‘రజాకార్’ అని ఓ కొత్త సినిమా వస్తోంది కదా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ అనుకున్నారు, బీజేపీకి కాస్త ఫాయిదా అవుతుందనీ అనుకున్నారు, తరువాత ఏమైందో వాయిదా పడింది… దానికి సంబంధించిన ఓ ఫంక్షన్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశం ఓ ప్రశ్నగా ఎదురైంది…
ఎప్పటిలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే వస్తానని చెప్పిన ఆమె… నవ్వుతూ… ‘త్వరలో రాబోయే నా సినిమా ఎమర్జెన్సీ గనుక చూస్తే నేను పీఎం కావాలని అస్సలు కోరుకోరు ఎవ్వరూ’ అని వ్యాఖ్యానించింది… అంటే ఇందిరాగాంధీని అంత నెగెటివ్‌గా చూపించారా..? లేక ఆమె పీఎంగా ఎదుర్కొన్న సవాళ్లను చూపిస్తూ పీఎం పోస్ట్ అంటే మజాక్ కాదు అని చూపించారా…? సరే, దాని మాటెలా ఉన్నా… ఆ సినిమా ఆమెకు చావోరేవో… ఆమె సొంత సినిమా… వరుసగా ఆమె సినిమాలన్నీ డిజాస్టర్లు… ఇండస్ట్రీలో ఉండాలో లేదో ఆ సినిమా తేల్చేయబోతోంది…
Ads
ఎమర్జెన్సీ అనగానే జగన్ విజయప్రస్థానం యాత్ర-2 సినిమా గుర్తొచ్చింది… జగన్ క్యాంపు అనుకున్నంతగా బజ్ ఏమీ రాలేదు… సోసో… నిజానికి మనం అందరమూ అనుకుంటున్నదే కదా… ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ అని… కానీ నిజానికి అవేమీ పెద్దగా క్లిక్ కావడం లేదు… జనం ఆసక్తి చూపించడం లేదు… ఎందుకంటే..? 1) అందరికీ తెలిసిన అంశాలే మళ్లీ వెండితెర మీద చూడాల్సి రావడం… 2) బయోపిక్‌కు గురికాబడే వ్యక్తుల జీవితాల్లోని నెగెటివ్ పాయింట్లన్నీ దాచిపెట్టి, పాజిటివ్ పాయింట్లను భూతద్దంలో చూపించడం… 3) తెలియని కొత్త విషయాల్ని ఏమీ చెప్పకపోవడం… ఇలా చాలా కారణాలు…
సావిత్రి జీవితకథలో అంతులేని ఎమోషన్ ఉంది, కన్నీళ్లున్నయ్, డ్రామా ఉంది… మంచి మనస్సు కూడా ఉన్న ఓ మహానటి జీవితం కడగండ్ల పాలైన తీరు ప్రేక్షకుడిని కనెక్ట్ చేసింది… సో, సూపర్ హిట్… మరి మహానటుడు ఎన్టీయార్ మీద తీసిన రెండు సినిమాలూ డిజాస్టర్లు… అంతా తను అనుకున్నట్టే జీవితం గడిచిన ఘర్షణారాహిత్య పయనం తనది… పైగా మొత్తం ఆహా ఓహో బాపతు చిత్రీకరణ… వెరసి ఢమాల్… పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమాలుగానే ప్రేక్షకులూ భావించి, తిరస్కరించారు…
ఒక క్రికెటర్ ధోనీ మీద తీయబడిన సినిమా కూడా పెద్దగా ఆడలేదు… ధోని పాత్ర చేసిన సుశాంత్ అద్భుతంగా ఆ పాత్రలోకి దూరినా సరే, సినిమాలో ఏ ఎమోషనూ లేదు, డ్రామా లేదు, కాన్‌ఫ్టిక్ట్ లేదు… ప్చ్, నాట్ ఇంప్రెసివ్… ఇంకా నయం పూర్తిగా నటులు లేదా క్రికెటర్లు అయితే వోకే… ఎటొచ్చీ పొలిటిషియన్స్ బయోపిక్సే జనానికి నచ్చడం లేదు… మొన్న శ్యామ్ బహద్దూర్ సినిమా హిట్టయింది… ఓ గొప్ప ఆర్మీ జనరల్ జీవితం అది… సూటిగా, ఏ కమర్షియల్ వాసనలూ లేకుండా, కథను చెప్పగలిగాడు దర్శకుడు…
పొలిటిషియన్స్ విషయానికి వద్దాం… భారత దేశ రాజకీయాలకు సంబంధించి గత కొన్ని దశాబ్దాల కాలంలో వాజపేయ చెప్పుకోదగిన గొప్ప లీడర్… కానీ తనమీద తీసి మై అటల్ హూఁ పెద్దగా క్లిక్ కాలేదు… పంకజ్ త్రిపాఠీ బాగా నటించినా సరే… భజన సినిమా కావడమే ఢమాల్ కారణం… అంతెందుకు..? తమిళ రాజకీయాల్లో మరుపురాని తలైవి జయలలిత బయోపిక్‌లో కంగనా గొప్పగా నటించింది… పాన్ ఇండియా రిలీజ్… ఎవరికీ పట్టలేదు, తమిళంలో కూడా డిజాస్టర్ అది… కేవలం భజన చేయడం వల్ల వచ్చిన నెగెటివ్ రిజల్ట్…
సేమ్, మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ ముద్ర వేసిన చరిత్ర బాల్ థాకరే… నవాజుద్దీన్ సిద్దిక్ బాగా చేసినా సరే, అట్టర్ ఫ్లాప్ సినిమా… థియేటర్లలో కరెంటు ఖర్చులూ రాలేదు… అలాగే మన్మోహన్ సింగ్ మీద ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ తీస్తే అదీ అంతే… ప్రస్తుత ప్రధాని మోడీ మోస్ట్ పాపులర్ లీడర్ వర్తమాన రాజకీయాల్లో… అయితేనేం, అదే పేరుతో వివేక్ ఒబెరాయ్ సినిమా తీస్తే చూసినవాడు లేడు… అసలు ఆ సినిమా వచ్చినట్టే ఎవరికీ గుర్తులేదు…
ఆమధ్య కొండా మురళి బయోపిక్ తీశాడు వర్మ… డిజాస్టర్‌కా బాప్… ఇప్పుడు జగన్ మీద తీసిన వ్యూహం, శపథం రాబోతున్నాయి… ఫలితం వేచి చూడాలి… వర్మ ప్రజెంట్ ట్రాక్ రికార్డు చూస్తే ఆ సినిమాల ఫలితం కూడా భిన్నంగా ఉంటుందనే ఆశలు పెద్దగా ఏమీ లేవు… ప్రతి మనిషిలోనూ చెడు, మంచి ఉంటాయి… కేవలం తోపు తురుం అన్నట్టుగా చిత్రీకరిస్తే చివరకు ఆయా లీడర్ల ఫ్యాన్స్, కార్యకర్తలు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు… అన్నింటికీ మించి ఈ బయోపిక్స్ దర్శకులకు అనేక ఆంక్షలు, పరిమితులు… క్రియేటివ్ ఫ్రీడం ఉండదు… ఫలితం… ఇదుగో ఇలాగే…!!
Share this Article