Paresh Turlapati……. (నేను రాసింది కాదు…వాట్సాప్లో వచ్చింది…మా బెజవాడ కదా అని ఇక్కడ పోస్టేసా.. రాసినవారికి అభినందనలు )
మా బెజవాడ
ఎంత మారి పోయింది
Ads
ఒకప్పటి బెజవాడలా లేదిది.
ఊరు మారిపోయింది .
దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు.
అన్నీ మార్పులే.
డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు.
పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెక్కడుందో తెలీట్లా.
వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ
గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు తగ్గిపోయి,
ఇపుడు రాజకీయ పోస్టర్లొచ్చీసినియ్.
మా నాయకుడు మా నేత అంటూ ఒకటే కులాల గోల. పెరిగింది
బందరులాకుల దగ్గరుండే కలప దుంగల కొట్టు తీసేసి అపార్టుమెంటు కట్టేసేరు.
పటమటలంక స్కూల్ బిల్డింగు పాతదైపోయింది,
రూపే మారిపోయింది.
దాంతో దానెనక ఉండే గ్రౌండులో కట్టిన స్కూలు “ఒక స్కూలు” లానే ఉంది తప్ప ఇదివరకట్లా కళ మాత్రం లేదు.
పాత బస్టాండ్ లో మాత్రం పార్కు లాగా కట్టారు పర్లేదు బాగానే ఉంది . ఊరెళ్ళితే ఏరా అని పిలడానికి మనతో చదివినోడెవడూ ఊర్లో లేడు.
ఉన్న ఆ కొంత మంది మాత్రం ఫోనుచేస్తేనే.. హలో అంటారు.
వాట్సప్ లో చూస్తుంటారు.
అంతెందుకు సినిమాహాల్లో సమోసా కొనే వాళ్ళ కన్నా,
కారన్ను, కోకుని, మోజుతో కొనేవాళ్ళే ఎక్కువ.
కొంతలో కొంత ఆనందం ఏంటంటే ఇంకా ప్రతివాడు చూసేది “సినిమానే..”
బెజవాడ జనం కూడా అలానే ఎళ్తన్నారు సినిమాకి.
ఆనాటి నుంచి..
ఈనాటి వరకు
ఎన్టీఆరైనా~ఏన్ఆరైనా
కృష్ణైనా~శోబనైనా
చిరంజీవైనా~మురళీమోహనైనా
బొమ్మ పడాల్సిందే..
చూసి తీరాల్సిందే..
ఇలా అన్ని రకాలు నడుస్తాయి.. కాకపోతే ఆనాడు ధియేటర్ల దగ్గర ఉండే సినిమా హాడావిడి ఇప్పుడు లేదు, ఆ నాటి రోజులే వేరు , ఆ కళే వేరు , ఆ ఉత్సాహం ….ఊహూం …రాదేమో…. డీవీఎస్ కర్ణ……
దానవీరశూర కర్ణ రిలీజ్ అయి 40 ఏళ్లు అయ్యింది ఆరోజు దుర్గకళా మందిరం దగ్గర అభిమానుల హడావిడి చూడటానికి రెండు కళ్లు చాలవేమో అనిపించేలా ఉండేది ఎన్టీవోడి కటౌట్లతో తాలూకా సెంటర్లో హడావిడి అదీ, ఈ రోజు జీ.పీ.ఎస్.కె. శాతకర్ణి కి అంత కళ కనపడలేదు మరి , .
రెండో ఆటకు ఇంతకు ముందులా రాత్రయితే “కిరసనాయిలు దీపం బుడ్డితో” సైకిల్లు వేసుకెళ్ళక్కరలేదు.
మా బెజవాడంతా రాత్రైనా పట్ట పగల్లా విద్యుద్దీప కాంతులతో వెలిగి పోతోంది కానీ మనుషుల జీవితాల్లో వెలుగు రాలేదని పించింది. సైకిలు రిక్షాలు పోయి సర్వీసు ఆటోలొచ్చేసినియ్యి. బెజవాడ రిక్షాల విలువలు తీసేశాయి.
రోడ్ల నిండా జనం,
తిరుగే వాళ్లు ఎక్కు వైపోయారు.
ట్రాఫిక్ పెరిగిపోయింది.
అప్పట్లో..
సాయంత్రమయితే బీసెంటురోడ్డు ~రవీంద్రకూల్ డ్రింక్స్ , అజంతా హోటల్ ,సాంబారు ఇడ్లీ, గాంధీనగర్ లో వెల్ కమ్ హోటల్ టిఫిను , తోపుడు బళ్ల మీద సోడాలు
తిరిగిరాని రోజులైపోయాయి
. మా
సత్యన్నారాయణపురం రూపమే మారిపోయింది సత్యనారాయణపురం
రైల్వే స్టేషన్ కాస్తా ఉపేంద్ర గారి పుణ్యామా అని
బైపాసు రోడ్ అయిపోయింది,
మేం చదువుకున్న కిష్టం మూర్తిగారి బడి ఆనవాళ్లు కూడా లేదు,
బాబూ రావు మేడ సెంటర్లో పాత కాలం నాటి విశ్వనాధంగారి హాస్పటల్ బిల్డింగ్ లో కొత్త కట్టడాలు వచ్చాయి.
గేటు దగ్గర కొమ్మూరివేణు గోపాల రావు గారి హస్పిటల్ బిల్డింగ్ పాతకాలపు చిహ్నం లా మిగిలి ఉంది, ఇటు వైపు సదాశివశాస్త్రి గారి ఆస్పత్రి వాళ్లబ్బాయి శ్రీనివాస్ నడిపిస్తున్నాడు.
శివాజీకేఫ్ , దుర్గావిలాస్ ,లో కమ్మటి టిఫిన్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో దొరకటంలా….ఘుమ ఘుమ లాడే ఆంజనేయ కాఫీ వర్క్స్ తీసేశారు,
కార్టూనిస్టు రాజన్ తర్వాత నడిచిన రాజన్ కిళ్లీ షాపు తీశేశారు, అంబికాయిల్లు మిల్లు లేదు , కన్నాంబ మేడ లో అపార్ట్ మెంట్ వస్తోంది, కుక్కల మేడలేదు, మారుతీ వ్యాయామశాల లో వ్యాయామం చేసేవాళ్లు లేరు పేరు మాత్రం నిలిచి పోయింది,
మహేష్ టైలర్స్ బుడే టైలర్స్ అని ఇద్దరు ఫేమస్ టైలర్స్ ఉండే వాళ్లు వాళ్లు తీసేసి దశాబ్దాలు అయ్యిందిట,
గాంధీనగర్ లో కాలవొడ్డున ఉండే జ్యోతి కాలేజి మూతపడింది . ఈశ్వర్ మహల్ రాధా టాకీసు గా మారి పూర్తిగా కూలగొట్టబడింది,
గాందీ నగరంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల హడావిడి లేదు, లక్ష్మీ ఫిలింస్, పూర్ణా పిక్చర్స్, విజయా ఫిలిమ్స్ ఇది వరకే మూసేశారనుకోండి కానీ ఆ సినిమా కళ ఇప్పుడు లేదు.
కేదారేశ్వర పేటలో సదాశివయ్య బిల్డింగ్ కూల్చేశారు, సిమెంట్ ఫ్యాక్టరీలో లోటస్ ల్యాండ్ మార్క్ వచ్చింది, మామిడికాయ పాకలు ఊరు చివరకెళ్లాయి, అయోధ్య నగర్ ఐస్ ఫ్యాక్టరీ లేదక్కడ ,
కానీ, కొంచెం ముందుకెళ్ల్తే కంపు కొట్టుకుంటూ బుడమేరు అలాగే ప్రవహిస్తోంది .
రోడ్లు విశాలం అయ్యాయి కానీ మనుషులు, మనసులు మాత్రం ఇరుగ్గా ఉన్నాయని పించింది, అరేయ్….అని ఆప్యాయంగా పలకరించే వాడే కరువైపోయాడు, వయసురీత్యా వచ్చిన పెద్దరికమో తెలీదు, భాధ్యతల బరువు వల్లో తెలీదు, పొడి పొడి మాటల పలకరింపులే మిగిలాయి కనపడిన మిత్రులతోటి .
అప్పుడు కార్లు పదుల సంఖ్యలో
స్కూటర్లు వందల సంఖ్యలో ఉండేవి .
ఇప్పుడు
మనుషులెంతమందో మోటారు సైకిళ్ళన్నున్నాయి
కుటుంబానికి రెండు కార్లున్నాయి
సౌకర్యాలన్నీ అవసారలయ్యాయి
మళ్ళీ మనం
బెజవాడ కొస్తే..
మన పంటకాలవని
100 అడుగుల రోడ్డు చేశారు
సాయంత్రమయిందంటే
అక్కడే..
చైనీసు నూడిల్స్,
రాజస్థానీ ఛాటు మసాలా అమ్మకాలు.
మధ్యలో మేమూ ఉన్నాం అని చెప్పుకోడం కోసం మిర్చీ బజ్జీ బళ్ళు.
లబ్బీపేట పొలాల్నీ ఆఫీసులు~షాపులు చేసేశారు.
లక్ష్మీ టాకీసు
జైహింద్ టాకీసు
రామాటాకీసు
విజయ టాకీసు సినిమా హాళ్ళయితే పదిహేనేళ్ళు పైనే అయిందట రూపుమారిపోయి. కావాలంటే
కొత్త మల్టీ ప్లెక్సుకి ఎళ్ళిపోతున్నారు
బార్లు పెరిగిపోయాయి,
సోడా కొట్లు పోయి..
“సోడా మెషీన్లు” వచ్చేసేయి
అలా మెషినెట్టుకోలేనోళ్ళు మాత్రం
బండి మీద నిమ్మ సోడా చేసుకుని అమ్ముకుంటున్నారు
ఇపుడెంత ఎతికినా పుల్లైసు రావట్లేదు
కావాలంటే ‘క్వాలిటీ’ ఐసుక్రీము దొరుకుతుంది
సత్యంకొట్టుకెళ్ళి ఒక “మట్టి పలక” ఇవ్వండి అందామంటే..
అయిబాబోయి
చాలా రోజుల తర్వాత సత్యంకొట్టు మాటిన్నాను ఎప్పుడో ఎత్తేశాడండి చెప్పాడాయన
కవితా స్కూలు ముందు జాంకాయలమ్మేటోళ్ళు రాట్లేదు.
లేస్ లేదా కురుకురే తింటన్నారు పిల్లలు.
ఇదేంట్రా ఊరిలాగయిపోయింది అంటే..
ఊరు మాత్రం ఎదగొద్దా?
మీరెళ్ళి హైదరాబాదులో ఉద్యోగాలు చేత్తే చాలా అని అడిగాడొకడు.
ఎదగాలి..
ఎందుకెదగొద్దు.
కానీ ఎదగడం అంటే
బిల్డింగులు,
మల్టీప్లెక్సులు,
స్వీటు కార్నులు
మాత్రమే కాదు.
మీరాటినే పట్టుకుని గొప్పనేసుకుంటే ఎలాగ.
మీకు బెజవాడంటే ఉంటున్న ఊరు మాత్రమే.
కిష్ణ కట్టవెంబడి అమరావతి రోడ్డులో ఉన్న కిష్టాయపాలెంలో ఉన్న పోలయ్య తాత అవధూతను చూడడానికి విజయవాడ నుంచి సైకిలేసుకుని 15 , 20 కిలోమీటర్లు వెళ్లే వాళ్లం ఇప్పుడు ఆ రోడ్డులో బాబుగారి బంగళా వచ్చి సెక్యూరిటీ పెరిగిపోయింది. ఏమిటో ఆ రోడ్డెమ్మట వెళుతుంటే ఆ అరటి, ఉల్లి తోటలు …….ఆరోజులు మర్చిపోలేం
మాలాగ వేరే ఊరెళ్ళి బతికేవోళ్ళకి మాత్రం బెజవాడంటే..
బోలెడన్ని జ్ఞాపకాలు,
అనుభవాలు,
ఇష్టాలు,
చదువుకున్న రోజులు, సైకిలేసుకుని తిరిగిన బెజవాడ రోడ్లు మిత్రులతో
కబుర్లతో గడిపిన చాలా ప్రాంతాలు
టిఫిన్లు పెట్టిన విజయ సూపర్ బజార్లు
ఊరులో జ్ఞాపకాలు చెరిపేత్తున్నారు అన్నపుడు మాకూ అంతే బాధేస్తుంది.
ఎంత మారిపోయింది
ఒకప్పటి మా బెజవాడ…..
Share this Article