈ పాట ఒక ‘ మార్చింగ్ సాంగ్’ లాగా ఉద్యమ జ్వాలకు చమురు పోసింది. తెలంగాణ పోరు సమయంలోనూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనధికారికంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా నీరాజనాలు అందుకుంది.
అయితే ఈ పాటను తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా స్వీకరించడంలో రెండు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ రెండు కూడా అంకెలకు సంబంధించినవే కాబట్టి సవరించుకోవచ్చు. ఒక రాష్ట్ర గీతం అంటే చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే అందులో సార్వజనీనత, సార్వకాలీనత ఉండాలి.
అందెశ్రీ గారు ఈ పాట రాసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడున్నర కోట్లు. వచ్చే సంవత్సరాంతానికి అది నాలుగు కోట్లుగా ఉండబోతుంది. అట్లనే ఈ పాట రాసేనాటికి తెలంగాణాలో పది జిల్లాలు. నేడవి ముప్పై మూడు. భవిష్యత్తు మనకు తెలవదు.
ఇదే విషయాన్ని మేం ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మాయి ‘ స్ఫూర్తి’ అంకెలకు అతీతంగా; లయ, ప్రాసకు భంగం కలగకుండా ఆ గీతానికి చేసిన సూచనలు మీతో పంచుకుంటున్నాను. దీన్ని జాతీయగీతంలాగే పాడించి జనంలోకి విస్తృతంగా తీసుకుపోతే సరి…
‘జయజయహే తెలంగాణ
జననీ జయకేతనం
కోట్లాది గొంతుకలు
ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల
తల్లీ నీరాజనం
పలుజిల్లల నీ పిల్లలు
ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ… – గింజల మధుసూదన్ రెడ్డి
Share this Article